స్నాన మాచరింత్రు జనులు నిత్య మయిన
భక్తి సంతరించి వఱల నంత
రంగ మందు భృశము గంగా నది యొసఁగ
మధుర మగును విషము మానవులకు 56.
[విషము = జలము]
వ్యధఁ గావించును మద్య మం చెఱిఁగి త్రావం జూతు రెట్లన్నచోఁ
గుధ రాభమ్ముగ నిల్వఁడే ముదమునన్ ఘోరాప రాధమ్ము నే
విధిఁ గావించినఁ బుత్ర రత్నము విజృంభింపంగ వాత్సల్యమే
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్ 55.
క్రికెట్టు - వాలీబాలు - టెన్నిసు - పోలో
ఈ పదాలతో రామాయణార్థంలో స్వేచ్ఛాఛందంలో
ఇది వక్రి కెట్టు లర్థ మ
గు దుర్మతికి రాజనీతి గురువే పో లో
నద టెన్ని సుఖము లొసఁగిన
యది వాలీ బాలు ననుజు నాలినిఁ గొంటే 54.
వింటి శ్లేషార్థ సంయోగ విశ్వ కీర్తి
తాంధ్ర భాషా మహా కావ్య మది యని తగ
నర్థ తాత్పర్యము లిడిన నంత సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ 53.
వెలసిన ద్వర్థి కావ్యము గభీర పదౌఘ విరాజితం బిలన్
సలలిత శబ్ద సంచయ లసన్నుత దేవ గణాంధ్ర భాష లం
దలఘు వివేక వంతులకు నగ్ర మనీషి గణాళికిం గడున్
సులభము గానె యర్థ మగు సూరన రాఘవ పాండవీయమే 52.
వంత యేల తప్పున్నదె సుంత యేని
యక్క వ్రత మొనర్పంగ నొక్కొక్కరికిని
సాయ మొనరింపఁ దలఁచి తత్క్షణము దాను
వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల 51.
ఇతరాలోచన లెల్ల మాని మనమం దింతేనియున్ గౌరవా
న్విత సద్భావము నూను మమ్మ యిఁక విద్వేషంబు త్యాజ్యం బగున్
వ్రతముల్ నిష్ఠ నొనర్చి పెక్కిఁటిని సద్భక్తిన్ యథోక్తమ్ము కు
వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్. 50.
ఆఢ్యా కా దీ పంచమి
కుడ్య మొకటి శేష ముండెఁ గ్రొత్తగ నింకన్
రాడ్యమలం బిటకు బహుళ
పాడ్యమి తరువాత వచ్చుఁ బంచమియె సఖా 49.
ఈడ్యపు బుద్ధి యున్న యెడ నిప్పుడె యప్పును దీర్పు s మయ్య యీ
జాడ్యము నీకు నేలనయ చైత్రపుఁబాడ్యమి నిత్తు నంటివే
విడ్యము తోడఁ దప్ప కని బీరపుఁ బల్కులు పల్కి యుంటివే
పాడ్యమి పోయెఁ బిమ్మటను బంచమి వచ్చెను నమ్ము మిత్రమా 48.
కన్న కొడుకుఁ గొని చన నా
పన్నుం డివ్వధిఁ దలంచె వసుదేవుఁ డెదన్
నన్నిట నక్కట గాడిద
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్ 47.
కన్నని నీతి వాక్యములఁ గాంచినఁ దెల్లము గాదె యివ్విధిం
బన్నుగఁ దాను సుస్థితపుఁ బ్రజ్ఞుఁడు గా వలె నన్నఁ జక్కఁగా
మన్నన నింపుగా నొసఁగ మాని ముదం బెద నవ్వఁగాఁ దగుం
దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్ 46.
తోరపుఁ బ్రాయశ్చిత్తము
నా రావణఁ డత్యధిక మదాంధుం డకటా
కారణము మేము సుంతయు
నేరము దశముఖుఁడు సేయ నేరక మడిసెన్ 45.
ఆ యనుమయ్యనుం గని కటా కపిఁ జంపుట రాజ నీతి కా
దే యని సమ్మతించి వెస నించుక తోఁకకు, శిక్ష నన్యమున్
వేయక యుంట నిప్పు నిడి వెఱ్ఱి తనమ్మున దూత యౌటఁ దాఁ
జేయని నేరమై తగని శిక్షకుఁ బాత్రుఁడు పఙ్తికంఠుఁడౌ 44.
మెండుగ నామెఁ బొగడ నఖి
లాండము పాక నిపుణతకు నబ్జ వదన భూ
మండల మందు వెదకి కూ
ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్ 43.
మెండుగ నుద్ధరింపఁ దగు మేటి కులమ్ము సరోరుహాక్షి యే
గండము లేక నిష్ఠకును గమ్మగ నత్తఱి చేసి స్నాన ము
ద్ధండము శాక సంయుతము దప్పళ మంచిత భోజనమ్ము హీ
నాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁ డైన భర్తకున్ 42.
కవనం బవసర ముండక
వివరణ మిసుమంత యే నవిచ్ఛిన్నముగా
సువిదిత దోష తురంగమ
కవి గా కున్నను మధురముగా రచియించెన్ 41.
[కవి = కళ్లెము]
భువిలో నెందఱు లేరు సత్కవులు సంపూ ర్ణాఖిల జ్ఞానులై
సువివే కాత్ములునై చరించుచును నస్తోకప్రభా యుక్తులై
ఛవిమత్కావ్య దురంధరుండు లస దంచన్నన్న యా ద్యాభ త
త్కవి గా కున్నను లోక మాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్ 40.
రాఘవునిఁ గన్ను లార నరయఁ దలంచి
పెక్కు దినములు ముదుసలి వేచి నట్టి
కష్ట ముపశమింపఁ గరుణా దృష్టి నంత
శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును 39.
అబలను గూడి దాశరథి సానుజుఁ డుండఁగ దండకా వనిన్
గుబు లొక యింత లేక మదిఁ గోపము గర్వము పిక్కటిల్ల మూ
రఁ బగయె తన్ను మార్కొనఁగ రాఁగ వెసం దన కంత దక్షి ణా
శ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాత బాణమున్ 38.
[బరి = శత్రువు]
ఇప్పట్టున మన పురమునఁ
దప్పక పడు వర్ష మింకఁ దత్తర మేలా
గొప్పగ నాలు మగలు, పో
కప్పా లే, కప్ప లయ్యెఁ గల్యాణమునన్ 37.
అప్పా యేమన వచ్చు నొక్క నగరం బం దౌర గర్వాంధులై
యప్పాఱుల్ తనుఁ దిట్ట భీమ కవి కోపార్తుండు నేత్రమ్ములన్
నిప్పల్ రాలఁగ ఘోర శాప మొసఁగన్ నిర్ఘాత తుల్యమ్మునే
యప్పా లెల్లను గప్పలై యెగిరెఁ గల్యాణాంగనం బందునన్ 36.
లోక కల్యాణ మెంచక రోష మూని
విశ్వ విలయమ్ము సృష్టింప వీఁకఁ జెలఁగి
దుష్ట వాంఛలపై నిడి దృష్టి నిష్ట
దైవమును గొల్వ రా దంద్రు ధర్మ విదులు 35.
కావఁగ నేర్చునే నృవర కాయము దైవ మొసంగ నెంచినన్
వావిరి యీతిబాధ లనివార్యము లోకము నందు నౌర సం
భావన సేసి యెన్నఁడును మానవ నాథుల, విస్మరించి యా
దైవముఁ గొల్వ రా దనుచు ధర్మ విదుల్ వచియింతు రెల్లెడన్ 34.
మామిడి - నారింజ - జామ - నేరేడు" పై పదాలను
అన్యార్థ ప్రయోగమున రామాయణార్థములో స్వేచ్ఛాఛందము.
కనుమా మిడి శిఖి నారిం
జని కదియం జామ! యసురు ఛాతిని రక్తం
బను నే రేడు నొకటి యో
జనమ్ము పాఱినది యక్కజముగ వనమునన్ 33.
[నారిన్ + చని = నారిం జని = నారనిఁ బొంది; మిడి శిఖి =
తీక్ష్ణ బాణము; రక్తంబు+అను +ఏరు +ఏడు =రక్తం బను నే రేడు]
భువి లోన దేవ దేవుని
నవమానింపఁ దగ దేరి కైనను సత్యం
బవలోకింపఁగ నెవ్విధి
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్ 32.
శ్రవణానందము గల్గ రుద్రునకు వాత్సల్యంబు వర్ధిల్లఁగా
నవనార్థమ్మున కుత్సహింపఁగ నసాధ్యం బెద్ది వీక్షింపఁగా
భవ భక్తాలిని నిర్దయం గదియు నాపద్రాజి కెల్లన్ వెసన్
శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్ 31.
కుంది నిందా వచనము లెడందఁ దాఁక
దాన వేంద్రుఁ డత్తఱి స్వీయ సూను గాంచి
భగ్గు మని మండి మితిమీఱు పౌరుషమ్ము
నంది హుమ్మని గర్జించె నదరి పడఁగ 30.
కులమతమ్ముల భేదముల్ సెలఁగి నంత
నంతరించు మనశ్శాంతి సంతతమ్ము
నిజము నడరి వక్కాణింప నిత్య వీత
కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు 29.
మెలఁగిరి మిత్ర భావమున మిన్నగ నెల్లరు పూర్వ మక్కటా
కలియుగ మందు వార కధికమ్ముగ నొండొరు లందు ద్వేషముం
దలఁపఁగ నేకతా కుల మతమ్ముల మధ్య నిరంతరమ్మునుం,
గుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్ 28.
తెలియకయే సత్యము య
గ్గలముగ నిద్రింప నగ్ని కాలిరి యకటా
సలసల యెల్లరు, పలుకిరి
నలువురు, పాండవు లటన్న నమ్మిరి జనులే 27.
[అటు + అన్న= అటన్న, ఆ ప్రకార మన్న]
కలుగ నుదర్చ్యనుగ్రహము కయ్యము నందు జయమ్ము సాధ్య మ
న్యుల నెదిరింప నేఁగఁగ ధనుర్ధరుఁ డర్జునుఁ డుత్సహించుచుం
దొలఁగక నిల్వ సైంధవుఁడు దుర్జయుఁడై యనిఁ జేరి రత్తఱిన్
నలువురె పంచ, పాండవు లనన్ జను లెల్లరు నమ్మినారు పో 26.
[పంచ = సమీపము]
అబ్జ ముఖు లెల్ల రంత విహార రతలు
సంచరింప నిశీధి నుత్సాహ మడర
వదనములు కావు చక్కని పద్మము లవి
విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను 25.
నిశ వికసించు నుత్పలము నింగినిఁ జంద్రుఁడు వెల్గు చుండఁగా
శశి వదనా కనుంగొనుమ చక్కఁగ నిప్పుడు తెల్ల వాఱ న
ల్దిశల వెలుంగు లీన సిత తీవ్రతరాంశువు, తా వొసంగఁగా
శశి, యుదయించి నంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్ 24.
పురు షోత్తముండు వర బ
ర్బర దేశస్థుండు వేద పారాయణుఁ డి
ద్ధర నర్థుల కెల్లరకును
బరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్ 23.
ధరలో లేరె మహాత్ము లెంద ఱకటా ధర్మజ్ఞు లుద్ధండులున్
సరి లే రెవ్వరు వాని కంచుఁ బరమాశ్చర్యంబ యిబ్భంగి నా
నరునిం గూర్చి వచింప నీ వతని యౌన్నత్యమ్ము దా నేరఁ డే
పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్ 22.
వెఱవ నేల ధరలు పెరుగక మానవు
తీరవు కడగండు లేరి కైన
మున్పటి వలెఁ గాక పురమందుఁ గొద్దిగఁ
బెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు 21.
తరుణుల మానసమ్ములను దాన గుణం బధికమ్ము సుమ్ము భా
సురముగ నవ్విధిం బగయుఁ జొప్పడ నుండు నిరంతరమ్మునుం
బురుషు లొనర్ప నింద లవి, పుణ్యవతుల్ ధన మీయఁ పల్లవా
ధర, లధికమ్ము లైనను ముదంబును బొందెను బేదవాఁ డహో 20.
ఎన్నఁ డేని వీక్షించిన నిర్వురు నిల
నొక్క విషయమ్ము నారసి వెక్కసముగ
సంతసించిన నవ్విధి సతియు నింకఁ
బతి యడలఁగ నన్యోన్య దాంపత్య మగును 19.
ఆ లీలన్ సతి కూడ భీతిలిన నయ్యావేళలం దాత్మలో
లీలా లోల విలాస వేళలను నుల్లేఖమ్ము లందైన హా
స్యాలాపమ్ముల నైన నేమి నిజ భార్యా వక్త్ర సంతప్త భా
వాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ 18.
అకట యేమని చెప్పుదు నన్న మొకటి
దక్క రొట్టె లన్నవి లేవు దారుణముగఁ
గల నయిన నెన్నఁ డేను రొట్టెలను గాని
యన్నముం దిన నాఁకలి యధిక మయ్యె 17.
[తినను + ఆఁకలి = తిన నాఁకలి]
అన్నుల మిన్న వంట పరమాన్నము తోడుత భోజనం బహో
కన్నుల కింపు గొల్పఁ దమకమ్ము సెలంగ నెడంద నాకునున్
సన్నగ నుండ మున్ను, సరసం గడుపార నసంశయమ్ము వాఁ
డన్నముఁ దృప్తిగాఁ దినిన, నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో 16.
దోఁచుకొనఁ ద్యాగరాజును వేచి చూచు
చుండఁ గోదండ రాముఁడె యండ కాఁగఁ
గాంచి భీతిల్లి వే విరమించి యొక్క
శ్రావణుఁడు రామ భక్తుఁడై ప్రణతు లిడెను 15.
[శ్రావణుఁడు = మోసగాఁడు]
కావఁగఁ జాలు సూర్య కుల కాంతుఁడు తప్పక యంచు నెంచి స
ద్భావము నూని డెందమునఁ బాయక మంత్రులు రాఁగ నల్వురున్
వే విడి స్వీయ లంకను విభీషణుఁ డార్తినిఁ, బొమ్మనంగ నా
రావణుఁ, డేఁగుదెంచి రఘు రామునకుం బ్రణమిల్లె భక్తుఁడై 14.
అక్కట కన్నది గజమే
కుక్కుట శాబమ్ము కాదు కుమతీ కనుమా
మిక్కుటపు టాస నొడిలోఁ
గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా 13.
[కుక్కు= దూర్చు]
చిక్కెను రాక్ష సాధముఁడు శ్రీపతి మాయఁ బరోక్ష భంగినిం
జక్కని విష్ణు భక్తునకు జన్మ నొసంగె హిరణ్య భోజనుం
డొక్కఁడు పద్మనాభునకు నుగ్ర విరోధి నిరంతరమ్మునుం
గుక్కకుఁ బుట్టె నంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్ 12.
సందియం బది లేదయ్య యిందు సుంత
చెప్పు చుంటిని వినవయ్య తప్ప కతఁడె
వాఁడె వాఁడె వాఁడే వాఁడె వాఁడె వాఁడె
యెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ 11.
నృవరుల యందు నెన్నగను నిండు మనమ్మునఁ గాంచి చెప్పుమా
కవివరుఁ డార్య సమ్మతుఁడు కారణ జన్ముఁడు వర్తకుండు వి
ప్రవరుఁడు దాత హాలికుఁడు పామరుఁ డర్థ విదుండు పండితుం
డెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో 10.
కోరి నంత నొసంగును మేర లేని
వరముల గరళ కంఠుండు కరుణ తోడఁ
బలుక కున్న నెవ్వ రయిన భక్తి సాంబ
శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము 9.
లవలేశమ్ము నసత్యముం గనము సల్లాపమ్ము లిట్లుండ శ
త్రువులే కాఁగ సమస్త వైష్ణవులు ముల్లోకమ్ములం దౌర పృ
థ్వి విశేషమ్ముగ స్వప్న మందు నయినన్ విన్నంత నా రావ ణా
శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్ 8.
[రావణ + అశివ = రావ ణాశివ]
లోక విఖ్యాత వీర వర్యునకు నిత్య
యుద్ధ సన్నద్ధునకు సద్గు ణోత్తమునకు
దుర్జయ పరాక్ర మోపేత నిర్జిత నిజ
వైరి పాదాంబుజములకు వందనములు 7.
నీరద సన్ని భాంగు ముఖ నిర్జిత శీత మయూఖు సంత తా
పార దయా రసార్ణవు సుపర్ణ విమాను సహస్ర బాహు నీ
రేరుహ పత్ర లోచను సలీలు భుజంగ విరాజి విశ్వ జి
ద్వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్ 6.
నేరము, వైరము, భారము, తీరము ప్రాంజలి ప్రభ దత్త పది:
నేరము సైప మదిని బరు
వై రముఁడు నొగుల్ప వాని యలరుల దం ష్ట్రా
భారముల మమ్ములను సుద
తీ రముల మయిన కతమున ధృతి నశియింపన్ 5.
[ నేరము = ఎఱుఁగము; రముఁడు = మన్మథుఁడు;
దంష్ట్రా + ఆభ + ఆరములు = దంష్ట్రాభారములు,
దంష్ట్రముల వంటి కోణములు గలవి; సుదతీ రములు = నారీప్రియులు]
కంప మెఱుంగక సతము త
లంపుల వైరాగ్యమే యలవడ భృశముగా
నింపార నాత్మ నైతిక
సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్ 4.
కొంపలు రాజ భోగములు కొల్లలుగా లభియించు నింపుగా
గుంపులు గుంపులై వఱలుఁ గోరిన బట్టలు వాహనమ్ములుం
బంపు నొసంగు స్థానములు పన్నుగ దక్కును గోరి నంతనే
సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్ 3.
కుప్పలుఁ దెప్పలు గ్రామ్యము
లిప్పుడు పద్యమ్ము లందు నీక్షింపఁగ నేఁ
డెప్పురి కేఁగినఁ జెప్పుమ
చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసఁగా 2.
ఎప్పగి దిట్టి సూత్రము బుధేంద్రుఁడు చిన్నయ సూరి చెప్పె మే
మప్పగిదిం గొనన్ వగ లనర్హము లెన్నఁగ నేరి కైననుం
జెప్పిన నార్య పుంగవులు చెడ్డయినం గొన నర్హమౌ ననం
జెప్పు తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా 1.
[వగ = ఆలోచన]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి