హింస యనఁ దగదు పురుషో
త్తంసులఁ గాపాడు నట్టి తఱి నెంచఁగ వి
ధ్వంసమున లేదు దోషము
హింసా వాదమ్మె ప్రజకు హితముం గూర్చున్ 61
కంసారాతిని నుంచి నిత్యము మదిం గామాది షడ్వైరులే
సంసేవింప లయమ్ములై మనమునన్ శాంతమ్ము సేకూరఁగా
సంసారార్ణవ ముత్తరింప ధరలోఁ జక్కంగ సత్యవ్ర తా
హింసా వాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలా విలాసమ్ముగన్ 60
దాక్ష్యము ధైర్యము నిత్యా
పేక్ష్యములే మానవులకు వృధ్యర్థములై
వీక్ష్యమ లే శాప్రాపిత
లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్ 59
సాక్ష్యము కాఁగ సంతతము సత్య చరిత్రకు మానవాళికిన్
దాక్ష్యము మీఱఁ గార్యముల ధైర్యము తోడుత సర్వ మాన వా
పేక్ష్యము శుద్ధ వృత్తమున వెల్గుచుఁ జంచల బుద్ధి సంత తా
లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీ ధరన్ 58
[సంతత + అలక్ష్యము = సంత తాలక్ష్యము]
ఆత్మజుని హిరణ్యకశిపుఁ డత్యధికపు
టాగ్రహమ్మున హరిఁ జూపు మంచుఁ గోరి
నంతఁ బ్రహ్లాదుఁ డా హిరణ్యాక్షు దైత్యు
నన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె 57
మున్ను విభీషణుండు పరిపూర్ణ నయజ్ఞుఁడు రావణానుజుం
డన్నను వీడి రామ శరణాగతుఁడై యని లోనఁ దోడ్పడెన్
మిన్నగ స్వీయ మంత్రుల సమేతము తెల్పెను లంక గుట్టునే
యన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చి రెల్లరున్ 56
కులుకుచు నాటలఁ బాటల
లలనలు బాలలు పురుషులు రమ్య తరముగా
లలి తోత్సవ ఘన కోలా
హలమునఁ బ్రజ లెల్ల మున్గి రద్భుత రీతిన్ 55
కలవర మింత లేక మదిఁ గ్రన్నన సిద్ధినిఁ బొందఁ గోరుచుం
దెలతెలవాఱ లేచి కడు దిట్ట తనమ్మున సంభ్రమించుచున్
వలసిన రీతి నింపుగను బండుగ నాఁడు నిజేష్ట కార్య దో
హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుత రీతిని వింత యెట్లగున్ 54
జల్లన గుండియ జాఱఁగ
మెల్లగ మార్జాల మడలి మృగ రాజము చిం
తిల్లి కడు దుశ్శకున మని
పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్ 53
తల్లడిలంగఁ జేయ సమదమ్మున నల్వురు వీరు లైనఁ జిం
తిల్లిరి పాండు రాట్సుతులు దీనులునై యనిఁ గుంభ సంభవుం
డల్లిన వ్యూహ మందుఁ బతి కల్లుఁడు సైంధవుఁ డోడి రక్కటా
పిల్లినిఁ గాంచి నంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా 52
సత్య కాలము నాటి వచనము లేల
యొక్క కలి కాల మందెంచ నిక్కముగను
నేటి యీ మాట నిజమండి వాటముగను
సత్యమునుఁ బల్కఁ గల్గును సంకటములు 51
అత్యధికంపు నష్ట మిల నందఱి కేర్పడు నట్టి వేళలో
సత్యము పల్క కుండుటయె సత్యము నెంచిన సూక్ష్మ ధర్మమౌ
నిత్యము నేటి కాలమున నేర్పు వహించి భృశమ్ముగా పృథ
క్సత్యముఁ బల్క నాపదలె కల్గు నసత్యముఁ బల్క మేలగున్ 50
అంబర మంటెడు భంగని
సంబరపడు చుండి యుండ సంతతమును దా
నంబలి కుడువఁగ వానికి
సాంబారా రసమ హితము సంతసము లిడున్ 49
సంబోధించుచుఁ బిల్చు చుంటి నిను నో సన్మిత్రమా ప్రీతితో
నంబారావము నాలకించి మదిలో నానందముం బొంది తా
నంబా యంచును దల్లినిం గదియు నా యాదూడ చందమ్మునన్
సాంబా రార సమాహితం బగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్ 48
కేళీ లీలను గొల్చిన
ఫాలాభీలాంబకుండు వరము లొసంగుం
జాలుం జా లీ పల్కులు
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ 47
వేళాకోళపు టా కళాసమును సంప్రీతిన్ ధరించెం గదా
తాళం జాలక త్రాగుఁడీ విస మనన్ ధైర్యమ్మునం ద్రాగఁడే
తాళధ్వాన సమేత నర్తకు నహో ధర్మంబె వా రిట్లనన్
భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ 46
చేరుటకు నుండుఁ గనఁ బెక్కు కారణములు
పాడు చింత లేల నెదల భామ లందు
మే నలర వచించిరి యిట్లు నేను గన్న
వా రకామినులం జేరు వాఁడు బుధుఁడు 45
కా రిల వారు నైజమునఁ గామిను లెన్నఁగ శుద్ధ బుద్ధినిన్
దారుణ మైన వేళలను దామర సాక్షులు దారిఁ దప్పఁగాఁ
గోరుచు నుద్ధరింపఁ దగఁ గూరిమి మీఱఁగ మంద భాగ్యలన్
వారక వారకామినుల వద్దకుఁ జేరెడి వాఁడు విజ్ఞుఁడౌ 44
మాట లెల్లఁ గా నక్కట బూటకములు
దాఁట వింతగ నవి యెల్లఁ గోట లడరి
యయ్య వ్రాయఁ గరమ్ములు డయ్య మిగులఁ
బుస్తకమ్మునఁ బుట లెల్లఁ బొట్లములకె 43
విస్తృత గ్రంథ రాజ మని భీకర రీతిని సంభ్రమించుచున్
సుస్తిమితమ్ము లేక మదిఁ జోద్యపు వ్రాతలు వ్రాయ స్వీయ సం
ప్రస్తుతి దాఁట మేరలను బాఠకు లమ్మఁగఁ బుస్తకమ్ములం
బుస్తక మందునం బుటలు పొట్లములం దగఁ గట్ట నౌనుగా 42
దైత్య నాథుఁడు నిర్జర ధర్షణుండు
నై హిరణ్యాక్షుఁడు వెతల నవని కొసఁగె
నర మృగేంద్రుని వాని ప్రాణమ్ముల యప
హరుని పుణ్య వాసమ్ము సింహాచలమ్ము 41
వివరింపంగ నృసింహ రూపమున నా విష్ణుండు లక్ష్మీశుఁడే
ఛవి విశ్వమ్మున జ్ఞాన సంపదల నాచ్ఛాదింప నుత్సాహియై
భువిలో శుద్ధ దయా రసార్ద్రహృదియై ముల్లోక జీవాళికిన్
శివుఁడే పూజల నందఁగా వెలసె నా సింహాచలం బందునన్ 40
కలవర మందఁగ వేఁడికి
నలు దిక్కులు దిట్టముగఁ దనరి నల్లని మ
బ్బులు కమ్మి కురియ వర్షము
చలి వేసవి లోనఁ జెలికి సంతస మిచ్చెన్ 39
లలనకు నిష్ట మంచు ననురాగము మీఱఁగ సత్వరమ్ముగన్
సలసల కాచి తోయమునఁ జక్కని వంటక మెంతొ ప్రీతినిన్
వలసిన యంత కమ్మని సువాసన నీనెడు కూర సేయ బ
చ్చలి గడు సంతసం బిడెను జానకు వేసవి మండు టెండలో 38
సీస పద్యము లందు నశేషముగ లి
ఖింప సర్వ శాస్త్రమ్ముల నిం పొదవఁగ
ధర్మ శాస్త్ర విజ్ఞానులు తథ్యముగను
శాస్త్ర మర్మముల్ గలవు సీసాల లోన 37
దోసం బెంచక సత్కవి ప్రవరు లుద్ఘోషించి డెందమ్ములం
ద్రాసం బేర్పడ దుమ్ము వట్టు నని నిర్ధారించి రాజన్మహో
ల్లాసం బొప్పఁగఁ గట్ట వస్త్రమున నుద్గ్రంధమ్ము లింపార ని
స్సీ సా లందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్ 36
[సాలు = సన్న వస్త్రము]
కలుషితం బయ్యెఁ దోయము కాశి యందుఁ
దోరముగ మునుక లచట మూరఁ జంద్ర
శేఖర పుర గంగను శుద్ధి సేయఁగ మును
పాప మది పుణ్య మయ్యెను పావనముగ 35
[మునుపు + ఆపము+అది =మును పాప మది]
పాప మనమ్ము తోడ శిశుపాలుఁడు సంతత మూని వైరముం
గోపము ద్వేష తాపములు ఘోర తరమ్ము సెలంగఁ గృష్ణు సం
తాప మొసంగఁ దిట్టఁగను దారుణ చక్ర నికృత్త కంఠుఁడై
పాపము పుణ్యమై పరమ పావన పీఠ మలంకరించెడిన్ 34
పరికింపఁగ సూ క్ష్మార్థ మ
డరు హింసా పదమునకు నెడఁద నిక్కముగన్
ధర వీడి సజ్జ నాలినిఁ
బరులన్ హింసింపఁ బుణ్య ఫలముల్ దక్కున్ 33
నర విల యార్థ కర్ములకు నైతిక భావ విహీన పూరు షో
త్కరమనకుం గఠోర తర తర్జన చిత్త విలాస కోటికిన్
గురు జన ఘోర దూషకులకుం గుటి లాత్మక పాప కార్య త
త్పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్య పుణ్యముల్ 32
వింత వింత లెన్నొ చింతింప దేవుని
సృష్టి లోన నెఱుఁగఁ గష్ట మౌను
వీఁకఁ జెరుగు చుండ వేసవి నిప్పులు
మంట లందు విచ్చె మల్లె పూలు 31
అంటు కొనంగ నిప్పు కని యాజ్యము వోసిన భంగి దోఁపగాఁ
గంటికిఁ గున్కు రాక నిసిఁ గాఱియ నందఁ గరం బెడంద పు
ట్టింటికి నేఁగ స్వీయ సతి హెచ్చఁగ నా విరహంపు టగ్ని యా
మంటల లోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావు లెల్లడల్ 30
వే నాశ మౌను జ్ఞానం
బే నాశ మగు నిజ కీర్తి యెద చల మున్నన్
మానవునకు మూర్ఖపు రో
సానికి, నతుఁడై సతికి, విషం బిడఁగఁ దగున్ 29
కానరు మంచి చెడ్డలను గామ సముద్రము నందు మున్గఁగా
దానవ బుద్ధి వీడ రెద ధర్మము నెంచరు సుంత యేనియున్
మానవ! కాంచ నెంచినను మానక దుర్భర రౌర వాదులన్
సానికి మ్రొక్కి పత్నికి విషం బిడు టొప్పు వివేక శీలికిన్ 28
సలలితము నాదు డెందము
వలదీ రీతిఁ బలుకంగ వచనము లంభో
ధు లన మహా నదు లన వల
లల లన నా యొడలు వడఁకె లావును దగ్గెన్ 27
[వలలు+అలలు+అన= వల లల లన ]
పలు పలు రీతులన్ మదిని భామరొ యూహలు రేఁగు చున్నవే
తలఁపుల శార దేందుముఖి తాండవ మాడుచు వీడ కుంటివే
కలవర మాయె డెందమునఁ గాంతరొ కంటివె నిన్ను జూడ బా
ల లలన నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా 26
నృప కుమారు లెల్ల రెదల నివ్వెఱపడ
ధరణిసుర సంఘ మెల్ల ముదమ్ము వడయ
బెట్టిదమ్ముగఁ జప్పటల్, కొట్ట నరుఁడు
మత్స్య యంత్రముం, గొట్టెను మాద్రి సుతుఁడు 25
ఆ నర నామధేయుఁ డసితాభ్ర నిభాంగుఁ డవక్ర విక్రముం
డా నగ వైరి యాత్మ భవుఁ డర్జునుఁ డాజిని దుర్జయుండు దా
మానిని కుంతి కాత్మజుఁడు మాద్రికిఁ బుత్రుఁడు కాక యుండునే
మానక మత్స్య యంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై 24
అంచితముగఁ గానల సంచరించు చుండ
భాగ్య హీనత వైదేహి మృగ్య మయ్యెఁ
బృథ్వి నెచ్చ టైనను గనిపింప కున్న
సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె 23
ఈ తారా గణ మెన్న నిక్కముగ వే యేండ్లేఁగినన్ సాధ్యమే
భూతవ్రాతము నెన్న విశ్వమున సంపూర్ణమ్ముగా సాధ్యమే
యే తంత్రమ్మున నైన సాధ్య మగునే యెన్నంగ భూరేణువుల్
సీతారాముల బంధ మిట్టి దనుచుం జెప్పంగ సాధ్యం బొకో 22
ఈ విశ్వమ్మున మఱి యే
తావునను వెదకిన నంద తాఁ గనిపించున్
భావింపఁగ దూరమునన్
దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్ 21
పావన మానసమ్మునను వంచన నేరక సుంత యేనియున్
జీవన యాత్ర నివ్వసుధఁ జెన్నుగఁ జేయుచు ధర్మ బద్ధుఁడై
వావిరి గొల్వ డెందమున భక్తినిఁ గావని నిర్దయుండునౌ
దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱ నమ్ముచుఁ గొల్తు నిచ్చలున్ 20
ఘర్షణము సెలరేఁగెను గాంచ మదిని
వర్షము లధికం బగుటను వంతతో న
మర్ష మంత విజృంభింప మానసమునఁ
గర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి 19
మర్షము క్రుంగె నేమొ మఱి మర్త్యుల పైనఁ గడింది వజ్రికిన్
ధర్షణ మిట్లు మిక్కుటము దా నిడ మా యపరాధ మెద్దియో
వర్షము కుండ పోత వలె వారక కుర్యఁగఁ దిర్గి యింకనుం
గర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణ మాస మందునన్ 18
అలరుచుఁ జక్కని స్తోత్ర
మ్ములు పాడుచు రాగ మొప్పఁ బుణ్యాత్ముం డా
ఫలములు పుష్పమ్ములు కో
మల మిడి పూజించె నొక్క మనుజుఁడు భక్తిన్ 17
సలలిత భక్తి సంయుతము స్వామి పటమ్మును నిల్పి సన్నిధిం
దలఁచుచు నామ మంత్రములు తమ్ముల మింపుగ నారగింపులున్
జలనిధి శుద్ధ తోయమును జందన మింకను బూలగుత్తి ని
ర్మల మిడి పూజఁ జేసె నొక మానవుఁ డంకిత భావ మేర్పడన్ 16
దేహము దేవాలయ మా
గేహము పరమాత్మ యుండు కేలీ గృహమే
శ్రీ హరిఁ గొల్వుమ వీడుమ
మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్ 15
శ్రీహరి! మోహనాంగి పయు రేఁగిన దుర్భర మైన యట్టి నీ
మోహము శిక్ష కర్హ మగుఁ బోరు నొసంగును బ్రాణ హారియౌ
శ్రీ హరి పైన డెందమునఁ జెన్నుగ రేఁగిన మిక్కుటంపు వ్యా
మోహము మోక్ష కారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్ 14
అతి సంపన్నుం డాతఁ డ
ని తెలియఁగనె తద్ద ప్రీతినిన్ నమ్మకమున్
వితతముగ నుంచి ధన సం
చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్ 13
సతతం బల్లరి చేయు బాలికయె లజ్జన్ గంపలో నుండ నే
నతి భారమ్మున మేనమామ నడరన్ హర్షమ్ము భూషావళి
ద్యుతి భాసిల్లఁగఁ గాంచి పీఠము వధూ ద్యుమ్నమ్మునుం బ్రీతి నుం
చితి మీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్ 12
వంధ్యం బెందుల కగు నా
వింధ్యాచలమున కరిగిన వీడను భక్తిన్
సంధ్యా విను నే నెన్నఁడు
సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్ 11
ఆంధ్యాచారము లేల నిర్మలపుఁ జిత్తౌన్నత్యమే లేనిచో
వంధ్యా క్షేత్రము భంగి నిష్ఫలములౌ పాపాత్ము పూజావళుల్
కంధ్యాత్మోద్భవ నాథునిం గొలువ శ్రీకాంతున్ ధరం జాలదే
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై 10
దశమి దినమ్మునఁ బూజలు
శశి సదృశానన కొనర్చి చండికి నిజ వా
హ శకటములఁ బూజింతురు
రశ నాదు లొసంగి సుందరమ్ముగ నెలమిన్ 9
దక్కఁగ నింపుగా జయము తద్దశ రాత్రము నాచరింతురే
చక్కఁగఁ బార్వతీ సతిని శక్తినిఁ గొల్తురు భక్తి నెల్లరుం
బిక్కటిలంగ రక్షణము పేర్మిని వాహన రాజ పూజలం
దక్కక చేయుచుండుదురు ధాత్రి నెడందల రక్తి మూరఁగన్ 8
అఘములు లోక ప్రజకుఁ బ
రిఘ సన్నిభములగుఁ దగఁ బరీక్షింపంగన్
విఘటితము లయి నశింపఁగ
నఘములు ధర్మార్థ సాధ కాధారమ్ముల్ 7
స ఘనవ్రాతము నింగి వెల్గు విధి వాత్సల్యమ్ము తో నిండి యా
త్మ ఘటిల్లంగ నొనర్ప నొప్పు నడరన్ మర్యాద వర్తిల్లు మా
ర్య ఘనోద్రేకము వీడి శ్రేష్ఠ తమ కార్యమ్ముల్, విసర్జించి యీ
యఘముల్, సేయుచు సంచరింపవలె ధర్మార్థంబులం బొందఁగన్ 6
భృశముగ నరునకు నరుఁడౌ
ను శత్రువు మహాండ మందు నొవ్వుల నొసఁగన్
విశదంబ యిది జగమ్మున
మశకము మశకమును గుట్టి మత్తిలి చచ్చెన్ 5
మశకం బంచుఁ దలంప మత్సరము నిమ్మర్త్యాలిఁ గన్పట్టఁగా
మశకంబై పరగంగ మానసము సంపాదించి మోహమ్మునున్
నిశలందేని పవళ్లులం దయిననున్ నిత్యమ్ము నుత్సాహియై
మశకమ్మొక్కటి కుట్టగా మశకమున్ మత్తిల్లి చచ్చెన్ వడిన్ 4
హయ ఖరమ్ము లొక్క విధము లగునె యెన్నఁ
గరము దుఃఖ దాయకములు గాక నిత్య
మానదమ్ములు ధర్మ సమ్మతము లైన
కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె 3
భీ మాకారము నూనఁ జిత్తముల నుద్వేగమ్ము ఘోరమ్ము కా
నీ మర్త్యాలినిఁ జేయు మూర్ఖులుగ లే రెవ్వారు నాపంగ నీ
వీ మాటల్ కడుఁ జక్కఁగా నుడివితే యీరీతి నిక్కంబుగాఁ
గామ క్రోధ మదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయం బొకో 2
'పాపి - తులువ - పలువ - పంద' - అన్యార్థములలో ధర్మరాజు సుగుణములు:
చూపాపి నుతులు వఱలెడు
నా పలు వలుకులఁ ద్రపం దహతహ నొసంగన్
భూపాలుఁడు ధర్మసుతుఁడు
కాపాడును బ్రజలఁ దండ్రి కరణిం గరుణన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి