6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

భార్యాస్మరణము.

 

 

నిజ భార్యాస్మరణము:

(పోచిరాజు వేంకట రామ లక్ష్మి)

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)

 

 

 

 

 

కం.

ఈ ధవళాక్షిం దలఁతున్

సాధుజ నాదరణ శీల సాగర కన్యా

ఖ్యాధిక సచ్చరిత రమా

మాధవ చరణ స్మరణ సమాహిత చిత్తన్  

1.     

 

 

 

ఉ.

సేవిత బంధు సంచయ వశీకర వేంకట రామ యుక్త ల

క్ష్మీవర నామ భూషిత సుకీర్తిత సద్గుణ భక్తి భావ సం

ఘావృత శీల సంతత నిజాత్మ విభూన్నత సక్త చిత్త సం

భావిత నిత్య దాన గుణ భాసిత కోమలి నాదు భార్యే      

2.     

 

 

 

కం.

ద్వ్యక్షర పదక్షయీకృత

కుక్షి క్షేమంకర వర గోత్ర క్షిప్త

త్ర్యక్షర వాచ్య క్షిత్యా

భ క్షాంత మనో రుచి ప్రభావిత సతియే                            

ద్వ్యక్షరపదములు: నాస్తి, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహ మద ఇత్యాది దుర్గుణములు.

త్ర్యక్షర వాచ్యములు: కరుణ, అర్పణ, సంయతి, ప్రశాంతిఇత్యాది సద్గుణములు.

పద విభజనము:

వర గోత్ర క్షిప్త,  ద్వక్షర పద క్షయీకృత, కుక్షి క్షేమంకర, త్ర్యక్షర వాచ్య, క్షితి ఆభ క్షాంత ,మనో రుచి ప్రభావిత సతియే

తాత్పర్యము:

మంచి గోత్రమున నుంచబడిన ( వివాహమైన), అడిగిన లేదనుట, ఈర్ష్య మొదలగు రెండక్షర పదములను నశింప జేసినట్టి, కడుపునకు శుభము కూర్చునట్టి ( మంచి యాహారముతో),  కరుణ మొదలగు మూడక్షరముల వాచ్యములు కలిగినదియు, క్షమయందు భూసమానమైనదియు (మున్నగు సద్గుణములతోటి) మనస్సు యొక్క కాంతి చేత ప్రభావితమైన యట్టి యామె నా భార్యయే.   

3.     

 

 

 

మ.

నను నీ విత్తరి వీడి యొంటరిగ యానం బైతి వేకాంతమే

కన రానట్టి సుదూర తీరములకుం గాంతామణీ న్యాయమే

తనువుల్ ప్రాణము లొక్కటే యనఁగ నిత్యం బెంచి పాటింప నే

రని నిన్నక్కట యేమనంగఁ దగు నా బ్రాహ్మంబ యిట్లుండగన్

4.     

 

 

 

కం.

నిరత మనురక్తిఁ జూపుచు

గురుతర రీతి పతిభక్తి  కురియించుటలో

ధరణిజ సమమౌ లక్ష్మీ

వరనామ పతివ్రతా ప్రవాళంబ ధరన్           

5.     

 

 

 

ఉ.

ఆడదు భర్త మాట కెదు రాడదు నిష్ఠుర భాషణమ్ములం

దోడుగ నుండు బంధులకు దూఱదు వారి నొసంగ నిందలం

బాడిగ నుండు దూరమునఁ  బల్కక యెద్దియు మౌన మూనుచుం

జేడియ లందు మిన్న యనఁ జిత్రమె వేంకట రామ లక్ష్మినిన్     

6.     

 

 

 

చం.

వెలఁదుల మిన్న బంధుజన వృద్ధ జనావళి సుప్రసన్న వె

న్నెలఁ దలపించు మానసము నిండుగ వెల్గెడి ముద్దరాలు తే

నెలఁ గురియించు వాక్యముల నీరజ లోచన నాథు నెప్డు సే

వల నలరించు భామ యని పల్కుదు రెల్లరు రామలక్ష్మినిన్    

7.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి