8, జూన్ 2017, గురువారం

పద్యాలు జూన్ 2017 ...

కనిపెంచి పెద్ద జేసిన తల్లిదండ్రులఁ జదువులు నేర్పిన సద్గురువులఁ
బుట్టి పెరిగినట్టి పుణ్య భూమిని నాట పాటల జదివిన పాఠశాలఁ
గలసి మెలసి తమకంబున నాడిన చిననాటి దట్టంపుఁ జిట్టి సఖుల
నాపద లందున నాదుకొన్న ఘనులఁ జేయూత నర్థించి రోయు జనుల
వృద్ధ జనుల నెల్ల వెలఁదుల బాలల
మూగ జీవ రాశిఁ బుడమి నున్న
వినయ మతిశయిల్ల విబుధ జను లెపుడు
విస్మరింపఁ దగదు విమల మతిని                   20/1/2016.                                          15

15/11/2017 రవీంద్ర భారతిలో ప్రపంచ తెలుగు సభకు
తెలుఁగు వెలుఁగు:
 సుకవి త్రయాంచిత ప్రకటి తాంధ్ర సుమహా భారత సన్నుత వాఙ్మయముల
సహజ కవిత్వ భాస విరాజి పోతన భాగవత మధుర పద్య రుచులఁ
గవితా పితామహ కవిసార్వభౌమ వాక్పటిమ విరాజిత కావ్య ఘృణుల
సూర నాది విబుధ చూడా మణి గణ విరచిత వాఙ్నిధి వర రత్నములను

దక్షిణాంధ్ర యుగ సుదర్శిత శబ్ద లా
లిత్య పటిమ క్షీణ నిత్య తప్త
మైన నాధునిక యుగాభివృద్ధినిఁ గాంచ
దేశ భాష లందు తెలుఁగు లెస్స                                                                        14

వైద్య ప్రాభవ రక్షి తోత్తమ జన వ్రాతోప లబ్ధుండు స
ద్విద్యా దాన విరాజమాన సుయశో విఖ్యాత మాన్యుండు దా
నాద్యం తామల చింతనా భరిత దేవారాధనా తత్పర 
ప్రోద్యోగవ్రజ  నాయకుండు బదరీ బాబూ మహా రావనన్                                              13

దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్                                                    12 

బాల యుగళ భీమ పాదద్వ యార్భటి 
బాల గురు విలగ్న భార పటిమఁ 
బర సువీర జఠర గురు ధారణ మహిమఁ  
బాఠ్య పఠన చతుర బాలుఁ డయ్యె!                                                                               11

వసుదే వాత్మజుఁ బూతనా విష పయఃప్రాణాపహారిన్ హరిం 
బ్రసవస్నిగ్ధ పదాహ తాంగన యశో రాజద్బలుం జక్రిఁ జ
క్రసమీ రాసుర ఘోర భంజను మహా కాలాహిదర్పాంతకున్ 
వసుధా భృద్ధర పాణిపల్లవ మహా బాలున్ మదిం గొల్చెదన్    2/9/2018                                 10      
మాతాపిత్రాది స్మరణ:
1/12/2016
కరివరద పదస్మృతి త
త్పరమతి విమల గుణధామ పావన పేర్రా
జ రుచిర నామమున వెలుఁగు
విరాజమాన సురభరిత పితృలోకమునన్                                                                         9

తరళ సాధ్వీ లలామ శుద్ధచరిత సుగు
ణచయ విభ్రాజమాన వినమ్ర లలన
సంతత మృదు భాషి విమల చారు శీల
సత్యసుందరి మాతల్లి ముత్య మెంచ 1/12/2016                                                              8

తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్                                                7

నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే 19/7/2017                                           6

మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత  మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్ 21/11/2017                                           5

సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్ 12/5/2018                                   4

ఈ ధవళాక్షిం దలఁతున్ 
సాధుజ నాదరణ శీల సాగర కన్యా
ఖ్యాధిక సచ్చరిత రమా
మాధవ చరణ స్మరణ సమాహిత చిత్తన్ 21/8/2018.                                                                3

 సేవిత బంధు సంచయ వశీకర వేంకట రామ యుక్త ల
క్ష్మీవర నామ భూషిత సుకీర్తిత సద్గుణ భక్తి భావ సం
ఘావృత శీల సంతత నిజాత్మ విభూన్నత సక్త చిత్త సం
భావిత నిత్య దాన గుణ భాసిత కోమలి నెన్న శక్యమే 21/8/2018.                                               2


దారిఁ జేరఁ గోరి యారడిఁ బారరె
వీరు వారు నైనఁ గోరి రారు
మీర లేరు వారి వారి నుదిటి గీత
వారి వారి దారి యేరి కెఱుక!             8/6/2017                                                                     1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి