2, మే 2016, సోమవారం

నవగ్రహ స్తోత్రము

30/4/2016

నవగ్రహ స్తోత్రము

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)

 

 

శ్రీకర దినకర సోములు

నాకుజ బుధ ధిషణ శుక్రుఁ డాదిగ శనియున్

రాకేందు రిపులు రాహువు

నా కేతువులన్ స్మరింతు నమిత ప్రీతిన్                           1

 

ఘన తిమి రారిం గశ్యప

తనయున్ దురితౌఘహర్తఁ దలఁతున్ భక్తిన్

దినకరు జపాసుమ సమున్

జన నోద్దీప్త ప్రచండ సమ్యక్కిరణున్                                 2

 

విమలాంబుజ హిమ వర్ణున్

హిమ గిరిజాధీశ మౌళి హృత్ప్రియ వాసుం

గమలాగ్రజున్ శశాంకున్

నమస్కరింతును నిశాధి నాథున్ సోమున్                        3

 

అశనిద్యుతి సమ భాసితు

ని శక్తిహస్త విభవు ధరణీ సంజాతున్

విశ దాంగారక నామున్

భృశ మంగళకరు నుతింతుఁ బేరిమి తోడన్                        4

 

గమ్యా ప్రమేయ రూపున్

రమ్య ప్రియంగు నవ కుట్మల సమశ్యామున్

సమ్యక్సత్త్వ గుణ నిధిన్

సౌమ్యగ్రహ బుధు నుతింతు సమ్మోదముగన్                     5

 

అమర ముని వరాచార్యున్

విమలాత్ముం గాంచన నిభ విలసిత దేహున్

సముచిత రీతి బృహస్పతి

నమస్కరింతు నిల భక్తి నలినజ కులజున్                         6

 

సకలాసుర వర గురువుఁ గ

నక సన్నిభ నవ్య కుంద నాళాభాంగుం

బ్రకటిత శాస్త్రాచార్యుని

నకలంకు నుతింతు శుక్రు నగ్ని ముఖు నిలన్                    7

 

యామున సమాన దేహ

శ్యామున్ ధర్మాగ్రజు రవి సంజాతున్ ఛా

యామార్తాండ సుపుత్రున్

వేమారు నుతింతు శనిని విలసిత గాత్రున్                         8

 

అతి వీరు నర్ధ కాయుని

సతి సింహిక ముద్దుపట్టిఁ జంద్రా దిత్యా

మిత దళనాసక్త మతిన్

సతతము రాహువు నుతింతు సద్భక్తి నిలన్                      9

 

కుసుమామల దళ సన్నిభు

నసదృశ రౌద్రాత్ము ఘోరు నతులిత రౌద్రున్

లసితగ్రహ తారా విభు

వసుధం గేతువు నుతింతుఁ బరమప్రీతిన్                          10

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి