స్వవర్గజ ప్రాసను బరిహరించి చేసిన పూరణము:
పద్యామ్నాయ సగద్య సంకలిత సద్భావైక చారిత్ర సం
వేద్య జ్ఞానద మోక్ష కారక మహా విష్ణు స్తుతి ప్రోక్తమున్
హృద్య ధ్యాన నివేదనా కలిత చిత్తేద్ధ ప్రపత్తిన్ సదా
యాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా -
సద్యో వరప్రదా తా
విద్యా సర్వఘ్న వేద విద్యా జ్ఞాన
ప్రోద్యజ్జన రక్షణ నిర
తాద్యంత రహిత కథ విన నానంద మగున్ 57
[ఆద్యంత రహితులు = శివకేశవులు]
పద్యామ్నాయ సగద్య సంకలిత సద్భావైక చారిత్ర సం
వేద్య జ్ఞానద మోక్ష కారక మహా విష్ణు స్తుతి ప్రోక్తమున్
స ధ్యా నాత్మ నివేదనా కలిత సుస్వాంతప్రభా భక్తితో
నాద్యంతంబులు లేని గాథ విన బ్రహ్మానంద మబ్బున్ గదా 56
నిరతం బుండ వ్యయమ్మున
నిరతి పరులఁ గని కడింది నెలఁతల కిల ని
ష్కరుణ వెస పరిహరించినఁ
బురు షాధిక్యమ్మె సిరులఁ బోగొట్టుఁ గదా 55
ఖర శిక్షానుచి తాన యాధిక కర గ్రామాది తాపమ్ములం
బుర దేశ స్థిత మానవ ప్రకరమే మున్గంగఁ గ్లేశాబ్ధిలో
నర నాథాన్వయ జాత దుష్ట తమ సంతాన వ్ర జాత్యంత కా
పురు షాధిక్యము తీవ్ర శాప మగుచుం బోగొట్టు సౌభాగ్యమున్ 54
విత్తార్జనమే ముఖ్యము
నిత్తెము వీరికిఁ గడింది నీ వే మన్నన్
సత్తెము చలింప రీ నరు
లెత్తిపొడుపు మాటలే రుచించు రిపులకున్ 53
తరుణము వచ్చెనీకు వితతమ్ముగఁ దిట్టిన శంక వీడి యే
నరులును నిన్ను నాప రిట నారుల సన్నిధి రెచ్చి పోయి నీ
యరులను దల్చి పల్కినవి యన్నియు, నీ పగవారి వైరు లీ
యరులకు నెల్ల నెత్తిపొడుపౌ వచనమ్ములు శ్రావ్యముల్ గదా 52
పెద్దవయసున నుందురు పిల్లల వలె
నసలు కన్నను వడ్డియె యగును బ్రీతి
తాతకు మనుమ లన్నచోఁ దగని ప్రీతి
ముదిమినిం గన్నెపిల్లల ముద్దిడఁ దగు 51
[కన్నె =కూతురు; కన్నె పిల్లలు = కూతురి పిల్లలు]
సదనము నందు నిత్య మవిచారము సేయుచు నిత్యకృత్యముల్
పదుగురి మేలు దల్చుచును బన్నుగ దైవ నిమగ్న చిత్తతం
బదిలముగాఁ గరమ్ములను బట్టి ముదమ్మున నెత్తుకొంచునున్
ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొప్పగున్ 50
[కన్నె =చిన్న; కన్నెపిల్లలు = చిన్న పిల్లలు]
ఆండ్రు పెరిగిన యింట లేదండ్రు సుఖము
ముండ్లపై బ్రతు కయ్యెను పెండ్లి యాడ
నందనులు లేరని తిరిగి చందునకును
జానకికి ఘటిల్లెను గదా సవతి పోరు 49
[జానకి చందు లాలు మగలు]
భూమిని నాకుఁ గన్పడఁగఁ బో రధికమ్ముగ స్వీయ భార్యచే
నేమని పల్క నేర్తుఁ బరమేశ్వరు లీలల నెంచ శక్యమే,
గీమునఁ గాన కున్న, మదిఁ గేకయ భూపతి చింత సేసె నో
భూమి! తనూజకున్ సవతి పోరు ఘటిల్లెఁ గదా యయోధ్యలోన్ 48
లోక మందు వచ్చె వీఁకను మార్పులు
కాలపు వృథ యింక నేల వినుమ
నూతనంపు గతులఁ జూతము వడి పాత
హలము విడువఁ బంట లధికమగును 47
అలసట మేన లేదు మఱి హాయిగ నాసన మందు నిల్చియుం
బొలమును వేగవంతముగ ముచ్చట లాడుచు దున్న వచ్చు నాఁ
గులుకుచు యంత్ర రాజముల గొప్పగఁ బట్టిరి కర్షణార్థమై
హలముల మూలఁ బెట్టిరఁట హాలికు లెక్కువ పంటఁ దీయఁగన్ 46
గురుతర దుఃఖస్వాంతు ల
యి రమానాథుని నుతించి యిఁకఁ జేయంగా
నరు లిలఁ బ్రాయశ్చిత్తము
దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్ 45
హరినిం దల్చి విరోధ భావమున నత్యాశ్చర్య రీతిన్ దివిన్
హరినే జేరఁగ వేగ వర్తిలిరి వారబ్భంగి ముప్పుట్టులన్
హరి సౌధమ్మున ద్వార పాలకులె శాపార్తిన్ హృదిం దల్చిరే
దురితంబుల్ వొనరించి మోక్షమును దోడ్తోఁ బొందుటే యుక్తమౌ 44
మెండుగ నభివృద్ధి యొనర్చి నిండ భువి న
ఖండ మండితముగఁ జేయ లెండు వేగ
పండిత వర సకలజన ఖండిత మగు
మాతృ భాషావమానమ్ము మాన్యత నిడు 43
మానక తల్లిదండ్రులను మాన్య గురుప్రవ రాళి నుద్భవం
బైన ధరాతలమ్మును మహాత్మ భజింపు నిరంతరమ్మునుం
గానవు పుట్ట సద్గతులు కాపురుషా యిటు లీవు పల్కినన్
మానక, “మాతృభాష నవమాన మొనర్చెడి వాఁడె మాన్యుఁడౌ” 42
మొద్దు విధమ్మున నేరక
గద్దెలు మిద్దెలు వలదని గర్వముతో నే
నద్దినమున నట్లన్నను
వద్దని కోరినవె మరల వచ్చె మురిసితిన్ 41
విద్దెల యందు మేటి ధృతి విక్రముఁ డా నరసింహరావు నాఁ
బెద్ద ధరామరాగ్ర్యునకుఁ బిల్చి యొసంగఁగ రాచ కోర్కిలే
సద్దు మణంగ గ్రద్దనఁ బ్రశాంత మనమ్మునఁ దిర్గి పోవఁగా
వద్దనుకొన్నవే మరల వచ్చె నటంచు ముదంబు నొందితిన్ 40
ఆల మొనరింప కున్నను
శూలధర విజేతృ సఖుని చోద్యమ్ముగ గో
పాలగణనాథ కృ ష్ణా
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్ 39
[కృష్ణ + ఆవాలము; ఆవాలము =ఆలవాలము]
లీలగ లంక లోపలఁ బరీక్ష నొనర్చ దశాస్యు వీర్యమున్
హేలగ సంచరించుచు నహీన బలమ్మున సంహరింపఁగా
నాలము నందు వాలము మహాకపి పాశము కాఁగ దైత్యులన్
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్ 38
[శాత్రవాళి కరవాలము= శత్రువులకు కరవాలము, మిత్రులకుఁ దోఁక]
త్రాఁగ గౌతమీ జలమ్ము, డాసితిమి యా
హ సఖి! నేటి పల్లె నంచుఁ దెలుప,
రాముఁ డుండ నాఁడు రమ్య భద్రగిరిని
రాముఁ డాంధ్రుఁ డనిరి ప్రముఖ బుధులు
[ముచ్చటగా మూడు కారణములు!] 37
ఏ మహనీయు నైన భువి నెక్కటి వారును గౌరవమ్మునం
బ్రేముడిఁ దల్తు రింపుగను వేమఱు డెందము నందు నిచ్చలున్
నీమపు దీక్ష స్వర్గము ననింద్యుఁడు గాంచిన పొట్టి యైన శ్రీ
రాముఁడు దెల్గువాఁ డనుచు వ్రాసిరి విజ్ఞులు వంగభాషలో 36
ద్వేషము వహించి పగఁ బూని దేశ దళపు
గుట్టు విప్పి జనుల కెల్ల ఱట్టు తెచ్చి
పంతము వహించి పగవారి చెంతఁ జేరి
పొగడి నట్టి వారలను జంపుటయె నీతి 35
సుగతి నొసంగు వానిఁ గని శూర కులాంబుధి చంద్రుఁ గృష్ణునిన్
విగత భయమ్ము నింద లిడి వెఱ్ఱియు నై పలుకంగ నేర్చెనే
తెగడఁ దగుం గడింది పరిదేవిని నీ శిశుపాలు నిట్లనం
బొగడిన వారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌ 34
కడుపు నిండుగఁ దా నుదకమ్ము త్రాగి
చొక్కు వచ్చిన నక్కట చోద్య మడర
నాత్మ గౌరవ మత్తరి నడ్డు రాఁగ
నన్నమును గోరఁడయ్యె క్షుధార్తుఁ డొకఁడు 33
పన్నుగ లేస మైనను సుపక్వము నిండని వేఁడికొంచుఁ దా
గ్రన్నన నంత దత్తమును గాంచుచు, సైపఁగ రాని యాకలిం
గొన్నను గడ్డి నేనుఁగుల గొంగ భుజించునె!, యన్య భుక్త శే
షాన్నము వద్దు వద్దనె క్షుధార్తుఁడు రోయుచు నన్నదాతతోన్ 32
సహవాసులు చెప్ప నతఁడు
సుహర్షమున నాలకించి చోద్యము మీఱన్
సహనము నూని మనమ్మున
నహమదు ఖానుఁ డొనరించె నాచమనంబున్ 31
ఇహ పర శాంతి సౌఖ్యముల నిచ్చును శుద్ధ మనమ్ము దేహమే
కుహరము కాఁగ సత్పురుష కోటికి నా భగవంతు భక్తితో
నహరహ మింపుగాఁ దలఁచి యర్చన సేసిన నా నెఱింగి తా
నహమదు ఖానుఁ డిష్టపడి యాచమనం బొనరించె నిష్ఠతో 30
దుష్ట దుర్యోధను నెఱిఁగి తోరముగను
దీను భంగి నక్కట ద్రౌపదీ వర సుతుఁ
డేల యేనూళ్ల నడుగంగ నింత కన్న
విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త 29
ఏకాంతమ్మున మూసి కన్నులను సర్వేశున్ మహాదేవు లిం
గాకారద్యుతి వెల్గు చంద్రధరుఁ గాలాత్మున్ జటాజూటు సా
ధ్వీకాత్యాయని భర్త నాది సుమహాబిక్షున్ మహా భక్తినిన్
లోకోత్కృష్ట సమస్త సంపదలు గల్గున్ బిచ్చ మెత్తంగనే 28
శ్రీస త్యాత్మేశ్వర కరు
ణా సాగర జల నిమగ్న నర సంతతికిన్
భాసుర సంయమి జన వ
ద్వాసము వాసనల నడఁచి భాసిలు నెపుడున్ 27
శ్రీ సమ దార సేవిత విశేష మహాత్మ్యనిరూఢ దేవ కా
యాసహ చింతనా వితతి యత్నవ దార్జిత ఘోర పూర్వ భూ
వాస వికార కార్య ఫల భార విచార సమూహముల్, నభో
వాసము వాసవాదులకు, వాసనలం దొలఁగించి భాసిలున్ 26
సంతసమ్మున నొకతరి వింతలు గన
మిత్ర వర్గయుత విహార యాత్రఁ జలుపఁ
జనఁగ నే భాగ్యనగరికిఁ జదువుచుండ
నాతి! వైజాగులో గంటి నాల్గు నిట్ట 25
[నాల్గు నిట్ట = చార్మీనార్]
ప్రీతిఁ దురుష్క కోటికిఁ బవిత్రపు వేశ్మము లెల్ల చోటులన్
భాతిని వెల్గుచుండు నవి పన్నుగ నిట్టలు నాల్గు నిల్వఁగా
నీ తరి నేఁగ నేను పురి కింపుగ నట్టిది యచ్చటుండఁగా
నాతి! విశాఖపట్టణమునం గనుగొంటిని నాల్గునిట్టనున్ 24
విశ్వ మణుశక్తి మయ మయ్యె నశ్వరమ్ము
గాఁ బరిణమించు నిఁక భావి కాల మందు
దుష్ట జను లందు వెల్గు నికృష్ట మంత్ర
విద్య నాశనకరము వివేక మడఁచు 23
విద్య యొసంగు నింపుగ వివేకము జ్ఞానము మానవాళికిన్
హృద్య గుణాళి సంతత మహీన యశమ్మును విశ్వ మందు నై
వేద్య మనంగ మర్త్య బలి వేగమ యిత్తురె! మూఢ మాన వా
విద్య వినాశ మూలము వివేకమునుం దొలఁగించు శత్రువౌ 22
[మానవ +అవిద్య = మాన వావిద్య]
బాగుగఁ జెవి దూదిని నిడి
దాఁ గడపుచు నుండు భర్త తఱచు దినములన్
వేగ మొకనాఁడు శ్రీమతి
మూఁగ వచింపఁగఁ జెవిటియె మోదమున వినెన్ 21
[1. మూఁగ = మూఁగఁగ; 2. మూఁగ = హంస; 1. శ్రీమతి మూఁగఁగఁ
జెప్పుటకు; 2. శ్రీమతి యను హంస వచింపఁగ]
ఈ గతి వింత లారయ మహీతల మందు నసంభవంబు నా
వాఁగెడు భక్తి హీనులకు భంగము గాఁగ నిజోగ్ర దర్పమే
సాగరకన్యకుం బతిని శ్రద్ధగ భక్తినిఁ గొల్చి నంతనే
మూఁగ వచింపఁగం జెవిటి మోదముతో వినెఁ గాంచె నంధుఁడే 20
శిష్టుల మతి శైలాభము సేసి చింత
వారును వనితలే యని వారి కీయఁ
గరుణ గౌరవ జీవన సరణి నిట్టి
శిష్టులకు వారకాంతల చెలిమి మేలు 19
హారతు లిండు తెచ్చిరి జయమ్మును జేసిరి సాహసమ్మునం
గీరితి నిచ్చు నట్టి ఘన కృత్యము పెక్కు దినమ్ము లచ్చటం
బోరిరి యుద్ధ మందు విధి పూర్వక బుద్ధి వహించి సైనికుల్
వారక వార కాంతల నివాసముఁ జేరుటె శిష్టకృత్యమౌ 18
[వార = వారే; కాంతలు = భార్యలు]
జగములు నిల్చు నుదరమున
భగవంతుని లీలఁ బ్రళయ పరితప్తులునై
విగత ప్రాణులు కారే
మగవాఁడో సతియొ చందమామయొ రవియో 17
బృహన్నల విరాటుని కడ కేతెంచు సందర్భము:
సమస్యా పాదమునకు మూడవ పాదమునఁ గ్రమాలంకారము
కూడ ద్యోతకము.
మృగరా జాభ విలగ్న చిత్ర తను గంభీ రోద రావర్తమున్
విగతైశ్వర్య నరేంద్ర సన్నిభుని వే వీక్షించి మాత్స్యుం డనెం
దగ నా ఠీవిని సుందరాస్యము లసత్తాపమ్ము శాంతమ్మునన్
మగవాఁడా వనితాలలామ యగునా మార్తాండుఁడా చంద్రుఁడా 16
సంతసమ్మునఁ బయనమై సంత కేను
గంతు లిడుచుండఁ దీగపై నంత బాల
వింత పుట్టించు మెయిఁ బులకింత వార
లింతకు మునుపు గన్నదే యిపుడు గంటి 15
అంతట నుండె హస్తి మశ కాంతర మప్పటి కింక నేటికిం
బొంతన మింతయుం గన మపూర్వపు వృద్ధి గడింప నింపుగా
నెంతటి మార్పు తెచ్చును మహీతల మందు గతించి కాలమే
యింతకు ముందు చూచినదె యిప్పుడు చూచుచు నుంటి వింతగన్ 14
సద్యము కవివరుల కనవద్య మైన
గద్య ముండఁగ మన కిట హృద్యముగను
జోద్యముగ దోష కోటికి నాద్య మైన
పద్యమును వ్రాయఁ బూనుట పాపమగును 13
ఆద్య పద ప్రకాంక్షిత నిరర్థక కావ్య రసజ్ఞ మండ లా
హృద్య యశో౽ర్థ విత్త నిచ యేప్సిత నీచ తరార్థ యుక్త హీ
నోద్యత శబ్ద శాసన వియోగ ప దాన్విత భావ హీనమౌ
పద్యము వ్రాయఁ బూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మిఁకన్ 12
సిలికానాంధ్ర వారి పద్యము-హృద్యము:
వల్వల యంద మారసి యపారపుఁ బ్రేమ జనించ తూర్ణముం
గల్వలఁ బోలు కన్నులని కన్యను గోరఁగ నిద్ద ఱొక్కతెం
జెల్వము లేని మోముఁ గని చెంద నిరాశ నెడంద నంతటన్
గెల్వఁగ నేడ్చె నొక్కఁడును గెల్వక యోడిన వాఁడు నవ్వఁగన్ 11
దుష్టులను ద్యజియించుట కష్ట మైన
దేశమునకు మే లొనగూడు లేశ మైనఁ
గీడు వాటిల్ల దని పరికించి వాని
మాల వేసి దూషించి రమాత్యుఁ బ్రజలు 10
[దూషించు = త్యజించు]
కాలాంతర్గత మత్సరాదులను శంకన్ వీడి వాక్రుచ్చఁగాఁ
జాలుం జాలును మంత్రి వర్య నిఁక నిశ్శబ్దమ్ము మేలం చహో
వాలాయమ్ముగ బుద్ధి సత్వరము నేర్పం దామ్రచూ డాండ దు
ర్మాలాలంకృతుఁ జేసి తిట్టిరి నిజామాత్యున్ జనుల్ సత్సభన్ 9
శాంతిఁ జేకూర్చు జనులకు క్షమయు కరుణ
యెల్ల వేళలఁ జక్కఁగఁ గల్ల కాదె
యక్కట నరులకు నెడంద మిక్కుటముగఁ
జలముఁ బోసిన నడఁగదు జ్వాల సుంత 8
[మిక్కుటముగన్ +చలము = మిక్కుటముగఁ జలము]
లలిత మనస్కు లెల్లరకు లాలన కన్నను భాష్ప తోయముల్
జలజల కాఱ మం దగును జయ్యన శోక మహాగ్ని తప్త దు
ర్విలపిత పూరుషాత్మలకు వింతగఁ బ్రశ్రయ గంధ యుక్త వా
గ్జలముల నెంతఁ బోసినను జ్వాల యడంగదు తగ్గ దుష్ణమున్ 7
కర్ణ కఠోరంబుగ న
న్నార్ణంబులు ముట్ట నంచు నాత్మ జనం బా
కర్ణింపఁ బెండ్లి కానుక
స్వర్ణమృగముఁ దెమ్మని యుమ శంకరుఁ గోరెన్ 6
[ఈ యుమా శంకరు లాధునిక భార్యాభర్తలు]
పూర్ణ మనమ్మునం బతిత పుత్రుని ప్రాణము శైలపుత్రికా
పర్ణ నిజాత్మ నాథుఁ గని పాడియె కోరినఁ బీత కాల దు
ర్వర్ణ కురంగ రాజమును రాఘవుఁ డొల్లఁడె సీత కోరఁగా
స్వర్ణమృగమ్ముఁ దెమ్మనుచు, శంకరుఁ గోరెను గౌరి ప్రేముడిన్ 5
రత్న నిభ కణ విలసిత నూత్న నీర
సంగ తుంగ విస్ఫారి తాభంగ భంగ
భార గోదావరికి రాఁగ వరద లంతఁ
గనుల పండుగఁ గూర్చె రక్తంపు ఝరులు 4
[రత్నము = నవరత్నములలోని ప్రవాళము; రక్తంపు = ఎఱ్ఱని]
అన్న బలమ్ము నైపుణము నక్కజమై తనరారె నమ్మరో
క్రన్నన దండకా వనినిఁ గార్ముక హస్తుఁడు వీర రాఘవుం
డున్నెడఁ దొమ్మి దేను వెయి లుండిన రక్కస మూక కత్తరిం
గన్నుల పండువై తనువు గార్చె రణంబున రక్తధారలన్ 3
విపరీత భాషణము లే
ల పలుకు దీ విట జగన్నిలయుఁ గృచ్ఛ్రములం
గృపఁ బోఁ గొట్టు రమాపతి
నపచారమె? హరిని విష్ణు వనుట కవివరా 2
కంతుని తండ్రి కివ్విధినిఁ గా నపచారము పల్కఁ బాడియే
సుంత తలంపుమీ మదిని సుద్దులు పల్కెడు వేళ మిత్రమా
యెంతటి మిత్రుఁడైనఁ గని యీతని మానవ మాత్రునిం గటా
యెంత మహాపచారము హరీ యని పిల్తువె విష్ణువుం గవీ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి