1, జనవరి 2025, బుధవారం

పద్యాలు 2025.

మన యుగాది తప్పక ముద్దు మనకు నెన్న  
నుత్తమమ్ము వారికి వారి క్రొత్త యేఁడు 
పొగడుమా నీదు సంస్కృతి మురిసి మురిసి 
వారి చెడు వీడి మంచిని మూరి కొనుమ                                    29 

త్రాగుటకు నది యొక వంక తలఁప నిజము 
గౌరవము క్రొత్త యేఁటిపైఁ గాంచ రెవరు 
క్రొత్త సంకల్పము లెదల రిత్త లగును 
వచ్చుచును బోవు చుండును వత్సరములు                                                28 

పత్రికా భాషను బరికింప దుఃఖ మొదవుఁ దెన్గు వారికిఁ దద్ద యెదల 
భాషకుఁ దగ నాటపట్టులు కావలెఁ బలువురు వీక్షించు భవ్య దూర
దర్శన సంఘటితప్రవాహ తతులు దిన మాస సంచికా తిలక తతులు 
గొప్పతనము సూపఁ గోరి తిప్పలఁ బడనేల దుష్ట సమాస మేల పలుక     
వరుస జాతీయ రహదారి, వర్షగండ, 
మంట యక్రమ త్రవ్వకా, లంట యధిక
వడ్డి, యక్కట భారత గడ్డ, యంట  
వెంట రైతాంగ, ముద్యాన పంట, లంట 
వింటె తీవ్ర యిబ్బంది, మే మంట వుట్టు                                              27 

సుజను లిల నారికేళా
భ జనులు సుమ్ము పరు లెన్న బదరీ సము లా 
కుజనులు మనోహరులు వెలి 
నిజాంతరంగంబు నరయ నిష్ఠుర జనులే                                                          26 

సాత్యవతేయు భంగి నిల సాత్యవతేయుఁడ వీవు నెన్నఁగా 
సత్య గవేషణా రతిని సంతత ముంటివి నిశ్చలమ్ముగాఁ 
గృత్యము లందుఁ గ్రుంగక స్వకీయ మనమ్మును నిల్పి చేసితే 
యత్యయ పంక్తి నో జనక యార్తి వహింపక యోర్చి వెల్గితే                               25 

కమనీ యోజ్జ్వల సద్గు ణావృత లసత్కారుణ్య పాథోనిధీ! 
విమ లాంతఃకరణప్రదీప్త చరితా! వేదాంత విద్యోన్నతా! 
రమణీ యామల పోచిరాజ కుల పారావార తారాధిపా! 
కొమరుం డింపుగ నీయ భక్తిమెయిఁ గైకొమ్మా నమో వాక్కులన్       24 

జ్యేష్ఠాత్మోద్భవ నల్లు నింకను ద్వితీయేద్ధాత్మజన్ భర్తనున్ 
శ్రేష్ఠుండైన కనిష్ఠు నల్లుఁ దమి సచ్ఛీలుం జతుర్థున్ లస
త్కాష్ఠాంగార విరాజమానునిగ నాకర్షించితే యల్లునిన్    
నిష్ఠం దండ్రి స్నుషన్ ద్వితీయ నణఁపన్నిత్యేహ కష్టమ్ములన్                        23 
[జ్యేష్ఠ పుత్రికను, నల్లునిని, ద్వితీయగా వెల్గు కుమార్తెను (ఆమె) భర్తను, 
శ్రేష్ఠుఁడును సచ్చీలుఁడు కనిష్ఠుఁడు నగు నల్లునినిఁ, గాష్ఠపుటగ్నిలో విరాజ
మానుఁ డైన చతుర్థపు టల్లునిని ద్వితీయ స్నుషను నిష్ఠతో నిత్యము నిహమునఁ గలుగు 
కష్టములను బోగొట్టుటకు నాకర్షించితివి కదా తండ్రీ!]     

సోమశంకర సోదర సంస్మరణము: 
తనరారన్నను సోమశంకరుఁడ! కందర్పాంగ! చిన్నన్నయా 
యనుచుం  నిత్యము పిల్చుచున్ వినయ మేపారంగ నో దమ్ముఁడా
యనురాగమ్మును గౌరవాదరము లత్యంతమ్ము చూపించితే 
కనరాకుండెడి సీమ కేఁగితి వహో కైలాస వాసార్థమై                                              22      

హర చింతా వర తత్పరుండ వయి కృష్ణానంద భక్తుండవై 
యరవిందాక్ష పదాబ్జ యుగ్మ నత శీర్షారాధ నోద్యోగివై 
చిర సంసేవిత మాతృపాద పద్మ యుగ సంక్షిప్తైక చిత్తుండవై 
పర లోకాంచిత ధామ రత్న పరమ ప్రాప్తుండవై నిల్చితే                                          21 

పెద్దలఁ గాంచి నంతఁ దగఁ బేరిమి తోడుతఁ బల్కరించుచున్ 
విద్దెల నింక బుద్దులను బ్రీతిని నేర్పుచు శిష్య కోటికిన్ 
సుద్దుల నింపి తేనియలు, చుట్టములం గడు గౌరవించుచుం 
గ్రద్దన నెట్టితే బ్రతుకు రమ్య తరమ్ముగ సోమ శంకరా                                             20 

రక్ష నొసంగి బిడ్డలకు రాని విధమ్మున నెట్టి లోటునున్ 
దీక్ష వహించి నెమ్మదిని దేవ చయమ్మును గాంచి భక్తిమైఁ
గక్షల జోలి కేఁగకయుఁ గార్యము లెల్లను జక్కఁ బెట్టి యీ
శిక్ష నొసంగి దార కిలఁ జేరితె గమ్యము సోమ శంకరా                                             19 

మాతృ భాష యొసంగును మనకు ముదము  
భారతమ్మున భాషలు పరఁగుఁ బెక్కు 
లడరు భూగోళ భాష లనంతము లయి 
యన్య భాష యనంగ లే దవని ప్రజకు                                                 18 

దాన మొనర్ప కింతయును దా నగు నెవ్విధి నన్నదాతగా 
వానిని నమ్మ యన్నమును వారక సస్యము పండ నేలలో 
మానుగ నన్న విక్రయుఁడు మర్త్యుల యం దన నొప్పు నట్లు కా 
దేని చెలంగి యన్నసృజుఁ డీతఁ డనంగఁ గరమ్ము మేలగున్                                  17 

పెద్దన నాఁటి శబ్దముల పెంపును గాంచినఁ దేటతెల్లమౌఁ  
గద్దని వేల యేండ్ల మును కమ్మని వాసన లీను తెన్గు లే
కిద్దెస సాగ రోపమ మహీన గభీర పదౌఘ ముండునే 
పెద్దగ నొక్క తూరి క్రమ వృద్ధి వహింపక సద్య మెన్నఁగన్                           16 

ఎందును నాగ నేర దిల నెన్నఁడు నొక్క క్షణమ్ము కూడ నే 
చందము నైననున్ మరలఁ జాలదె యొక్క పదాంతరమ్మునుం 
గుందు టెఱుంగ దెన్నఁడు నగోచర రీతినిఁ దాఁ జరించుచున్ 
ముందుకు సాఁగి యేగుటయె పొల్పుగ నేరును గాల మెత్తఱిన్                                    15 

చిక్క నొక్క ఘడియ చింతఁ దీర్పు పరుని యేలన నాయువె యివురు నంత 
చిక్క నొక్క దినము సేయుమ దానము నేలన నాయువె యివురు నంత 
చిక్కిన నొక నెల క్షేమములను గూర్పు మేలన నాయువె యివురు నంత 
చిక్కిన నొక యేఁడు సేకూర్పు శాంతిని నేలన నాయువె యివురు నంత 

మంచి పనిఁ జేయ నిత్యము మంచి దినము 
చెడ్డ పనుల నెల్లప్పుడు నడ్డగించు 
రేపు రేపని కృత్యమ్ము నాప వలదు 
నరున కాయు వడఁగును క్షణక్షణమ్ము                                                     14 

కాకుత్స్థాన్వయ వార్థి పూర్ణ శశి దాఁ గల్యాణ రాముండునై 
రాకాచంద్ర నిభాస్య మైథిలికి భద్రక్ష్మాధ రాంతస్స్థలిన్ 
శ్రీకాంతుండు రఘూద్వహుండు వసుథన్ శృంగార నాథుండునై 
లోకైకోన్నత రక్షకుండు నయి సంరోధించు నిక్కట్టులన్                                             13 

కార్య విహీనునకు క్షణం
బార్యా యుగ మగును నిత్య మలసత్వమునం 
గార్య నిమగ్నునకు యుగం 
బార్యా క్షణ మగును నిత్య మాలోచనలన్                                                             12 

విశ్వావసు యుగాది: 
ఓ విశ్వావసు నామ వత్సరమ పౌరోద్యోగ సంధాత్రివై  
భావోద్రేక వినాశకారిణివి నై భద్రార్థ సంరంభివై 
దైవానుగ్రహ పాత్రులై జనులు నిత్యంబుండు నట్లింపుగా 
వే వీక్షింపుమ శాంతి సౌఖ్యము లిలం బెంపొంద నిమ్మా దయన్                     11        

విశ్వక్షేమ రతాంతరంగ వికసద్విశ్వావసూత్తుంగ నా
మైశ్వర్యప్రమ దాయు రుచ్చతమ విద్యా కార్య సంధాయకీ  
శశ్వల్లోక జనౌఘ వర్ధన సు రక్షాదక్ష విఖ్యాత మ
మ్మాశ్వాసింప దయార్ద్ర చిత్త వయి రమ్మా వర్ష వర్గాగ్రణీ                     10 
   
అలసిరి జనులీ క్రోధిని 
నల పొసఁగక సుఖ మొసంగ నందఱి కిలలోఁ 
జెలువము మీఱఁగ వత్సర
లలామ విశ్వావసు వెస వ్రాలుమ జగతిన్                                                                 9 

భృగు వారము పిలువంబడు 
జగమ్మునను శుక్ర వార  సన్నామమునన్ 
భృగు నందన గద భార్గవి 
తగుఁ బూజింపంగ రమను దద్దివసమునన్                                                 8 
 
క్షీరాబ్ధిజ జన్మదినము 
వారాశి ననువుగ శుక్ర వారము నాఁడై 
మూర నగును జింతింపన్ 
వారము వారమ్ము పూజ వరఁగిన మేలౌ                                                                7 

రస వాంఛించిన దెల్లఁ గోర నిలలోఁ బ్రాప్తించు నిక్కట్టులే 
దిసలం జూచిన దెల్లఁ గోర నెద నుద్వేగంబు సేకూరునే 
వెస ఘ్రాణేంద్రియ కాంక్షఁ దీర్పఁ దలఁపన్ వే కల్గు దుఃఖమ్ము మూ
రి సెవుల్ విన్నది యెల్లఁ గోర నకటా రేఁగున్ విరోధమ్ములే                                        6 

దీర్ఘపు టాయు విచ్చి కడు దీవన లిచ్చి దయార్ద్ర చిత్తుఁడై 
దోర్ఘన శక్తి నిచ్చి వరదుండు రమాధవుఁ డాదరంబునన్ 
దుర్ఘట నాదు లెల్లఁ బరితోష మొసంగ నశింప సంత తా
నర్ఘ దయా రసామృతము నందు మునుంగ నొనర్చి కావుతన్                                         5 

నీ విల లేని లోటు తరుణీ మణి సత్యము తీర దెన్నఁడున్ 
నీ విడి నట్టి గుర్తు లవి నీరజ లోచన మాయ వెన్నఁడున్ 
నీ వెద నింపి నట్టి కమనీయ వచో౽మృత మింక దెన్నఁడున్ 
నీ వమరాలయం బరుగ నిల్చె దృఢమ్ముగ గుండె ఱాయియే                                           4 

ఆది వయస్సఖప్రతతి యప్పన పల్లి పురాంతరమ్మునన్ 
మోద మెలర్పఁ గూడికొని ముచ్చట లాడఁగఁ జిన్న నాఁటి స్వాం 
తోదయ భాషణమ్ముల యథోచిత లీల ముదావహమ్ములన్ 
మేదిని నింత కేరికిని మించిన భాగ్యముఁ గాంచ శక్యమే                                         3 

దొడ్డవరాన బిడ్డలను దొడ్డ మనమ్మున గడ్డుకాలమం 
దడ్డము లడ్డగించి యల యడ్డ మెఱుంగని యెడ్డు నెక్కి నీ 
వెడ్డెము లెన్ని పడ్డఁ బయి నింపుగ వడ్డన సేసి దుడ్డులన్ 
గొడ్డుఁదనమ్ము వాపి మఱి గుడ్డ లొసంగి గిరీశ! కావవే                                                    2 

ఇడ సిరి రెండు వే లిరువ దేనవ రమ్యపు టాంగ్ల వత్సరం
బడరుచు వచ్చె విశ్వ మను జావన సంభృత కార్య దీక్షతోఁ 
గడు దయ శాంతి భద్రతలఁ గ్రన్ననఁ గూర్పఁగ యుద్ధ భీతులే 
యడఁగ నిరంతరం బొసఁగు హర్షము నాయువు నెల్ల వారికిన్                                          1. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి