సూక్తమ్ము నాలకింపుమ
భోక్తవ్యము లందు నింక భోగములం దా
సక్తియె మది లేకున్నన్
భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్ 55
యుక్తాయుక్త విచక్షణుల్ మనమునం దూహిం త్రభేదమ్మునున్
ముక్తిం గోరుచు మ్రొక్కు చుండుదురు శంభుం గొంద ఱిద్ధాత్రినిన్
రక్తిన్ నిల్పి యెడంద రుద్రు పయి నౌరా వీరశైవాఖ్య స
ద్భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్ 54
చల్లగఁ బ్రాకి జగమ్మున
వెల్లివిరియ నల్పపుఁ గ్రిమి భీకర రీతిం
దల్లడ మందెను లోకము
పిల్లినిఁ గని భీముఁ డయ్యొ భీతుం డయ్యెన్ 53
తొల్లిటి నుండి నమ్మకము దుశ్శకు నావలి మానవాలికిం
బెల్లుగ విస్తరించి యెదఁ బృథ్విని నుండెను డెంద మందుఁ గం
పిల్లుచుఁ గార్య హాని యని వీరుఁడు దుశ్శకునంపు శంకతోఁ
బిల్లినిఁ గాంచి నంతఁ గడు భీతినిఁ బొందెను భీమసేనుఁడే 52
సురుచిర నియమమ్ము గలదు
పరమ పవిత్రము దలంప భర తావనిలో
నరున కొక దారయె పరం
పర సతి పొందు సుజనుల కవారితము గదా 51
నిరతము ధర్మ తత్పరత నిల్చి ఘనమ్ముగ సంతసమ్మునన్
విరివిగ స్వీయ కార్యములు విస్తృత రీతిని నాచరించుచుం
బర సతి నెంచి తల్లి వలె వంశక రార్థము నెమ్మి స్వీయ త
త్పర సతి పొందుఁ గోరుట యవారిత కార్యము సజ్జనాళికిన్ 50
చారులె గణింపఁ జక్కని చక్షువు లట
రాజునకుఁ బాలనమున ధరాతలమున
దుర్గ రక్షణమున భద్ర మార్గములకుఁ
జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు 49
రారా జైనను ధర్మ బద్ధుఁ డగుచున్ రాజ్యమ్ముఁ బాలింపఁ దా
నారాధ్యుం డగు స్వీయ పౌరులకు నత్యంతమ్ముగా ధాత్రి ధ
ర్మారాతి వ్రజ రక్షణైక రత పౌరానర్థకక్రూర రా
జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే 48
[రాజ+అరి = రాజారి,రాజునకు శత్రువు]
విద్యోత నార్థ మాత్రమ
సద్యో యత్న మొనరించి సంబరమున నే
నాద్యంతము వీక్షించుచు
నుద్యద్రవిఁ బడమటఁ గని యుక్తం బంటిన్ 47
ఛేద్యంబై తనరంగ సంశయము వే ఛేదింపఁగా నొప్పు ని
ర్భేద్యం బైనను మున్ను భేద్యముగఁ గావింపంగ యత్నింపుమా
చోద్యం బైనను నేను మున్నెడఁద సంశోధించి ప్రాక్దిక్కు నం
దుద్యద్భానునిఁ గాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్ 46
[పశ్చిమమునన్ =వెనుకను]
సామాన్యుం డెదుగఁగ నీ
భూమిని విజ్ఞాన మం దపూర్వమ్ముగ విం
తేమున్నది లోకై కా
సామాన్యుఁడు లోకమున యశమ్ముం బడసెన్ 45
ఏ మాత్రమ్ము భయమ్ము లేక మది లోకేశుండు నౌ రుక్మిణీ
భామా నాథుని వాసుదేవు నట సంభావింప నీ రీతి సం
గ్రామేచ్ఛన్ శిశు పాలుఁ డుగ్రుఁ డయి యా కౌంతేయు నిందించె ధి
క్సామాన్యుం డొకఁ డీ ప్రపంచమునఁ బ్రఖ్యాతిం గనెం జిత్రమే 44
వీస మైనను జెందక భీతి నెడఁదఁ
జెలఁగి కాదన్న వారిని నిలిపి బయట
బాస సేసిన కన్యను ద్రోసి పుచ్చి
వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె 43
కలుగఁగఁ బ్రేమ చిత్రముగఁ గాంచిన యంతటనే యెడంద లో
పల వడి నుద్యమించి కడు పంతము నూని యెదిర్చి యెల్ల వా
రల నృప కన్యకా మణిని రాచ కుటుంబపుఁ గొట్టి నమ్మ లే
వల చిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్ 42
క్రుంగ వెత లెల్లఁ దాఁకఁగ
నింగి విజృంభించి కరము నిన్నెల్లరుఁ ద
క్కంగ సఖులు సాయం బడు
గంగను గాన విఁక నీకుఁ గష్టములె కదా 41
భంగము లయ్యె నాశలు శుభం బొనగూరెడు మార్గ మెద్ది యె
బ్భంగినిఁ దోఁప కున్న యది పన్నుగ రక్షణ మీయ నెంచి యు
త్సంగము నందుఁ గైకొనెడి త్రాతను దుర్భర శోక వార్ధి ము
న్గంగను గాన కుంటివి సఖా యిఁకఁ దప్పవు కష్ట నష్టముల్ 40
ఖండిత నిజ పక్ష చమూ
దండంబై దుఃఖద మయి దారుణ సమరో
ద్దండ రిపు గణ భయంకర
దండమ్మే కౌరవుల మదం బడఁచెఁ గదా 39
మండిత మారుతిధ్వజ విమర్దిత శాత్రవ పక్ష రాట్ఛిరో
మండల భాసి తాంతక సమాన పరాక్రమ దుస్సహప్రభా
భండన దుర్నిరీక్ష్య నర ఫల్గున భీమగదా ద్వితీయ కో
దండము ధార్తరాష్ట్రుల మదం బడఁచెన్ గద యుద్ధభూమిలో 38
మానిని! మానక దేవునిఁ
గానక నీ వున్నఁ బ్రేమ ఖండిత మైనన్
మానస మిత్తువు నీ వభి
మాన వతికి పరుని వలపు మాన్యతఁ గూర్చెన్ 37
[అభిమానవు + అతికి = అభిమాన వతికి; పరుఁడు = పరమాత్ముఁడు]
మానిని రాక్షసీ గణము మాటలతో వధియించు చుండఁగా
దీనను రావ ణాపహృత దేవిని నారసి జానకీ సతిన్
దానవ కాంత యా త్రిజట ధైర్య మొసంగ నశోక వాటికన్
మానవతీ శిరోమణికి మాన్యతఁ గూర్చెఁ బరాభిమానమే 36
పిల్లలు సనంగఁ జెడు దారిఁ దల్లడిల్లి
భర్తల జడత నారసి యార్తి సెంది
నిబ్బరముగ ననుచు నిట్లు దెబ్బ లందు
మందు గొట్టిరి తృప్తిగా మగువ లెల్ల 35
తగ దిది గర్హితం బగును దద్దయు నెల్లర కెంచి చూడఁగా
మగతన మౌనె మానినుల మన్ననఁ గాంచక కొట్ట నివ్విధిం
బగ తగఁ దీరు నట్లు పరిపంథులు క్రుద్ధులు తెచ్చు చుండఁగా
మగువలు మందు గొట్టిరఁట మాఁపటి వేళను దృప్తిగా వెసన్ 34
కని రక్షించును భక్తులఁ
గని శిక్షించును భృశమ్ము కలుషాత్ములనే
యనిశమ్మును వసుదేవుని
చినవానికి నగ్రపూజ సేయుటయె తగున్ 33
వనజాక్షుండు జగద్గురుండు సుర సంభావ్యుండు కంసారియే
దనుజవ్రాత వినాశకుండు తలపం దథ్యంబుగా నర్హుఁడే
ఘనుఁడా కృష్ణుఁడు వాసుదేవుఁడు ధరం గౌంతేయులం బ్రీతిఁ గా
చిన వాఁడే తగు నగ్రపూజఁ గొని రక్షింపంగ మిమ్మెల్లరన్ 32
తేజము మెండు మహోగ్రపు
రాజసము సెలఁగుఁ గడింది రాయల సీమన్
భూజ వరేణ్యము విను మో
రాజ! మహేంద్రి కలదు గన రాయలసీమన్ 31
[మహేంద్రి = బొంతరటి]
ఆయత కీర్తి మంతుఁడు మహాత్ముఁడు ధర్మ విదుండు వాసవ
ప్రాయుఁడు రాజు రాజులకు రాజ నరేంద్రుఁడు వానిఁ బోలెడిన్
రాయలు పెక్కు రింపుగను రాజ్యము నేలిరి యాంధ్రు లెల్ల రా
రాయల సీమలోఁ గలదు రాజ మహేంద్రవరమ్ము సూడఁగన్ 30
కానఁగ విహంగ తిర్య
గ్యోనుల కిల శ్రేష్ఠ తర మగును వీక్షింపం
గా నిర్జర తతి కన్నను
మానవ జన్మమ్ము శ్రేష్ఠమా కాదు గదా 29
ఈ నర లోక సంభవులు హింసను వీడక యున్నఁ గానలన్
గీనల నుండ నోపుదురు కింపురు షోరగ కిన్న రాది సం
తాన సదైత్య సానిమిష దానవ రాక్షస సమ్మతంబ యీ
మానవ జన్మ శ్రేష్ఠ మను మాట యసత్యము సూడ నెవ్విధిన్ 28
కారు మబ్బులె దిక్కుల మూరుచుండ
జల్లు లెల్లెడ నింపుగఁ బల్లవింప
వాన లోనఁ జిందులు వేయ మేను లలరఁ
బ్రేమ జనుల సంబరము దుర్దినమునాఁడు 27
దుర్దమ హర్ష దాయకము తోయద దర్శన మెల్లవారికిన్
మార్దవ సన్మనస్కుఁడు సమంచిత బుద్ధిని వృత్ర దైత్య రా
ణ్మర్దనుఁ డీయ వర్షము ఘనమ్ముగఁ జిన్కులు రాలు చుండఁగా
దుర్దిన మంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీప్రియుల్ 26
[దుర్దినము = మబ్బుతోఁ గూడిన దినము]
కుసుమ దళావృత సుఫల వి
లసిత తరులఁ దగదు త్రుంచ రక్షింప వలెన్
వెసఁ దరువు విగత ఫల దళ
కుసుమమ్మును ద్రుంచఁ దగును గొడ్డలి చేతన్ 25
కుసుమ సమంపు మానసము ఘోరతరం బగు మాట చాలు వే
పస చెడి మొద్దువోవుటకు భైరవ ఖడ్గము లేల నెంచఁగన్
మిస మిస లాడు కొమ్మలను మేదిని మొల్చిన బెట్టిదంపు ఱా
కుసుమముఁ ద్రుంచఁగాఁ దగును గొడ్డలిచేఁ గొనగోట సాధ్యమా 24
[ఱా కుసుమము = ఱా పువ్వు]
ఎఱ్ఱగా నయ్యె నాకాశ మెల్ల దిశలఁ
జేరెఁ బక్షులు గూళ్లకు శీఘ్రముగను
జీకఁటి పొడచూపఁ దొడంగె వీఁక నింకఁ
దూర్పు తెలవాఱె సూర్యుఁడు దొలఁగి చనఁగ 23
[తెలవాఱు= నిస్సార మగు]
దోర దినేశు నారసి సుదూర నభస్తల మందు బింబమున్
మూరఁగ సంతసమ్ము నరపుంగవుఁ డింపుగ నిల్చి వాకిటం
దోరపుఁ బండితుం డొకఁడు తూర్పును గాంచి వచించె నివ్విధిం
దూరుపు తెల్లవాఱినది తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్ 22
[తోయజము =నీటిలోఁ బుట్టినది,ఇక్కడ కలువ ]
అవనిఁ గొడుకు దుడు కైనం
దవులును దోషం బతని పిత కమోఘంబౌ
యవన మొసఁగ లేక యకట
జవహరులాల్ చంపెను గద జాతిపిత నయో 21
కవిసి నమస్కరించి తగఁ గ్రన్ననఁ దీసి నిజాయుధమ్ము న
స్త్ర వరము వీడి యాత్మ ననురాగము భారత దేశ పౌరుఁడే
జవమున దేశపాలనము సల్పుచు నుండఁగ జాతిరత్నమౌ
జవహరులాలు చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై 20
కార్య సాధక లౌదురు కాంత లెంచఁ
గాంతుఁ డే రీతి శాంతించుఁ గాంత కెఱుక
కాంతున కొసంగఁ గాంతులు కాంచి కాంత
మగని సిగలోనఁ బువ్వుల మాలఁ దుఱిమె 19
వాకిటఁ బ్రొద్దు పోక కయి బంధులు ముచ్చట లాడు చుండఁగాఁ
జీఁకటి కాక మున్న యిలు సేరఁగఁ గాంతుఁడు సూచి కాంతయే
వీఁకను బూర్ణ చంద్ర ముఖి భీత మృగాంబక క్రమ్మఱంగ నా
లోకులు మెచ్చ భర్త సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్ 18
దేశ హితయోచనల యందుఁ దేలు వాఁడు
సకల భూత హిత రత విశాల హృదియు
రిక్త కార్య ద్విషుండు దూరీకృతైక
ఖలుఁడు మార్గదర్శకుఁడైనఁ గలుఁగు హితము 17
జలనిధి సన్ని భోన్నత విచార గభీర మనో విరాజితున్
విలస దమేయ దానగుణ వృత్త విశుద్ధ చరిత్ర పూరుషున్
సలలిత మాన సోత్తముని సద్గణ సన్నుత ధర్మ భర్మ మే
ఖలు నొక మార్గదర్శకుఁడుగా గణుతింప హితమ్ము సేకుఱున్ 16
రాగమును జక్కఁగఁ దలఁప రథ మనంగ
స్వరము లేడింటి ననుకొనఁ జక్రము లని
నిజము గాదె యిట్టులనంగ నీరజాక్ష!
రవి! రథమ్మున కేడు చక్రములు గలవు 15
సువిదితమై చెలంగు నవి చోద్యముగా వ్యసనమ్ము లేడు మా
నవునకుఁ దిర్గుచుండును ఘనమ్ముగ నిత్యము చక్ర చక్ర మి
య్యవసర మందుఁ జెప్ప నగు నంచిత రీతిని జీవితంపు టో
రవి! రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే 14
ఈ వసుధా తలమున భర
తావని ఘన కర్మ భూమి యై వెలుఁ గొందెన్
భూవర పాలనమున దు
ష్ప్రావీణ్యచ్యుతియె యిడును బ్రాశస్త్యంబున్ 13
ఈ విశ్వక్షయ శాస్త్ర సంచయములం దెందేని నైపుణ్య మిం
కా విద్వేషము వృద్ధి సేయఁ దగు విద్యాభ్యాస చాతుర్యమున్
భావోద్రేకము పిక్కటిల్ల జనులన్ వంచించు కార్యమ్ములం
బ్రావీణ్యంబు విలుప్త మైననె కదా ప్రాశస్త్య మందంగ నౌ 12
"అట్ట - కట్ట - చుట్ట - తట్ట" పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
అట్టక్కరి శకుని తివిరి
చుట్టఱికం బుండఁగఁ దఱచుగ నల్లునకుం
గట్ట!పగ రేఁపి వానికిఁ
దట్టనివి యుపాయములను దల కెక్కించెన్ 11
చిత్త మందు నిలిపి భక్తి నుత్తమంపు
నిష్ఠ నూని పూజింపఁగ శ్రేష్ఠ తరము
పన్నుగను సత్యదేవుని వ్రతము నెంచి
తిరిప మెత్తిన లభియించు సిరులు మెండు 10
కా విల సాటి సంపదలు కాంచనముల్ ధన ధాన్య రాశులే
యీ వసుధా తలమ్మున మహేశ్వర భక్తికిఁ బుట్ట నేర్చునే
రావము సెల్గ నార్చినఁ బురాకృత పుణ్యము లేక భక్తియే
యేవిధిఁ గాంచినన్ దిరిప మెత్తిన దక్కును బెక్కు సంపదల్ 9
మార వశుఁడు నయ్యె మఱి భరద్వాజుఁడు
మార వశి పరాశ రోరు జపుఁడు
మార వశుఁడు కాఁడె మౌని గాధేయుఁడు
మార కళల మెచ్చె మౌని వరుఁడు 8
సార తరామ లేరితము సాధు జనావలి భావ సమ్మతా
పార విశేష వృత్త సు విభాజిత సత్కృత కామ సూత్ర స
త్కారు నెఱుంగ నట్టి జన కాయము నెందును గాన వచ్చునే
మార కళా రహస్యముల మత్తిలు భాగ్యము దక్కె మౌనికిన్ 7
ఇమ్ముగఁ బండిన కలువలు
తమ్ముల సఖుఁ డుండ గగన తలమం దెలమిన్
నెమ్మిని నింక విడిచి పం
తమ్ములు మురియఁ దొలిదెస సుధాకరుఁ డొదవెన్ 6
నెమ్మి నొసంగ జీవులకు నెమ్మది పొంగఁగ నిండు పున్నమిం
జిమ్మఁగఁ బైకి భంగములఁ జెంగునఁ దాఁకఁగ నాకసమ్మునే
సమ్మద తాప మందఁగను జంటలు కల్వల మేటి పూల వ్రా
తమ్ములు సంతసిల్లఁగ సుధాకర బింబము దోఁచెఁ బ్రాగ్గిరిన్ 5
కైకసీ విశ్రవసులకు గాదిలి సుతు
లై జనించిరి రక్షో గణాధిపులుగ
రావణుఁడు విభీషణుఁడును రమ్య భీమ
కర్ణ కుంభకర్ణులు సూడఁ గైక సుతులు 4
[చూడన్ గైక సుతులు: రామలక్ష్మణులు సూడఁగా]
జీర్ణములే పురాణములు చెన్నుగ నీ కని వింటిఁ జక్కఁగం
గర్ణ పుటమ్ములే తనియఁ గ్రన్ననఁ బేర్కొన వీరి నీవు సం
పూర్ణపు నమ్మకమ్మునను భూరి యశస్వులు వీర లెవ్వరో
కర్ణుఁడు గుంభకర్ణుఁడును గైక సుతుల్ గను మయ్య ధీనిధీ 3
చిఱు చుక్క లుండ ముఖమునఁ
దెఱవకుఁ దన నెచ్చెలి కటఁ దెల్లం బగుచున్
మఱి తనకు సాటియే యని
తఱిఁగిన యందముఁ గని సతి దద్దయుఁ దనిసెన్ 2
వెఱపును వీడి డెందమున వేరుల మందును రుబ్బి రుబ్బి తాఁ
దఱచుగఁ బూసి పూసి మఱి తత్ఫలమే వికటింప నత్తఱిన్
మఱవఁగఁ జాల నట్టి చిఱు మచ్చల తోడ సపత్ని దైన యా
దఱిఁగిన యంద ముంగని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి