6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సోమశంకర సోదర సంస్మరణము.

 

 

 

సోమశంకర సోదర సంస్మరణము:

(పోచిరాజు సోమ శంకర రావు)

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)

 

 

 

 

 

మ.

తనరారన్నను సోమశంకరుఁడ! కందర్పాంగ! చిన్నన్నయా

యనుచుం  నిత్యము పిల్చుచున్ వినయ మేపారంగ నో దమ్ముఁడా

యనురాగమ్మును గౌరవాదరము లత్యంతమ్ము చూపించితే

కనరాకుండెడి సీమ కేఁగితి వహో కైలాస వాసార్థమై  

1.     

 

 

 

మ.

హర చింతా వర తత్పరుండ వయి కృష్ణానంద భక్తుండవై

యరవిందాక్ష పదాబ్జ యుగ్మ నత శీర్షారాధ నోద్యోగివై

చిర సంసేవిత మాతృపాద పద్మ యుగ సంక్షిప్తైక చిత్తుండవై

పర లోకాంచిత ధామ రత్న పరమ ప్రాప్తుండవై నిల్చితే   

2.     

 

 

 

ఉ.

పెద్దలఁ గాంచి నంతఁ దగఁ బేరిమి తోడుతఁ బల్కరించుచున్

విద్దెల నింక బుద్దులను బ్రీతిని నేర్పుచు శిష్య కోటికిన్

సుద్దుల నింపి తేనియలు, చుట్టములం గడు గౌరవించుచుం

గ్రద్దన నెట్టితే బ్రతుకు రమ్య తరమ్ముగ సోమ శంకరా  

3.     

 

 

 

ఉ.

రక్ష నొసంగి బిడ్డలకు రాని విధమ్మున నెట్టి లోటునున్

దీక్ష వహించి నెమ్మదిని దేవ చయమ్మును గాంచి భక్తిమైఁ

గక్షల జోలి కేఁగకయుఁ గార్యము లెల్లను జక్కఁ బెట్టి యీ

శిక్ష నొసంగి దార కిలఁ జేరితె గమ్యము సోమ శంకరా 

4.     

 

 

 

 

                                                             


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి