27, ఫిబ్రవరి 2023, సోమవారం

Simha Vahinii Maahaatmyamu_సింహవాహినీ మాహాత్మ్యము

సింహవాహినీ మాహాత్మ్యము
(భాగ్య నగరములో వెలసిన లాల్ దర్వాజా మహాకాళి)
 
 

 

ఉ.

ఎఱ్ఱని పట్టు చీర కడు నెఱ్ఱని కన్నుల రాల నిప్పులే
బిఱ్ఱగు శూల మెత్తి వడి వెఱ్ఱిని దుండగు దున్న రక్కసున్
గిఱ్ఱున ద్రిప్పి పట్టి తల కిఱ్ఱు మనంగను సింహరాజమే
గుఱ్ఱము కాఁగ జంపి తట ఘోరముగాఁ ద్రుటి సింహవాహినీ 

1.      

 

 

 

ఉ.

ఈశ్వరు నర్ధ దేహమున నింపుగ నుండుచు వెండి యమ్మరో

శాశ్వత రక్ష నీయ సుర సన్నుత మాతరొ భక్త కోటికిన్

విశ్వము నందు భాగ్య పురి వీధుల నింపుగ భారతమ్ములో

నీశ్వరి! వాస మయ్యె నిట నెఱ్ఱని గుమ్మము సింహవాహినీ

2.     

 

 

 

ఉ.

తల్లి  వటంచు సంతతము ధారుణి నెల్లరు భక్తిఁ గొల్తురే

యుల్లము నుంచి నీ పయి మహోగ్రపు భీకర రూప మేలనో

యెల్లరు దల్లడిల్ల మది నిందు నిభానన చూపు మింక నీ

చల్లని శాంత రూపమును జక్కఁగ మాకిల సింహవాహినీ

3.     

 

 

 

ఉ.

భాగ్యపురంపు భాగ్య మది పల్కఁగ నేరికి శక్య మౌను సౌ

భాగ్యము లీయఁ గాంతలకుఁ బన్నుగ మంగళదాత్రి గౌరియే

యోగ్యపు ధామ మెంచి వరయోగముఁ గూర్ప జనాలి కెల్ల నా                      

రోగ్యము నిచ్చి నిల్వఁగ సరోరుహలోచన సింహవాహినీ

4.     

 

 

 

ఉ.

దుర్గయు భద్రకాళి యన దుర్జన కోటి వడంకు నిత్యమున్

భార్గవి నామకీర్తనము పంచును మోదము నిర్జరాలికిన్

వర్గము లెంచ కీ నరులు పన్నుగఁ గొల్తురు భక్తి యుక్తులై

దుర్గతు లాపు దీవు కృపఁ దోరము వేఁడఁగ సింహవాహినీ

5.     

 

 

 

ఉ.

బోనము లిచ్చు పండుగగఁ బొల్తుక లందఱు సేరి కొల్వఁగా

గానము లెల్లఁ బాడుచును గాంతలు మోయ ఘటమ్ము లింపుగం

బూనిన పోతరాజుఁ గని మోహ వశమ్మునఁ జేయ నృత్యముల్

మానిను లెల్లఁ దుష్టి వయి మమ్మిలఁ గాతువు సింహవాహినీ

6.     

 

 

 

ఉ.

సత్త్వ గుణ ప్రధానవు నిజమ్ముగ నేరక చిత్త మందు నీ

తత్త్వము  రాజసమ్మని వితండపు వాదన లాడ వింత యం

ధత్వమ యెంచఁగా గుణ వితానము  నిన్ను  స్పృశింప నౌనె మూ

ర్ఖత్వము గాంచి పాపుదు సుఖమ్ముగ నమ్మరొ సింహవాహినీ

7.     

 

 

 

కవిరాజ విరాజితము

దశదిశ లెల్లను దద్దరిలంగను ధారుణి మ్రోగును ద్వన్నుతులే

పశుపతి పార్శ్వము పార్వతి వొందితి పన్నుగఁ బ్రోవఁగ భక్తులనే

శశిధరు తోడను జల్పఁగఁ బూజలు సక్కఁగఁ గాతువు శాంతముతో

శిశువుల మమ్ములఁ జెన్నుగ  గావుమ సేరి భజింపఁగ సింహగవై

8.     

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి