31, అక్టోబర్ 2022, సోమవారం

Talupulamma Tallii Trisati

తలుపులమ్మ తల్లీ త్రిశతి.

వింశతి పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.

5/1/2020.

 

తలుపులమ్మ వృత్తము.

శ్రీకరమై వెల్గు నీ పాద చిహ్నములు మది నిల్పి భక్తిన్

నీ కథ లన్నింటి నింపార నెమ్మి దలఁచుచు సంతత మ్మే

వీఁకఁ జరింపంగఁ గారుణ్య వీక్షణముల నొసంగుమా దే

వీ! కరుణాంభోనిధీ! మాకుఁ బెన్నిధి! తలుపులమ్మ తల్లీ!

1.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

ఒక్కొక గ్రామంబు నందుందు వొక్కొక యభిధఁ బ్రస్తుతింపం

జక్కఁగ నిత్యమ్ము మా యూరి సంతస మలర గోగులమ్మా

దక్కఁగ నీకక్క ముత్యాల తల్లినిఁ గదిసి యుంటి వమ్మా

పెక్కురు మ్రొక్కంగ నిన్మాకుఁ బెన్నిధి! తలుపులమ్మ తల్లీ!

2.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

అమ్మలఁ గన్నట్టి పెద్దమ్మ వందఱిఁ గనుచు నుండఁగా నే

లమ్మరొ మాకింక దుఃఖంబు లారయఁ బుడమి భక్తితో మే

మిమ్ముగ నింగొల్వఁ గెందమ్మి యీక్షణ శశి నిభాననా నీ

విమ్మిల మా కెల్ల సౌఖ్యమ్ము లింపుగఁ దలుపులమ్మ తల్లీ!

3.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

అజ్ఞత నిన్నేర కుండంగ నన్య సురలను గొల్వఁగా నే

విజ్ఞులు బోధింప రారమ్మ పేర్మినిఁ గడు విచిత్రమే య

ల్పజ్ఞుల మేమమ్మ నీవుండఁ బన్నుగ వెతలఁ గాంతుమే వే

దజ్ఞవు లోకైక మాతా! యుదారద! తలుపులమ్మ తల్లీ!

4.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

విద్దెలు రాణించుఁ గీర్తింపఁ బెద్దగ నుతుల నిన్ను భక్తిన్

ముద్దుగఁ బ్రొద్దెల్లఁ బాడంగ నొవ్వ గళము భవమ్ము లాఱున్

సుద్దులఁ బూజింప నిత్యమ్ము చొప్పడు సిరు లనంత రాశుల్

తద్దయు నిన్నెంచ నీవౌదు త్రాతవు తలుపులమ్మ తల్లీ!

5.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

తద్భవ సంసార పాథోధి దాటఁగఁ దరణ మౌదు వమ్మా

యుద్భవ పాపౌఘ వల్లీ వరోగ్ర నిశిత కుఠార మీవే

యద్భుత కారుణ్య రత్నాక రాంబువుల మము ముంతువమ్మా

సద్భట సంచారవై కొన్ము సన్నుతిఁ దలుపులమ్మ తల్లీ!

6.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

చక్కఁగ నా శారదా దేవి సంస్తుతి వలనఁ గల్గు విద్యల్

మక్కువ నా మాధవీ దేవి మన్ననల నగు విత్త రాశుల్

తక్కక నా పార్వతీదేవి దక్కెడు కొలువ మంగళమ్ముల్

సిక్కును నిన్నెంచి కీర్తింప శీఘ్రమ తలుపులమ్మ తల్లీ!

7.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

మూకలు పల్కంగఁ బల్కంగ మూరెన తలఁపు తల్పు గాఁగన్

వ్యాకరణ మ్మేల మాకింకఁ బన్నుగఁ బలుక నట్టు లైనం

దాక నిరోధింపఁ దల్పుల్ గదా కలుషితములౌ తలంపుల్

ప్రాకటమే యమ్మ నామమ్ము పావని తలుపులమ్మ తల్లీ!

8.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

వత్తురు నిన్వేడ నిత్యమ్ము పామర జనులు దూరదర్శుల్

తెత్తురు మ్రొక్కుల్ నిదానమ్ము తీర్చఁగఁ జెలఁగి నీకు భక్తిం

జిత్తము నందుంచి మత్తిల్లి చిందు లలయఁగఁ ద్రొక్కుచుందుర్

వత్తువు కాపాడ నీవంచు వారక తలుపులమ్మ తల్లీ!

9.       

 

 

 

తలుపులమ్మ వృత్తము.

జాతర వీక్షింతు వుప్పొంగి చారువదన విలాస లీలన్

మ్రోతలు మ్రోగంగ వాద్యాలు ముమ్మరముగఁ బురమ్ము లోనన్

నేతుల నైవేద్య మీయంగ నేరముల గణియింప కమ్మా

వ్రాతలు మావెల్ల మార్చంగ రమ్మిఁకఁ దలుపులమ్మ తల్లీ!

10.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

కన్నులు సూర్యుండు చంద్రుండు గాఁగ ననిశము వెల్గుచుండం

జెన్నుగ శూలంబు హస్తంబుఁ జేరి మఱి  విలసిల్లు చుండం

బన్నుగ సింహంబు రౌద్రంపు వాహన మగుచుఁ గొల్చు చుండన్

దన్నుగ నీవుంటి వమ్మా సతమ్మిలఁ దలుపులమ్మ తల్లీ!

11.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

ఎవ్వరు నేమేమి నీ కీయ నీ ధర నెలమిఁ గొందువమ్మా

యెవ్వరు కేల్మోడ్చి  నిన్నెంచి యేమొఱ లిడినఁ గాతువమ్మా

దవ్వులఁ దా ముండి రాలేక తల్చ నిను మది వత్తువమ్మా

నొవ్వులు రావమ్మ నోఁచంగ నోములు తలుపులమ్మ తల్లీ!

12.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

పేరులు నీ కుండు వేవేలు పెద్ద వట యిల నమ్మలందుం  

గోరఁగ నెవ్వారి కిన్నీవు కొంగు పసిడివి యౌదు వమ్మా

దారులు లేకున్నఁ జూపంగ దారిని నవుదు వీవు దిక్కే

పేరిమిఁ జూడంగ మా కీవు పెన్నిధి తలుపులమ్మ తల్లీ!

13.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

రా వకటా సుద్దు లర్చింప రాగముల దయఁ జూపు మమ్మా

లే వకటా సొమ్ము లర్పింప లేశమును నను గావు మమ్మా

చేవయు నా బొంది లేదమ్మ చేరి నిను గొలువంగఁ దల్లీ

యే విధి నన్నింక రక్షింతు వింపుగఁ దలుపులమ్మ తల్లీ! 

14.    

 

            

 

తలుపులమ్మ వృత్తము.

చాలిఁక నూరంత మార్మ్రోగు చప్పుడులు గుడి దద్దరిల్లం

జాలిఁక నాట్యమ్ము లల్లాడఁ జట్టలు వెకిలి చేష్ట లింకం

జాలిఁకఁ గ్రూరంపుఁ బాపంపు జంతు బలు లవి మాన్పుమమ్మా

చాలదె పూజింపఁ జూపించి శాంతము తలుపులమ్మ తల్లీ!

15.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

పర్వత పక్షాళి సంహార వాసవ ముఖ సురాళి వంద్యా!

పూర్వ సకౌబేర దిఙ్నాథ మోద కర జగ దేక మాతా!

సర్వజ నారాధ్య దుర్భేద్య శక్త్యనుపమ శివార్ధ భాగా!

యుర్విని నీ వుండ మాకుండు నూఱట తలుపులమ్మ తల్లీ!

16.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

గుహ్య తరం బౌను నీమాయ కోమలి సురవ రాళికిన్ నీ

వాహ్యము దైత్యాళి కెంచంగఁ బ్రాణ పవన వినాశకంబే

లేహ్యము నీచూపు పాపఘ్న లేపన నిచయ సన్నిభమ్మున్

సాహ్యము నిత్యమ్ము మాకిమ్ము శాంభవి తలుపులమ్మ తల్లీ!

17.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

చక్ష్వమ లోత్తుంగ పక్ష్మ ప్రచార మిడు జన విహ్వలమ్మున్

భిక్ష్వవలోక ప్రకాంక్ష ద్రవీకృత విమల దివ్యచిత్తా

యిక్ష్వతి మాధుర్య ధారా మహేక్షణ రుచిర రూప! ప్రజ్ఞా

చక్ష్వవిరామ స్తుతీద్ధ ప్రజాక్షిద! తలుపులమ్మ తల్లీ!

18.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

సవ్యపుఁ జారిత్ర్య మే నూని సత్య గతిఁ జరియింప నిమ్మా

కావ్యము లల్లంగ భవ్యమ్ముగా మఱి గిరలు నేర నమ్మా

దివ్యతమం బైన త్వన్నామధేయము మది స్మరింతుఁ బూజా

ద్రవ్యము లర్పించి పూజింతుఁ దప్పక తలుపులమ్మ తల్లీ!

19.    

 

 

 

తలుపులమ్మ వృత్తము.

క్షుద్రము లా పూజ లేలమ్మ కోరుదు సలలి తాంతరంగా! 

రౌద్రము నీ కేల నూనంగ రాగమయ హృది భద్రకాళీ!

రుద్ర తనూద్భాసి తార్ధాంగ! లోలిత నయన పద్మయుగ్మా!

భద్రము లింపార మాకిమ్ము భార్గవి! తలుపులమ్మ తల్లీ!

20.    

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి