నాకు నీ వివ్విధిం జెప్పిన యది యింకఁ
జాలు వింతల పుట్ట యీ జగతి యయ్యె
నిట్టి యాచారము లెఱుఁగఁ బుట్టి నేను
వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె 61
ఇరువురు నంద చందముల నింపుగఁ బోలుచు నొక్కరొక్కరిం
గర మనురక్తి నొండొరులఁ గన్నుల వెల్గఁగ విస్మయమ్ముగన్
మరునినిఁ బోలు నా వరుఁడు మంగళ సూత్రము కట్టఁ బ్రీతితో
వరుని గళంబునన్ వధువు వైభవ మొప్పగఁ గట్టెఁ దాళినిన్ 60
[తాళి = పతకము]
గ్రామ జనులు బెగడఁగ నవి
రామము దూషించుచు సమరపు భంగి నటన్
నీమమ్ములఁ బాటింపక
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్ 59
[ఘట + ఉత్కచుఁడు = ఘటోత్కచుఁడు: తలయందు జుట్టులేని వాఁడు
(బోడి గుండు వాఁడు); ఘటము = తల; ఉత్కచము = కేశ హీనము]
సామము చెల్ల కున్న నిఁక సంయుగమే గతి జ్ఞాతి దుర్జన
గ్రామము ధార్త రాష్ట్ర జన కాయము భీతినిఁ దల్లడిల్లఁగన్
భీమ పరాక్రమ ప్రవర భీమ సుతుం డట శత్రు రాజ సం
గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై 58
ఘనుఁడా మహాత్ముఁడు తపో
ధనుండు విప్ర కులజుండు ధర శునకపుఁ బే
రున వెలిఁగె శునక సన్ముని
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్ 57
[శునకము = శునక వర్ణ సమూహము]
కని మూఢాత్ముల నెందు వారి కనువౌ కార్యమ్ములం దీర్పఁగా
ముని వేషమ్మున మోసగించు నరులం బూజింప నీకేలనో
మన గేహమ్ములఁ గాచు సంతతము సామర్థ్యమ్ముగాఁ గావునన్
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్ 56
పుడమిఁ బడెఁ గవి మాటల భోజరాజు
కవులకుఁ బరఁగె వాక్శుద్ధి భువిని మున్ను
సత్కవీశ్వరు పద్యపు శక్తి నంత
నన్న మయ్యె సున్నము ముదమంది తినిరి 55
[అన్నము అయ్యె సున్నము= సున్నమే యన్న మైనది యిక్కడ]
అన్నముఁ గాంతు మాంధ్రమున నంచిత దక్షిణ రాష్ట్ర రాశినిన్
సన్నని యన్న మన్యముల సంతత మారయ సున్నయే సుమీ
క్రన్ననఁ బోయి తక్కినవి, కంచము వీడ్యము లందుఁ గాన కీ
యన్నము సున్న, మైన ముదమంది భుజించిరి బంధు లెల్లరున్ 54
కాసులను గుమ్మరించుచు
మోసము మీఱంగ నెగ్గి పుడమిని నేలన్
వాసికి నెక్కుటఁ గనమే
వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్ 53
వాసిగ వేయ దండను బ్రపన్నుఁడు భక్తిని విష్ణుమూర్తికిన్
వాసన రాక యున్నఁ గని పండితు లచ్చెరు వంది నిల్వఁగాఁ
దా సరి తూఁగఁ గుబ్జకముఁ దద్దయు కృత్రిమ హార మందు నా
వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్ 52
[కుబ్జకము = చేమంతి]
గగనం బైన గెలుపు కా
నఁగ బలవంతునిఁ దలంచి నాథునిగ నెదన్
మగతనపుం బగవానికిఁ
బగవానికి సేవఁ జేయవలె మే ల్గలుఁగున్ 51
సెగ చల్లారి మనమ్ము నందు వరమై సిద్ధించు మిత్త్రత్వమే
పగ నెల్లం దగఁ ద్రుంచి స్నేహమరయన్ వాటిల్లు నానందమే
విగత ద్వేష విరాజమాన మయి సంవేష్టించి సద్వాక్కులం
బగవానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మే లగున్ 50
బండి - రథము - ఓడ – విమానము దత్తపది.
కవి మానము గోల్పోయి వి
రివిగ భువిం బండి నట్టి పృథులోభము చే
త విగత మనోరథమునను
సు విచార సమేత మోడ శోకించె నటన్ 49
నీదు ధనము యశముం గని
యౌదలఁ దాల్చి పదములు వరానన యా శా
తోదరి చందన చర్చా
మోదీ! నిన్ గాంచినంత మోహించు నొకో 48
వేదాంతమ్ముల నేల పల్కె దిటులన్ వేసారి దుఃఖించి నీ
యౌదార్యమ్ము నెఱింగి తత్వ మెదలో నబ్జాక్షి శంపాంగి దా
నాదిన్ ద్వేషము నూని పొమ్మనిన నార్యా పిమ్మటన్ నిత్య స
మ్మోదీ! నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో 47
నాయకుం డైన రాజైన న్యాయ మెల్ల
వీడి చరియింప వారిని వీడఁ దగును
స్వార్థ చింతయ చెలరేఁగఁ బల్కఁ బుడమి
నాయకుల్ నీతి, మాలిన నష్ట మగున? 46
దుష్టులె యంచు ముద్ర లిడి తూర్ణము వూనుచు నైకమత్యముం
గష్టము లంచు నెంచకయు గ్రక్కున ధూర్తుల నెక్క డున్ననున్
స్పష్టముగా వహించి ధృతి సర్వులు మీఱి బహిష్కరింపఁగా
నష్టము లేదు లేదు మన నాయకు లెల్లరు నీతి మాలినన్ 45
ఆ తరి గుట్టలు గా సం
పాతిత శత్రు వ్రజమ్ము భండన మందుం
గేతనమం దుంచితిఁ దగఁ
గోఁతి నని, ధనంజయుండు గొండల నెక్కెన్ 44
నాతికి నొక్కగా నొకఁడు నందనుఁ డౌటను గారవమ్మునం
బ్రీతి సెలంగ మిక్కుటము పేర్మినిఁ బెంచిన కారణమ్మునన్
మూతినిఁ బెట్టి యుబ్బుగను బుట్టలఁ జెట్టుల నెక్కు చుండి తాఁ
గోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్ 43
[అర్జునుఁడు =తల్లికి నొక్కగా నొక్క కొడుకు]
గౌరవం బిచ్చు ధాత్రి నపారముగను
రాజు లక్షర లక్షల నోజ నిడ న
నశ్వరపు ఖ్యాతిఁ గూర్చును విశ్వమందుఁ
గూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున 42
చూడుము వీడి నిస్పృహను శోకము సజ్జన కోటి వెన్నఁడున్
గోడుల నాలకింపక నిగూఢ కుతంత్రము సేయు చుండినన్
వాఁడి పదమ్ము లుగ్రముగ వాడిన ఱేఁడును గంప మందఁడే
కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్ 41
నదుల సమీపమ్మునఁ దాఁ
బదిలమ్ముగ సంచరించి వారక సతమున్
వదరుచు కోడి వనమ్మున
నుదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్ 40
[మయూరము (న్) లేపున్]
చదలున మేఘముం గనక చాలదు కేకియె నాట్యమాడగం
గదలుచు కూయు సంతతము కాహళ మందఱి కీయ మోదమున్
సదమల దేహి కుక్కుటము సక్కటి గ్రామ మయూరమే కదా
యుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్ 39
మన్ననల నందె మిన్నఁగఁ గన్నెగాను
దల్లి యయ్యెను నా చిట్టి తల్లి నేఁడు
గిఱ్ఱునఁ గడచె నేఁడాది యెఱ్ఱ రంగు
టింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు 38
మినుకుల్ సత్యము లయ్యె సత్వరము సుమ్మీ వింతగా ధాత్రిలో
నెన లేనట్టి తనుండు పుత్రుఁ గని యయ్యెం బుత్రి నేఁ డింపుగా
దనయం గాంచి యొసంగ దీవనను బుత్రప్రాప్తి రస్తం చటన్
వనితారత్నము పెండ్లినాఁడు, గనఁగా బాలెంతరా లొప్పుగన్ 37
జగతినిఁ బరిశీలించినఁ
దగు సాయము సేయ నెంచి తద్దయుఁ బ్రీతిన్
రగులుచు నుండఁగఁ గలతలఁ
బొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్ 36
కిమ్మన కుండ కష్టములు క్రిక్కిరియం గడు నూఱకుండియుం
బమ్మగ సౌఖ్య సంపదలు బంధుల మంచు వచించి గోముగా
రమ్మన కుండ వచ్చి సుకరమ్ముగ నుండుచుఁ బెద్ద కాలమే
పొమ్మని పెట్టినం బొగను బోమను వారె కదా సు! బాంధవుల్ 35
[సు =సుమి]
పంచియల్ గట్టి యెల్లరు నంచితముగ
నంచె లంచెలుగా సంచరించు చొక్క
మంచి దినమెంచి కొంచెము మంచు ముంచఁ
బంచవటిలో వసించిరి పాండుసుతులు 34
నా కనిపించె నివ్విధి వనమ్ముల వారలు తిర్గు నప్పుడే
వీఁకఁ జరించుచుం బుడమి విస్తృత కానన పంక్తి నింపుగా
నేక దినంబ యా రఘు వరేంద్రునిఁ దల్చుచు సంతసమ్మునన్
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్ 33
చేతులు జోడించుచు నే
రీతి నొసఁగ నతులు జాలుఁ బృథ్విని నీకున్
నాతీ యము నిష్ఠఁ, బఱపి
పాతివ్రత్యముఁ, జెఱచితివా సావిత్రీ 32
చూతుర్నిత్యము మన్మథా ర్తులు మహా చోద్యంబుగా ధూర్తులే
శాతేద్ధోదరి నీతి నెన్న కకటా సావిత్రి పేరూనియున్
వీతాపత్రప భర్త నెంచక మదిన్ విద్రోహ చిత్తమ్మునం
బాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే 31
రవ్యస్తమయ మెఱుంగని
దివ్యప్రాణికిఁ దలంప ధృతితోఁ గాదే
భావ్యము నరులం దూఱఁగఁ
గోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్ 30
భావ్యం బౌను నవీన శబ్దముల సంభావ్యంపు నామమ్ములన్
సవ్యంబౌ విధి నుంచఁగా నఖిల భాషావ్రాత కోశాళిలో
నవ్యక్తం బగు నవ్వు వచ్చె మది భాషాన్యంపు శబ్దమ్మునం
గోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా 29
[కోవ్యాక్సిన్ = కృమిత్రము లేక కరోనకృమిత్రము; కర+ఊన +కృమి త్రము]
ఆవ యంతయును మనో వేగము నెఱుఁగు
జనులు కలరె పుడమిఁ జక చక చను
నంతరంగ మందు నాలోచనల కెంచ
నాకసమ్ము పిడికి లంత సుమ్ము 28
విగత దురాశ నిత్య హృ దపేత మదాగ్రహ దుర్గుణావళిం
ద్రిగుణ విహీన భక్తజన దీన జనావన కల్పవృక్ష ప
న్నగ శయ నాశ్రి తాంచిత జన ప్రవరాళికి నక్కజమ్ముగన్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
ధర నెంచఁగ మంచివియౌ
కరుమము లొనరించు చుండఁ గర్మము లవియే,
నర రానీయక, గొలువుమ
హరుని, దురూహలె, సుఖ మిడు నట్టి వరములౌ 27
నరవరు లెల్ల శంకరుని నైష్ఠ్యము నెంచక భక్తిఁ గొల్తురే
పురహరుఁ గొల్వ నుండ వలెఁ బుణ్యము పూర్వ కృతమ్ము మిక్కిలిం
బరమ శివుం దలంప ఘన పాప మనస్కుల కౌనె యూఱకే
హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్ 26
[దురూహ = కష్టముతో నూహింపఁ బడునది]
దురభిమానుండు రారాజు దుష్టుఁ డేల
మ్రొక్కుఁ బగవారి భార్యకు మోస పోకు
వినుమ నిక్కముగా ద్రుహిణునకె, కాదు
ద్రుపదతనయకు, మ్రొక్కె దుర్యోధనుండు 25
వారని రక్తితో మయసభా విభవమ్మును జూచుచుండఁగా
నారుల గూడి యుండనట నవ్వులు సిందఁగఁ, మోహ చిత్తపుం
బ్రేరణ మంది యంత శివలింగమ యియ్యది యంచుఁ బ్రీతినిం
గోరి సుయోధనుండు గడకుం బ్రణమిల్లెను, యాజ్ఞసేనికిన్ 24
[గడ = కంబము, కఱ్ఱ]
బరు వేల మనకు వీరినిఁ
ద్వరితమ్ముగ వృద్ధు లుండు వసతి కనుపుఁడీ
గిర లన నిట్లు కమలముఖి
విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే 23
విరివి దళమ్ము లుండ సిత వృత్త సురూపము నూని వింతగా
హరిత వరచ్ఛ దావృత మహాసన మందు మనోహరమ్ముగాఁ
బరఁగెను నల్ల నాళ మది పద్మము నందుఁ జలింప గాలికే
విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను గాలనాగమే 22
[న+అగము = నాగము; అగము = పాము; నాగము = పాము కానిది;
నాళ మను పాముగాఁ గూడ గ్రహింపఁ దగును.]
అలిగిన సతులు గతు లరయరు నాథులు
లలనలకుఁ దొడవుల వలువల రతి
కట్టిన వసనమ్ము గట్టరె యిట్టి పో
కల సహింపవలయుఁ గాపురమున 21
విలవిల లాడ నేల గత భీతి మనోరధ పూర్ణ సిద్ధికై
నిలువుమ వేచి వత్సరము నీ పుర మౌ నమరావతీ గతిన్
సలలిత తుంగ శైల నిభ సౌధ వరావళిఁ గట్టఁ గూల్పఁ బా
కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్ 20
[కాపురము = చెడ్డ పురము]
మున్ను హింసింపఁ బరదేశ మూర్ఖ జనులు
సెలఁగి పీడింప భారతీయుల ననిశము
దేశ సద్భక్తి చెలరేఁగె నీశ మాకుఁ
గోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు 19
ధారుణిఁ గందు మత్యధిక ధర్మ విహీనుల నిందు నందునున్
వారిని నిర్దయం జెలఁగి వారక బద్ధులఁ జేయ నొప్పగున్
ఘోరపు భంగి సంతతము కోరిన నైనను దుర్జనాలికిం
గోరక మున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తు లౌ 18
కవి నిచయ దుష్కర ప్రా
స విరాజిలఁ జేయ నంత సన్నుత కవియే
యవనతుఁడు కాఁగఁ బ్రాశ్నికుఁ
డవధాని పరాజయమున నందె బహుమతిన్ 17
[అవధాని పరాజయమున = అవధాని యొక్క పరాజయము నందు]
పోటరి దత్త శబ్ద సు నభోగతి నెంచ నిషిద్ధ వర్ణముల్
వ్రేటునఁ గూలు వర్ణనలు హృద్యములౌ సహ పూరణమ్ములై
పాటవ పృచ్ఛ కావలియె పద్య పరశ్వథ ఘాతి కోడఁగా
నోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్ 16
బూచి చెలఁగు చుండి దోఁచుఁ బ్రాణమ్ములు
కానఁ బడదు కంటఁ గాని కలదు
వింత జాల మందు వేడుకఁ జల్పుఁడీ
సిద్దిపేట కేఁగ వద్దు కవులు 15
తద్దయు సంధు లొల్లరు సతమ్ము దృతమ్ముల గౌరవింపరే
సుద్దుల యందుఁ బొంక మది చోద్యమె వద్దన నాలకింపరే
గ్రద్దనఁ బద్దె మల్లుటయుఁ గద్దుమ యన్వయ ముండ నేరదే
వద్దుర సిద్దిపేటఁ గనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్ 14
[కేవలము పూరణార్థమె. నా భావ మిది కాదు.]
అపహృతం బయ్యె జానకి యటవి లోన
విని కబంధు వచనములు నిను గదిసితి
వినుమ సుగ్రీవ! నిజదార విరహితుఁడను
భధ్ర మిడు మని రాముఁడు వాలి నడిగె 13
[వాలిన్ = తోఁక గలవాఁడు, ఇక్కడ సుగ్రీవుఁడు]
అద్రి నిభాభ్ర వర్ణుఁడు మహాత్ముఁడు సూర్య కులాబ్ధి చంద్రుఁడే
క్షౌద్రపు భాషణమ్ములను సద్గుణ ధాముఁడు చేరి వీడుమా
క్షుద్రపు బుద్ధి శాంతి మది చొప్పడు నీదు మనమ్ము, నీకగున్
భద్రము, నా కొసంగుమని వాలిని వేఁడెను రాముఁ డయ్యెడన్ 12
కవితా స్రవంతిలో గోపినాథ్ గాజుల పల్లి వారి సమస్య:
తనదు భార్య లైన తటినుల మధ్యను
భేద మేల వచ్చె విరివిగ నని
పాఁత స్మృతుల నెల్లఁ బన్నుగ, మీఱఁగఁ
జలము, కోరి విభుఁడు జలధి త్రవ్వె 11
[మీఱఁగన్ + చలము = మీఱఁగఁ జలము; విభుఁడు జలధి = ప్రభువైన కడలి]
వీతము భేదము నెత్తుటఁ
జూతుమె భేదము భవములఁ జోద్యపు మృతులం
జూతుమె యంగ విభేదము
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే? 10
అంతము నందు నైన మఱి యాదిని నైనను గాంచ లేని యీ
పంతము లేల మర్త్యులకు వంశము లందు వచింప నిట్టులన్
వింత రవంత కాంతురె సువృద్ధి వినాశక ఘోర దుర్భ రా
శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే 9
[దుర్భర + అశాంతి = దుర్భ రాశాంతి; సువృద్ధి = మంచి వృద్ధి,
మార ణాయుధముల వృద్ధి కాదు.]
ఖలులం గూడిన నిట్టి గి
రలను వినఁగ నబ్బురంబె రాద్ధాంతమ్ముల్
పలుకుదురు పాయు లిట్లుం
గలుఁ ద్రావెడి వారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ 8
తలఁపం గా దిది మూఢనమ్మకము తధ్యంబై ధరం జెల్లునే
బలభద్రాదులు నిల్చి రిచ్చటను విశ్వత్రాత తో నింపుగాఁ
జెలువంబై సతతమ్ము నీ రచట నిక్షిప్తమ్ము, నేఁ జెప్ప నీ
కలుసా రా యిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్ 7
[నీకు + అలుసా; రా + ఇల = రా యిల]
తుదిఁ గాంచ విత్త గృహముల్
సదువులు భార్యా తనయులు శకట క్షోణుల్
పదిలమ్ముగ నీ నేరవె
యిది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్ 6
చదలున నున్న భావము భృశమ్ముగఁ గల్గును దూది మాదిరిం
బదపడి చేయ నీయదు విపన్నునిఁ జేసి పరంబు నెద్ది యే
నెద వడి దూఱి యూహ లవి యింతలు నింతలుఁ బెర్గి వింతగా
నిది యది కాని దేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్ 5
ఒలుకు మకరందమే నీదు పలుకు లందు
దాటు నీ భాషణమ్ములు కోట గోడఁ
జేత లవి మార్చు మా తల వ్రాత లెల్ల
జేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర 4
ఉత్సాహము.
ఓర్చఁ గష్ట మయ్యె రోగ ముపస మించు నా కనన్
మార్చ శ్లేష్మ వాత పిత్త మలిన రోగ రాశినిం
గూర్చి తీవు గొప్ప మందు ఘోర మయ్యె మ్రింగఁగాఁ
జేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో 3
కాల్చ నెంచిన వంశపు గౌరవమ్ము
ముంచఁ దల్చ మెయిని రోగ సంచయమునఁ
గాంచ నెంచిన వేగంబ కాలు నిల్లు
మంచిదగు మద్యపానమ్ము మాన్యులకును 2
అంచిత సోమపానము సురాళికి మే లగు వారి వోలె మీ
రెంచి పరిగ్రహించిన నిజేంద్రియ రాశి నశించు వేగమే
మించిన యట్టి పట్టుదల మేదిని వీడిన జీవకోటికిన్
మంచిది మద్యపాన మనుమాన మదేలనొ సజ్జనుల్ గొనన్ 1
[కొనన్ : ఈ విషయము గ్రహించుటకు]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి