1, జనవరి 2017, ఆదివారం

సమస్యా పూరణ జనవరి 2017

వల్లంగాదన శాపమిచ్చు గద సంభావించి యీరీతి తా
నుల్లంబందునఁ దల్లి ప్రాణములు వంశోద్ధారకుం డీయడే
యుల్లాసాత్ముని జేయ, భార్గవుడు కార్యోత్సాహి పిత్రాజ్ఞ చే
దల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్                                        64

యాగ రక్షణార్థమ్ము సంయమి వరుండు
కౌశికుని యాజ్ఞ తలదాల్చి గహనమున ద
శరథ సుతుడు తాటకి సుందవర సతీ మ
తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి                                                                          63

ఎఛట నుండి వచ్చె నీ గొలు సంచును
దిక్కు లెల్ల నంతఁ బిక్క టిల్లఁ
గోపమున దనపతి గుట్టు విప్పమనుచుం
జీర, విప్పి సుదతి చిందులాడె                                                                                    62
[చీరు = పిలుచు]

బేరము లాడి చీరను వివేకముతోఁ గొని వచ్చి తా నహం
కారముఁ జూప నెంచి చెలికత్తియ లెల్లరఁ బిల్చి యింటికిన్
గారవ ముప్పతిల్ల నొక కాంతకుఁ జూపి వెసన్నవీనపుం
జీరను విప్పి,  మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్                                             61

గండ్రగొడ్డలిఁ బూని భీకర సమర వి
లోలుడై సర్వ రాజన్య లోక పరమ
 వధకుఁ గోపాతురుండునై  బ్రాహ్మణ కుల
భండనమ్మునఁ బాఱెను భార్గవుండు                                                                            60
[భండనము =  దుశ్చేష్ట]
గండము దీర్చ నెమ్మి సిరికాంతుడు, దానము గీనమేల బ్ర
హ్మాండము నెల్ల నిండు వలదంచు విరోచన సూనుఁ గావఁ దా
నండగ నుండ నెంచి యకృతార్థ మనస్కుడు నేత్రనాశుడై
భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్                                               59
[భండనము =  దుశ్చేష్ట; భార్గవుఁడు = శుక్రాచార్యుడు]

ఏతరి వెతలు వచ్చునో యేరి కెరుక
తలుప దైవోపహతులకుఁ గలదె బ్రతుకు
తల్లి యని యెంచి తాఁ దల్లడిల్ల నంధ
మూషికం బొండు పిల్లిని ముద్దులాడె                                                                    58

ఘోష నికేతనమ్మున నఘోర నినాద వినోద మోది యా
మూషిక రాజ మచ్చట విమోహము నందున నుండ ఖాదనా
న్వేషమునం జరింప మగపిల్లియ, భక్షణ మయ్యె దానికిన్
మూషిక, మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్                                57

ఆకాశ వీధిని నసమాన విద్యుల్లతా తతి తోరణవ్రాత మనగ
పద్మాకరమ్ముల ప్రవిమల ధవళంపు ముత్యాల రతనాల ముగ్గు లనగ
ధరణీ తలము వనార్ద్రస్ఫటిక విభవ జలపూర సమతల ఫలక మనగ
సప్త సాగరముల ఝషరాశి భీతిలి వేగంబ పాతాళ మేగె ననగఁ

బురులు విప్పి యాడ ముదిత శిఖిగణము
బెకబెక నినదములు పృథ్విఁ జెలగ
హర్ష మీయవాన యనఁ దగ దివ్విధి
వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు!                                                                            56

ఘర్షణ హీన మానస వికాసిత మాన ధనుం డచింత్య దు
ర్ధర్ష జనాభిమాని పరితప్త కుటుంబియు సేద్యకర్మ ని
ష్కర్ష మనోభిలాషి పరిఘాత హలార్తుఁడు దుర్భర మ్మనా
వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్                                       55

పారావారత్రయ పరి
వారిత ధరణీ తల పరిపాలక కువ్యా
పారావగ్రహణకరణ
భారత గణతంత్రము జనభారం బయ్యెన్.                                                                54
[అవగ్రహణము = అడ్డపాటు; కరణ = కారణము; 
జనభారము = జనులకు భారము]

వేరుగ బీదసాదలకుఁ బెన్నిధి నింపుగఁ గూర్పు నేర్పులన్
పేరిమి శాస్త్ర సంకలిత విద్యలసాధ్య పురోభి వృద్ధినిన్
ధారుణి నున్న దేశముల దౌత్యము నర్మిలి సల్ప నేవిధిన్
భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో?                                            53

బారియ బీదసాదలకుఁ బండుగ పాలక పంక్తి కిద్ధరం
జేరవు నిత్య మర్హులకు క్షేమదపుం బథకమ్ము లెల్లయున్
బారులు తీరి మ్రగ్గినను బన్నుగఁ బొందుదు రస్మదీయులే
భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో.                                             52
[బారి = హింస]

ధారాళమ్ముగ యక్ష రాక్షస సగంధర్వాప్సరస్స్త్రీ బృహ
త్సారాదిత్య సదైత్య దానవ తతిన్ శార్దూల సింహాదులన్
ఘోరవ్యాళ నభశ్చరాచర మహాగోవ్రాత వైవిధ్యముల్
మారీచుండు ధరాతలమ్మునను సంరక్షించె జీవాళినిన్                                              51
[మారీచుఁడు = మరీచిసుతుడు, కశ్యపుడు]

పారీంద్ర నిభుండు ఘనా
కారుఁడు సక లాస్త్ర శస్త్ర ఘనతర విద్యా
పారీణుఁడు విద్రావిత
మారీచుఁడు రక్షకుండు మహిఁ బ్రాణులకున్                                                              50

గురుత రోపజన పరంపర రమణీయ
రాగ బంధ ప్రచోదిత భోగ కాంక్ష
రత వికాస చిత్త భవ  విరాజమాన
తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?                                                                     49
[ఉపజనము = పుట్టుక]

కమలదళాక్షి!భాషణ నికాయ విలాసిత పాటవమ్మునన్
విమల దయా గుణైక పరివేష్టిత లోకన పారవశ్యతన్
సుమధుర లీలఁ జూడ యమ సూనుడు భూపతి ధర్మ మూర్తికిన్
రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?                                        48

శాంతిని దేశ మందున విచక్షణుడై నెలకొల్పుచున్ సదా
ప్రాంత సురక్షణార్థము నుపాయ విభూతిని సంచరించి వి
క్రాంతిని శత్రు భూవర నికాయము, వీడి దయార్ద్ర చిత్తుడై
యింతుల నెల్ల, నంత మొనరించెడు వాఁడె ఘనుండు వీరుఁడున్                                 47

యింతి కన్నీరు గార్చిన యింట లచ్చి
యుండ నొల్లదు కీడౌను మెండు గాను
రాగ మతిశయిల్లగ వెతలఁ, గరుణించి
భామినుల, నంతమొందించువాఁడె ఘనుఁడు                                                            46

హరిలీలల్ తలపంగ శక్యమ విరించ్యాదిత్య సంఘాలకున్
ధరణీ భారము దీర్ప నెంచి హరి సంధానమ్మ యిగ్గాథయే
యరయన్ రాధకుఁ గుంతి కర్ణు, రవి సద్యోగర్భ మీయన్ మహా
పురుషుండే,  ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా                                      45

తరుణి నిజ నాథునకు నా
తురయై తన కూరిమి సఖి తోరపుఁ  జెలిమిం,
గర ముఱిమిన బాల యనుచుఁ
బురుషుఁడు,  ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్                                                    44

రాము పంపున రాయబారమును జేయ
వ్రాల లంకాధిపతి మ్రోల వాలి పుత్రు
నంగదుం గని నవ్వి వనేంగ! నీకు
రాముఁడేనా? హితుం డనె రావణుండు                                                                     43
[వనేంగము = వనచరము, కోతి]

భీమ పరాక్రమద్యుతిని వెల్గెడి వీరుడు కుంభకర్ణుఁ డు
ద్దామ బలాన్వి తాసుర వితానము నాకు బలంబ యిద్ధరన్
కాముడె యా విభీషణుడు గల్లరి రావణి పీడ్యమాన సు
త్రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే                                       42

వినువీధిని నేగుచు చూ
చిన గగన గమన రథమునఁ జిన్నగఁ గనులం
దనరంగ రంగు రంగుల
శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?                                                      41

వినయం బించుక లేక యొండొరులు నావేశంబునం బోరుచుం
గనిపింపంగ జనాటవీ స్థలమునం గౌలేయ కాకారులై
నినదం బంబర మంటఁ బోరుచు నటన్ నిత్యంబు రక్తాంగులై
శునకమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?                               40

[కౌలేయకము = శునకము; కుసుమము = కుసుంభవర్ణము (ఎరుపు రంగు)]

సంక్షిప్త భగ్నప్రేమ కథ: 
సీ. కష్టాల కడలిలో గరుణతో నింపుగఁ జుక్కానియై తాను జూపె దారి
    చిన్నారి చెల్లిని చిట్టితమ్మునిఁ బెంచ సంగీత శిష్యులఁ జక్కఁ బఱచె
    తోబుట్టువుల కంతఁ దోడు సేకూర్పంగఁ బవలును రేయియుఁ బాటుపడెను
    కంటికి నెప్పుడుఁ గాన రాకుండగఁ గంటికి రెప్పయ్యెఁ గలికి కలరి
తే. చిన్నతనమున స్నేహంబు చిగురు దొడుగఁ
    గులమది నిలువ నడుమను గోడ వోలె
    కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము
    నిలిచె విధిలీల! వారికిఁ దలపు లంద.                                                                 39

ధన సంపాదన కార్యసాధక మనో తంత్రజ్ఞ సంఘాతమున్
వనితా కామ వికార చేష్ట వితతవ్యాపార కూటమ్ము నా
ధుని కాంతర్య విలాస కారక ధృతిన్ దుర్వృత్త  సంవర్గణాం
కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా                                           38

ఇచ్చిరి కుడి గడి జడి పొడి
మెచ్చి పదము లిచ్చట నతి మెలకువ తోడం
గచ్చిత మీ పద్యము విను
మచ్చెరువగ నికఁ గృతార్థమగు నెల్లెడలన్                                                                37

అన్యుల కుడిగము గడిఁ దిగ
విన్యస్తంబయి యలజడి వెలఁ ది ద్రుపద స
త్కన్యకుఁ దప్పొడి కట్టితి
నన్యాయపు జూద మందు నక్కట వెఱ్ఱిన్                                                                  36

అర్వార్వతీ నికా యా
ఖర్వాగార పరి పోషకద్యుతి మంతున్
గర్వ రహితు ననునయుఁ జం
పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్                                                                   35
[చంపా+అర్వతి = చంపార్వతి = చంప పేరు గల గుఱ్ఱము; 
అర్వతి = ఆఁడు గుఱ్ఱము; నాభి = క్షత్రియుడు; 
పంకజనాభి = పద్మమువంటి సుకుమార క్షత్రియుడు]

సర్వ నిశావిహారగణ సంక్షయ కార్యధురీణు దేవగం
ధర్వ ముఖోర గానిమిష తాపస సేవిత పాద పద్మునిన్
సర్వ శుభప్రదప్రవర సాగర కన్యక సంస్తవాత్త దృ
క్పార్వతి మెచ్చి ముద్దుగొనె పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్                                   34

సంసారాబ్ధి తరణి బృహ
దంస విరాజిత శరీరి దనుజ నిచయ వి
ధ్వంసుడు వంశుడు ఖండిత
కంసుఁడు మిము  బ్రోచుగాత కరుణామయుఁడై                                                    33

కంసారాతిగఁ బేరు గాంచ హరి సంకాశుండు భోజేంద్రునిన్
హంసశ్వేత సుతూలికాస్తరను దేహాంతంబు గావించి వి
ధ్వంసంబై తనరారు మంచమున విభ్రాంతాత్ముడై యుండ నా
కంసుండే, మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యముం జూపుచున్                                32

పరువపు గరువ మది విఱిచి
స్థిరమతిఁ బనులవి గుణ పరిశీలన గావిం
చి రయమున సేయఁ, జేయక
తరుణము మించు పను లిడు సతమ్మిల శుభముల్                                               31

త్వరపడి యుద్యమింప నతి దారుణ పర్యవసాన మౌను  బ్రే
మరస విలోక నానుచర మానిత చర్యలొసంగు సౌఖ్యముల్
గురుతర కోప కాలమునఁ గూర్చ నొకింత ప్రశాంత చిత్తముం
దరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్                                30

దండిగ ధననిధిఁ దనదు ధనము మూల్గ
ధన విహీనత కరమునఁ దనను వేఁచ
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు            
నేడు ధర్మమూర్తులె చూడ నేత లెల్ల!                                                                      29

జంకక యీతిబాధలకుఁ జక్కగ  నాఁగటి దున్నిభూమినిం
డంకము పాఱ కత్తులు కుఠారము లూని కృషిన్నొనర్చి తాఁ
డంకము లందు దృష్టి నిడ డాయు కుసీదికు నత్తరిం గనన్
సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్                                               28             
[టంకము = 1. గడ్డపాఱ , 2. డబ్బు;  కుసీదికుఁడు =  వడ్డీవ్యాపారి]

నలినజు సృష్టి చిత్రములు నైపుణి నెంచఁ దరమ్మె యేరికిన్
జలనిధి నింపె రత్నముల జాతము సేసె నబింధనమ్మునున్
వలనుగ భోజనార్థము నపార విహార విలాస నీరధిన్
జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్                                        27
[అబింధనము = బడబాగ్ని; అగ్ని = చిత్రమూలము (మొక్క పేరు)]

కన్నులా యవి నిజమెంచఁ జెన్ను మీన
ములు సుమీ చూడఁ జూడగ ముద్దు గొలుపు
చేడియ ప్రియకాంతునిఁ జూడ సిగ్గు తోడఁ
జలములో నగ్ని పుట్టె! మత్స్యములు మురిసె!                                                          26
[చలము = వణుకు;  మత్స్యములు = నయనోక్తములు]

ఏవిధి తిన్నడే చదువు నెంచె నుమాపతి మెప్పు నొందఁ దా
నేవిధి నేకలవ్యుడు నహీన గుణాఢ్యుఁ డుదారుఁ డయ్యెనే
దైవసమాన సద్గురు వితాన పథాశ్రయులై చరించుచున్
వేవుర సంప్రతించ నవివేకము వోవును విద్యలేలయా!                                                  25

ఎనలేని యాస్తిపరు డొక
డు నరుగు బడికి నను, నావుడున్ ధనదర్పం
బునఁ జదువక వ్యర్థంబం
చను నజ్ఞత, వినఁ బలువురఁ జదువది యేలా!                                                              24
[ వ్యర్థంబంచు +  అనును + అజ్ఞత =  వ్యర్థంబంచను నజ్ఞత]

వరవైకుంఠ సమప్రభ
సురవర సేవిత మురారి శోభిత నగముం
బరమము తిరుమల పృథుశే
ఖరమునుఁ గనినంత నాకుఁ గడు  సంతసమౌ                                                                 23
[పృథుశేఖరము = కొండ]

శరనిధి మానసోల్లసన సంజన కాంశు విరాజమానుడున్
వర సరసీ కవేల చయ వైభవ కారక దీప్తిమంతుడున్
శరదృతు చంద్రికా భరిత చారు నభస్స్థిత భవ్య శంభుశే
ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్                                           22
[శంభుశేఖరము = చంద్రుడు; కవేలము = కలువ]

కారుం గూతలు గావు సుమ్మి యవి సత్కారార్హ గానమ్ములే
వీరావేశము మిన్ను ముట్టగను సంప్రీతిన్ వడిం బాడెడిన్
ధారాపాతపు గాన పుంజములు నిత్యంబౌ విశాలాంగసం
స్కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే                                                   21
[అంగసంస్కార+ఆగారము = అంగసంస్కారాగారము: స్నానశాల;  
 అంగసంస్కారము =  స్నానము; కారు = ముదిమి]

ధారాళపు ధనమున నే
యారాటము లేక ఘనపు టపరాధులకున్
గారాబము దోడ సతముఁ
గారాగారమున ఘనసుఖంబులు దక్కున్                                                                           20

కల్ల సేసి కన్న కలలు గొల్లమేటి
మగఁడు రుక్మికి ఘన చైద్య మగధ సేన
లెల్ల నుల్లమ్ములను దల్ల డిల్ల రుక్మి
చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము                                                                               19

చల్లని చిత్త మున్న మరి చాలదె యందము గూడు వెట్టునే
కల్లలు గాక నిత్యములె కాయపు టందము లెంచి చూచినన్
నల్లని దంచుఁ దా దొర తనమ్మునఁ బక్కనఁ బెట్టి యక్కనుం
జెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే?                                                              18
           

మేదిని సూర్య చంద్ర కుల మేరు ధరాధర సన్నిభప్రభా
వేదులు భాతృ భావ రత విజ్ఞులు జ్యేష్ట వచోనువర్తి స
న్నాదము రామ భారత కథా ద్యుతి పూరిత వైభవమ్ములన్                                                      
సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్.                                                              17
[సోదరులిర్వురు = రాఘవపాండవ సోదరద్వయము] 

హరి కథాశ్రవణము భవ తరణ మెంచ
శైవకథ లెల్ల మోక్షంపు సాధనములు
హరిహరు లిరువురు నిల మహత్కృపా ర
సోదరులు రెండు కథలకు శోభ నిడిరి                                                                                          16
[కృపారస +ఉదరులు = కృపారసోదరులు]

రాపిడి కల్గ జేయునఁట రాతిని నుష్ణము విస్మయమ్ముగన్
తాపము వాపు చిత్తధృతి ధైర్యముఁ బెంచు నుపద్రవమ్ములే
రూపము నిచ్చి యూహలకు రోయ నుపాయము లెల్ల దాంతులై
యాపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్                                                          15

అగ్ర పత్రోపసంహర ణాది చర్య
లను గొని తలచి రిట్లు కల్మషపు జనుల
యాపదలు,  మానవుల యాశ లన్ని తీర్చు                                                                                 14
దలఁచ నొక్కటి మరి ఫలితమ్మె యొండు!
[ఆపు+అదలు = ఆపదలు; ఆపు = అండ; అదలు = తొలఁగు] 

వరము నొసంగ నెంచి మదిఁ బన్నుగఁ గైతవ తాపసుండు నా
నరుఁడయి జన్మనెత్తెఁ గరుణారహితుం డయి చంద్రమౌళియే
గిరిసుతకుం బరీక్షలనఁ గింపురుషుండు శివుం డశౌచియై
తిరిగెడు వానిఁ గోరకుము ధీమతి నన్ మునిమాన్యుఁ బెండ్లి యా
డు రయమునన్ శుభంబగుఁ గ డున్నని పల్కెను సంభ్రమమ్ముగన్                                                 13

నరునకు నొసంగ నస్త్రము పర మనురతి
నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు, గనలి 
క్రోడమునకుఁ బోరాడి నిగూఢముగను
చెచ్చెర నొగిఁ బాశుపతము నిచ్చె మెచ్చి.                                                                                       12

సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక: 
ముద్దుగఁ బంచభూతములు మూరిన వేడ్క నమర్చె నీ భువిన్
సుద్దులు సెప్పరే సుమనసుల్ జగదేక కుటుంబమే యనం
బద్దులు దీరి నంతటనె ప్రాణము వోవును బంత మేలనో
హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసము మక్కువేలనో                                                                 11

మట్టిలోని మానికములు గట్టివారు
చేటికా చేటులకు వర చేలములను
పట్టు తో నేచినట్టివి దట్టము మరి
పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు                                                                                          10
[దట్టము = పావడ; పాలేరులు పంచిని గూడ గోచివలెనే కట్టు కుంటారు] 

వనమున నిండు కుండ గతిఁ బారదు కావడి నుండి యెన్నడున్
వినయ విధేయ సద్గుణ వివేకియుఁ దా పనివేళ లందు న
న్ననయముగాఁ దలంపడట హాలికుఁడుత్తమ బుద్ధిశాలి యా
ధనికుఁడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా                                                              9
[అనయము = అశుభము]

పద్మములు కుమిలె సరసి సద్మ మందు
సూర్యు డస్తమింప భువిని సూర్యకాంతి
కడచె, రాతిరి చుక్కల గములు వొడమె
కలువలు మెరసె చంద్రుని గని దివమున                                                                                         8

అడరన్ శైత్య సమీరణమ్ము లిక నాహ్లాదమ్ము దీపింపగం
దడబాటుం బడనేల వేసరపుఁ బ్రాణంబుల్  సుఖంబందగన్,
నడయాడం బగ లెల్ల కార్యచయ సంతాపమ్మునన్ ఘస్రముం
గడచెన్, రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్                                                                7

అత్త తాతను పాపల నత్తి నుడులు
గండు శిలలైన దూరపుఁ గొండ లన్ని
అంద కుండగఁ గన్పట్టు చందమామ
యంది యందని యందమే విం దొసంగు                                                                                          6

విందము దయ్యముల్ నిలిచి వేదము లన్నియు వల్లె వేయగన్
మందిని మోస పుచ్చి పలుమారులు నేతల మంచుఁ బల్కు రా
బందుల రాజకీయ ఘన భార విధానము లెంచిఁ జూడ నీ
యందియు నందనట్టిదగు నందమె విం దొసఁగుం బ్రజాళికిన్                                                               5
[అందము = విధము ; విందు = బహుమానము]

శీత మయూఖ తేజముఖి శ్రీవని తాంశజ రోచి తాంగినిన్
భీత మృగీ విలోకన నపేత వికల్పమ తీభయాననున్
భూతల జన్మ భాసిత విభూషిత వస్త్ర లలామ జానకీ
మాతనుఁ బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుఁడే                                                                 4
[అపేతము = తొలఁగినది;  వికల్పము = భ్రాంతి]

ఆతడు లోకమునకు విప
రీతముగ నరణ మొకింత లేకయ తరుణిన్
భీతహరిణలోచన, విను
మా, తనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్                                                                                       3

చేతోభ వానుకంపన
జాత సుకర్మానురక్త చైతన్యమునన్
వీతద్వేషులయి చనక
నూతన వత్సర మనుచు వినోదము లేలా                                                                                           2

ఆతత నీత ధర్మ నిరతాతిశ యాత్మ విరాజమానుడై
వీత మదాగ్రహావకర భీషణ కర్మ నికాయ దీప్తి వి
ద్యోత జనానురంజక సుయోగ్య తరాంచిత కార్య హర్షికిన్
నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా                                                                          1
[ఆతతము = విస్తృతము; నీతము = పొండబడినది; 
నిరతము =మిక్కిలి ఆసక్తికొన్నది;అవకరము = హీనకృత్యము]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి