1, ఆగస్టు 2016, సోమవారం

సమస్యాపూరణ_ఆగస్టు 2016

దరహాసమాన వదనాం
బురుహా రుచి భాసమాన పుణ్యతర శుభం
కర చిత్త సత్కృ తాపహృ
దరిషడ్వర్గమ్ము హితము నందించు సదా                                                60

తరుణం బియ్యది శాంతి కాములకు వే తర్కింప సౌఖ్యార్థులై
ధరణీ వాసుల నెల్ల నేచు కర మంతశ్శత్రు వర్గంబు భీ
కర బాహ్యాగత శత్రు సంచయమునే కాదిద్ధరన్ గెల్చిన
న్నరిషడ్వర్గము మానవాళికి హితం బందించు నెల్లప్పుడున్                     59

పుండ్రము లేని వైష్ణవుడు పూర్ణమనస్కుడు దీన బంధువుం
దీండ్రపు జన్మదుఃఖములఁ దేరగ నందన దారలింక కో
డండ్రుల కెల్ల పంచ సిరి డంబము నైహిక వాంఛలం దిలం
దండ్రి యసంగ్రహత్వమును దాఁ గడు మెచ్చె సుతుండు చూడరే            58

జన్మ నిడె మరువకు మరు జన్మ నైన
నెన్న విద్యయ విత్తము కన్న మిన్న
పట్టుదల వహించి చదివి మెట్టు లెక్కి
తండ్రి ధనహీనత కతన తనయుఁ డెదిగె                                          57

విషపు చుక్క పాల విరుచు విధమ్మున
హితము లైన గుణము లెన్ని యున్నఁ
జాల వయ్య యిల నసందర్భ వికృత కో
పాల వలన నష్టమే లభించు                                                         56

శూలోగ్రాయుధ తేజ గౌతమ ఘనక్షోభుండు సుత్రాముడే
బాలార్కాభ సునీథ శాపహతు డప్పాండుక్షితీశుం డలన్
కాలాగ్నిద్యుతి భార్గవక్షయుడు నక్కర్ణుండు సద్విప్ర శా
పాలే కారణ మన్ని నష్టములకున్ భద్రమ్ము దుర్యోధనా!                    55

అద్దము వోలె శుద్ధము మహాత్ముల చేష్టలు చిత్త వృత్తియు
న్నిద్దము చంద్రబింబసమ మిద్ధర కల్మష హీన చేతనన్
నిద్దము లెంచ మాక్షికపు నిర్మల బిందువు లిద్ధ వాచ్యముల్
పెద్దలఁ జూడగా నెపుడు పిల్లలవోలె‌ వచించు చుందురే!                         54
[ఇద్దము/ ఇద్ధ ము=కాంతివంతము; నిద్దము=స్నేహపూరితము ,
 నునుపు;మాక్షికము= తెల్లతేనె]

ఈతరపు యువకుల యాలోచనలు:
నిద్దుర పొమ్మను సుఖముగ
తద్దయు వింత తలపులు గద! నుడువ సుద్దుల్
వద్దనుముర మన కిక నా
పెద్దలు, వచియింతు రెపుడు పిల్లలవోలెన్                                           53
[తలపులు=అభిప్రాయములు]

మొద్దులు చిన్నబుచ్చఁ గడు మూర్ఖపు సుద్దుల సద్దు సేయకన్
మిద్దెలు లేక యున్న నిట మీరిన విద్దెలఁ బెద్ద నంచుఁ దాఁ  
బద్దును బూని శుద్ధ మతి బద్ధ పదార్పిత వృత్తి గ్రద్దనన్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్           52

కదనములఁ గాలు దువ్వక
పదిమందికి మంచి సేయ పరువున బ్రతుకే
పదిలముగ నుండ సుఖముగ
నిదురించినవాఁడు కీర్తినే గడియించున్                                  51

పుత్ర రూప శత్రువులు కర్క శాత్ములు,
దారుణ వచనములు మీరి, కంక
గాత్ర ధారు లెల్ల పిత్రార్జితద్రవ్య
కలలు గనెడి శిలలు పలుక గలవు                                        50
[కంకము = రాబందు; కల = భాగము]

విలపింపంగ నిరంతరమ్ము జనులం బీడించు దుష్టుల్ ధరా
తలమందెప్పుడు చౌర్యవృత్తిఁ జని చిత్తక్షోభ దుర్భాషలం,
దలలం దీసెడి క్రూరజంతువులు నిత్యంబుగ్ర దుష్కర్మలం
గలలం గాంచెడు గండశైలములు, పల్కంగల్గు స్పష్టమ్ముగన్        49

మురహర భవరాజ్యపహర
హరాంబుజభవ సురనాధ హలధర శివ భా
సుర వచనార్చిత భీకర
రుద్రవ తృణారణి పరమపదద కృష్ణా                                     48
[తృణ + ఆరణి = తృణారణి : తృణావర్తుడు] 

ముదిత లెల్లరు దీపావళి దినమునను
సదమలాత్ములై యాటల సంద డించఁ
దమకమున గాన రెవ్వరు తైల మయ్యె
నీరు, చాలక దీపము లారిపోయె                                              47
[నీరు = అల్పము]

తోరపు సంతసమ్మునను దోయజ నేత్రులు సంభ్రమమ్ము లే
పారగ నొక్క చోట సుమవాటిక నుంచిరి దివ్వె లింపుగన్
వారిజనేత్ర కన్గొనుము బారులు తీరిన ,నూనె జూడగా
నీరము లేక, దీపములు నిక్కముగాఁ గొడిగట్టెఁ జూడుమా             46
[చూడగాన్ +ఈరము = చూడగానీరము; ఈరము = దట్టముగ]

అన్యోదార విధాన ధర్షణ ఘనాయత్తప్రబుద్ధుండునున్
పణ్యాపణ్య వివేక హీనుడు మహా పాపాత్ముడుం గ్రూరుడు
న్నన్యాయార్జిత విత్తమందు నఘ నాశార్థంబు సంరంభియై
కన్యా! దాన మొనర్చినన్ నరకమే కల్గున్ గదా దాతకున్              45

రక్తము తీసుకోవడము తప్పు కాదు త్రాగడమే తప్పు:
అన్యాయము గాదిల నసృ
గన్యాదానమ్ము  సేయఁ, గలుగు నరకమే
యన్యుల రక్తము త్రాగిన
విన్యాసమ్మున నిడుమల విపరీతముగన్                                     44                                    
[అసృక్+అన్య+ఆదానము= ఆసృగన్యాదానము : తనది కాని రక్తము 
పుచ్చుకొనుట]

దూర్తులు శత్రురాజులు నధోగతిఁ జేయగ నెంచి ఘోర సం
వర్తముఁ బోలు యుద్ధమును వర్తిల జేసిన భీమ భండనా
వర్తన మేల నీకనుచుఁ బన్నుగ బొట్టిడి తా జయార్థియై
భర్తను బైటకున్ దరిమె భారతనారి కళాప్రపూర్ణయై                        43

గొప్పలకు బోయి నిత్యము నప్పు జేసి
పప్పు కూడును మరగిన యప్పలమ్మ
అప్పు లిచ్చిన మిత్రుల ముప్పు నెంచి
భర్తను బయటకుఁ దరిమె భరతనారి                                            42

భామామానస చోరు డిద్ధరను గోపాలుండు గోవర్ధనుం
డా మాహాత్మ్యము నెంచ నెల్లరకు నూహాతీతమే వేగమున్
దామార్థంబునఁ బోయి వత్తుమని యుత్సాహంబు మీరన్ సఖీ
రామా! రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే               41
[రామ = అందమైన అమ్మాయి, వనిత]

భామ లెల్ల కలసి పన్నుగ జంతుప్ర
దర్శనస్థలమ్ముఁ దరచి చూడ 
ప్రేమ మీర చేరి వేగ సంతసమున
రామ! రమ్మటంచు రాధ పిలిచె                                                    40
[రామ = దుప్పి]

సామాన్యంబె తలంప సుప్తసుఖ విశ్రాంత్యాది సౌఖ్యంబులున్
వామాక్షద్వయ నేనెరుంగుదును నిర్ద్వంద్వమ్ము  ప్రావీణ్యులన్
భామల్ కన్యలుమాభిధానులను తల్పశ్రేణులన్  రాగ మో
దోమల్  గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్                  39
[రాగమోద + ఉమల్ =రాగమోదోమల్ ;  
 ప్రేమచేసంతోషితులైన ఉమా నామధేయులు] 

ఈమహిఁ బరికింపగఁ దరు
ణీ మణులట రౌద్రభద్ర నేత్రులు ఘనులే
వేమరు నిద్ర చెరచు మగ
దోమల్ గుట్టినను రేయి దోషరహితమే                                              38

మూడిన దేశ భాగ్యమును మూరిన దుర్విధి నేమి చెప్పుదుం
బాడుచు నాడుచుం బరమ పావన లోకము! కల్లు పాకలోన్
వేడుక సేయ నెంచి చన వీరినిఁ గూడఁ ప్రబుద్ధుఁ డొక్కడున్
గాడిద! వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్                 37                          
[కర్ణపుటము = చిల్లుదొప్ప;  కల్లుపాక చిల్లు దొప్ప వంటిదే. చిల్లుదొప్పలో 
పోసిన నీరు కల్లుపాకలో పెట్టిన డబ్బు(ఆరోగ్యము కూడ) మాయమే:]

ఆడవు బాలుర తోడను
వీడవు రోదనము నిట్టి వెఱ్ఱులు గలరే
చూడ వదేమిర యీగను
గాడిద! చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్                                          36

అన్యము లెన్నియున్న సరి యౌనె తలంపగ బువ్వ కిద్ధరన్
మాన్యులె యన్న దాతలును మానవ జాతికి ప్రాణ దాతలున్
శూన్యపు పల్కు లేల నిరఁ జోద్యమె యమ్మగఁ జూడఁ ,గాదె మే
ధాన్యము, వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్                     35
[మేధా+అన్యము=మేధాన్యము: బుద్ధిలేమి]

దేవుడు ప్రత్యక్షమైన నేమి కోరుకోవాలాయని తర్కిస్తున్న మిత్రుల భాషణములు:
ముక్తి కాముల కిల మోక్ష మిచ్చునతడు
భక్త జనులఁ బ్రోచు బాంధవుండు
మేను నిల్ప జాలు మేలైన వసువు,సు
ధాన్య మేల, మనకు ధాన్యముండ                                                 34
[సుధా+అన్యము=సుధాన్యము: అమృతేతరము]

గగనాంతర సీమ వర శు
భగగ్రహామర గురుప్రభాకాయ విలా
స గమన వికాస మానుడు
భగణంబున గురువు నాస్తి పండితులారా                                         33
[ భగణము = నక్షత్ర సమూహము]

జగతిం గూర్చు మనోహరమ్ములగు సంజాతార్థ పద్యావళుల్
విగతార్థంబని చెప్ప నొప్పదు గదా వేధింప రాదేరికిన్
ఖగరాజేశ్వర గామి యాన "న" గణా ఖ్యాతం బహర్బాంధ వా
భ గణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్               32

సత్య లోక నివాసుడు నిత్య సృష్టి
కార్య భార నిమగ్నుడు కమల నయన
శారదాసతి భారతి సతత భర్తృ
రతినిఁ బెండ్లాడె వారిజసుతుఁడు నిజము                                             31

రత జలజాస నాంచిత పరాగ సమన్విత గాత్ర శోభితన్
సిత మిహికాఘృణిజ్వలిత చిద్విభ వానన చారు మూర్తినిన్
నుత సురసంఘ తోషిత తనుద్యుతి భాసిత కీరహస్త భా
రతిని వివాహమాడెనఁట బ్రహ్మ నిజమ్మిది నమ్ము మిత్రమా                    30

చేతోజాత వికార కర్మ చయ దుశ్శీలోగ్ర పాపాత్ములున్
వాతద్యుమ్న సువాజ తుల్య మహదైశ్వర్యోన్మదావేశులున్
తాతల్ తండ్రుల పేరు చెప్పుకొను విద్యా గంధ శూన్యాంగులున్
స్వాతంత్ర్యమ్మున లాభ మందిరి గదా స్వార్థంపు నేతల్ ఘనుల్             29

భీతిని వీడి చరింపగఁ
జేత నగునె మరి నిశీధిఁ జేడియల కిటన్
నేతల కబ్బును సుఖములు
స్వాతంత్ర్యము లబ్ధిఁ గూర్చె స్వార్థపరులకున్                                      28

అంజన మద్ది జూచిన మహాద్భుత మియ్యది కాన నేర్తుమే
పుంజు కొనంగ బాహు బలమున్ మశకమ్మున కెట్లు శక్యమౌ
గుంజది లేక యుండినఁ బ్రకోపపు మాటలు గాక యెక్కడా
కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్?        27

కంజదళాక్ష సఖుడు నరి
భంజను డర్జునుని దక్క పాండవుల నటన్
భంజించె సైంధవు డకట
కుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్                                 26
కంజదళాక్షున కత్యను
గుం జెలువుం డోడెను గలఁకున బోయలకు
న్నంజని సుతధ్వజుండును
గుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్                                 25

పారక ధైర్యచిత్తుడు కృపామయు డా ద్రుపదుండు వీరుడే
కౌరవపాండవేయ చిరకాల మహోద్ధిత వైర భావ సా
కార మహానలజ్వలిత గాఢ సుగోత్ర నికాయ తుల్య మా
భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్          24
[ పార్థుఁడు = రాజు]

ధర్మా రాజు భీమునితో నర్జునుని గురించి చెప్పు సందర్భము: 
నారీ మణులను గొని కాం
తారమ్మున బోయల నల తాకగ లేకన్
భీరువు వలె తా నక్కట
భారత! యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్                                     23
[సచ్చు= శక్తియుడుగు]

కల్ల యనంగ రాదు మన కంటికి కన్పడు దైవమూర్తులే
యుల్లము నందు నిల్పి కర మొప్పుగ సేవలు సేయ నొప్పగుం
బ్రల్లద మాడగం దగదు భక్తి విహీనత దుష్ట బుద్దినిం
దల్లికిఁ దండ్రికిన్ దగఁ బ్రదక్షిణ సేయఁగరాదు సంతుకున్                    22

ఖగరాజ గమను డమరవ
రగణ సుపూజిత బకారి రయమున పల్కెన్
భగవంతు డయిన, సుతుఁ గని
తగదు ప్రదక్షిణము సేయఁ దలిదండ్రులకున్                                    21

హృద్యమ మైన పద్యమ సహింపగ రాదన తేటతెల్లమే,
సద్య మొనర్చు ఘాతుకము సత్కవి సింహము ధర్మనిష్ఠులం
దాద్యుడు నుద్యమించి త్రుటి నారిట “తా”నిడ శస్త్రతుల్యమై
పద్యము కాలకూటవిషభాండము గాదె, కవిత్వవేదికిన్                     20

పెద్ద కవినటంచు దలచి హద్దు లేక
తద్ద వికృత శబ్దమ్ముల సద్దు సేయు
నిద్దుర చెరుపుటకు గాక ముద్దియ కట
పద్దియము కాలకూటంపు ముద్ద గాదె                                            19

ప్రేమ మయుడు కాపాడును
రాముఁడు ధర్మమును,  జెఱచె, రాజులు మెచ్చన్,
బీమ నిశాచర కోట్యు
ద్దామాహవ దుర్జయ బల దర్పోద్ధతమున్                                          18

గోముగ కౌశికాధ్వర మకుంఠిత దీక్ష వహించి కాచె భూ
భామఁ దరింప బుట్టె నిల భార్గవ కార్ముక జేతయున్ మహా
భీమ మయోనిజం దనుప వీర్యమునన్ మిధిలాపురమ్మునన్
రాముఁడు ధర్మమున్ జెఱచె రాజులు యోగులు సంతసింపఁగన్           17
[ధర్మము= విల్లు]

వారి బలంబు ప్రస్ఫుటము భండన మందు నెదిర్చి పోరగన్
భీరుకులన్ననొప్పునె యభేధ్యులు పోరున ధర్మ వర్తనుల్
శూరవరుల్ క్షమాగుణ సుశోభితు లల్పు లనం దలంచగన్
భారత యోధులన్న రిపువాహినికిన్ దృణకల్పులే కదా                        16

మాతృ రక్షణ మరువరు మదిని నెపుడు
యుద్ధ మన్నను వెరవక సిద్ధ మండ్రు
దుష్ట శత్రు సేనలు నుసి దోమలైన
భరతయోధులు చీమలు పగతురకును                                              15

భూరిగ విద్యలబ్బు నిల మూర్ఖున కైనను విత్తమున్నచో
కోరి వరించు మంత్రివరు కూరిమి పట్టికి నెల్ల సౌఖ్యముల్
ఘోరము లెన్ని చేసినను గూలరు వింతగ నేతలైనచో
నూరక కల్గు భోగములు యోగము గూడిన వారి కిద్ధరన్                       14

భూరి విశాలాశ్రమములు
ధారాపాతాగతప్రదానములు ఘనో
దార కరవిహీనాయము 
లూరక భోగములు గల్గు యోగులకు ధరన్                                           13

అవినీతు యశఃకాము న
పవిత్రు నింకఁ బొగడంగ వలెనని యొక స
త్కవి చింతాక్రాంతు డగుచుఁ
గవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్                                                      12

అవనీ జాత కవీశ్వరోత్తముడ వయ్యా యంచుఁ గీర్తించుచుం
జివరం గప్ప భుజాగ్ర సీమలను కౌశేయోత్తరీయంబునున్
వివశత్వంబునఁ బోవగా వలెను దా వెచ్చంబు లెట్లో యనం
గవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై                    11

మత్తకోకిల:
వే నశించెను బంటలన్నియు వెల్లువాయెనె యప్పులున్
వాని దీర్పగ దారి లేకను బంటభూముల నమ్మగం
గోనకోనల నీరు నిండగ ఘోరమయ్యెను, మెండుగన్
వానదేవుఁడు చూపఁగా దయ, వచ్చెఁ గాటక మెల్లడన్                               10

సంతు లేదని యొక యింతి వంతఁ జెంది
పంతమూని పూజించె దిక్పాలకులను
సంతసంబున వేగ సుదంతి నంత
వరుణదేవుఁడు కరుణించెఁ, గరువు వచ్చె.                                                   9
[కరువు=గర్భము]

గణ సాధనక్రియా గమనులై నిస్సార పదముల నాశ్రయింపంగ నేల
ధృతి వీడి త్వరపడి యతిసాధనార్థము మతిలేని మాటల పతన మేల
ప్రాసప్రయాసలఁ బసలేని సుద్దుల ఘోరంపు భావమ్ము గూర్ప నేల
కవనంపు నెపమున నవమాన ధోరణి వినయమ్ము విలువలు వీడ నేల
భావ శుద్ధియ కరువైనఁ బద్య మేల
వ్యర్థ పద సంకులమ్మున కర్థ మేమి
చిత్త మలరింప నేర్వని వృత్త మేల
సత్య మింక కవనము నిస్సత్త్వ మయ్య                                                       8

స్తవనీయాంశ విశేషభావ యుత శబ్దార్థప్రభా రాశినిన్
సువిశాలాస్వనితప్రమోద భరసంశోభం గవిత్వమ్మునే
యవమానింప విచక్షణా రహిత మోహావేశు లెట్లందురో
కవనం బయ్యెను లుప్తసత్త్వ మది శ్లాఘ్యంబౌట బొంకే సుమా                           7

వర దేవార్చిత తర్పితాత్మ  ఘనకూపారప్రకాశమ్ము భీ
కర కాంతార మహీధరప్రకర విఖ్యాతాభి భాతిన్   నిరం
తర కోపారుణ నేత్ర భీషణ మృగాధ్యక్షాది సత్త్వాళి  గ్రు
మ్మరు భూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్                        6

నర నారాయణు లాదిగ
గురు వాల్మీకియు శుక జనకులును కలిని శం
కరులు నర రత్నముల్! వే
మరు భూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్"                                                   5

నవ్యవిధిన్ వక్షావృత
భవ్యవిదారణ మొనర్చి వైద్యవరేణ్యుల్
దివ్యముగఁ జేసిరి హృదికి
సవ్యప్రసరణ నిమిత్త శస్త్రచికిత్సన్                                                                   4
[భవ్య=ఎముక; కటారి=కత్తి]

భీమ కాయులు నరిబలాభేద్య వరులు
రాజ సన్మాన కీర్తి విరాజితులును
సమరశూరులు  చీ! మలఁ జంపువారు
పాఱ భీతిలి  సిగ్గిఁడి భావ్య మౌనె                                                                      3
[మలఁ జంపువారు = కొండను సహితము నాశనము చేయగలవారు]

వేరే భావము నేర డాశుకుడు దా బింబోష్ఠులం జూచినన్
రారమ్మాయని యూర్వశీసతియె కోరం గాదనెం బార్థుడే
గోరంజాలునె నన్ వరూథిని మహా ఘోరంబనెన్ విప్రుడున్
ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్?                                2

ఆరత్నాకర మిద్ధరా కలిత వేలాయత్త మైనట్టులన్
వీరాగ్రేసర ధీరచిత్త కదనోద్వేగప్రభా శీలురున్
ధారాళస్ఫుట విత్త దర్పిత మహా తంత్రజ్ఞ మేధావులున్
ధారాదత్తము సేయ సంపదలు కాంతాదాసులే పూరుషుల్                                  1



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి