8, ఫిబ్రవరి 2023, బుధవారం

1. ఛందో దర్పణ పద్య లక్షణ లక్ష్య రత్నావళి.

శత కవికృత శతవిధ చ్ఛందో రీతి దశ సహస్ర వైవిధ్య భరిత పద్య సంకలన సారస్వత మహా యజ్ఞము.

శత పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.

 

 

 

 

1. రామాయ ణాంశము.

శ్రీ రామచంద్రుని సద్గుణావళి వర్ణనము.

 

 

శ్రీ రాముని రాజ్యార్హ గుణ గణములను బౌరులు దశరథుఁ డడుగ వచించుట.

 

 

 

 

శ్రీ.

ఛందము: ఉక్త.

గణము: గ

ప్రాస: లేదు; యతి: లేదు

శ్రీ

రా

మా

ఖ్యున్

1.      

 

 

 

(నూతనము)     రమ.

ఛందము: అత్యుక్త.

గణము: లల

ప్రాస: కలదు; యతి: లేదు

రణ

గుణ

గణ

మణి

2.     

 

 

 

స్త్రీ.

ఛందము: అత్యుక్త.

గణము: గగ

ప్రాస: కలదు; యతి: లేదు

ఏలా

కేలీ

లీలన్

బాలున్

3.     

 

 

 

వినయము.

ఛందము: మధ్య.

గణము: స

ప్రాస: కలదు; యతి: లేదు

పతిగా

మతిలో

రతి నూ

నితిరే

4.     

 

 

 

మృగీ.

ఛందము: మధ్య.

గణము: ర

ప్రాస: కలదు; యతి: లేదు

చెప్పుఁడీ

యొప్పుగా

నిప్పుడా

గొప్పలన్

5.     

 

 

 

లలిత-2.

ఛందము: ప్రతిష్ఠ.

గణములు: న ల

ప్రాస: కలదు; యతి: లేదు

నరప ద

శరథుఁడు

పుర జన

వరులను

6.     

 

 

 

(నూతనము) పంచముఖ.

ఛందము: సుప్రతిష్ఠ.

గణములు: న గల

ప్రాస: కలదు; యతి: లేదు

అడుగ నిట్లు

నుడివి రంతఁ

గడఁక వారు

నుడువు లిట్లు

7.     

 

 

 

47. గుణవతి.

ఛందము: గాయత్రి.

గణములు: న మ

ప్రాస: కలదు; యతి: లేదు

పలుకు రాముం డీ

యిలను సత్యమ్మున్

నిలుపు ధర్మమ్ముం

గొలుచు గుర్వాలిన్

8.     

 

 

 

131. మధుమతి.

ఛందము: ఉష్ణిక్కు.

గణములు: న న గ

ప్రాస: కలదు; యతి: లేదు

హరియె గుణములన్

గురుఁడె తెలివినిన్

హరుఁడు ధనువునన్

ధరణిని శశియే   

9.     

 

 

 

3. అచలము.

ఛందము: అనుష్టుప్పు.

గణములు: న న లల

ప్రాస: కలదు; యతి: లేదు

కనఁ డెపు డిడుగడ

మన మగును మృదువు

జనుల కవనుఁ డగు

ఘనుఁడు గుణ తతుల

10.   

 

 

 

34. కుసుమ.

ఛందము: బృహతి.

గణములు: న ర ర

ప్రాస: కలదు; యతి: లేదు

అవశుఁ డింద్రియశ్రేణికిన్  

భువిఁ గృతజ్ఞుఁడై వర్తిలున్

నృవర! శీలవంతుండు దా

సువచనుండు క్షాంతాత్ముఁడే   

11.    

 

 

 

81. పంక్తి-2.

ఛందము: పంక్తి.

గణములు: భ భ భ గ

ప్రాస: కలదు; యతి: 7

దీన జనావన ధీరుఁ డిలన్

మానసమౌ సుకుమార మికం

దా నగ తుల్యుఁడు ధైర్యమునం

దా నిపుణుం డగు ధన్వి ధరన్

12.   

 

 

 

196. స్వాగతము.

ఛందము: త్రిష్టుప్పు.

గణములు: ర న భ గగ

ప్రాస: కలదు; యతి: 7

భూత రాశి కిడు మోదము విప్ర

వ్రాతమున్ బుధులఁ బన్నుగఁ గొల్చుం

బ్రీతినిం జదివె వేదము లెల్లన్

వీత శాత్రవుఁడు వీర వరుండున్       

13.   

 

 

 

157. వంశస్థము.

ఛందము: జగతి

గణములు: జ త జ ర

ప్రాస: కలదు; యతి: 8

ఘనుండు సత్కీర్తినిఁ గాంతులం దిలన్

ఘనుండు శస్త్రాస్త్ర నికాయ వేత్తలన్

ఘనుండు ధర్మార్థ సుకామ సిద్ధినిన్

ఘనుండు యుద్ధావనిఁ గార్య సిద్ధులన్

14.   

 

 

 

153. రుచిరము.

ఛందము: అతిజగతి

గణములు: జ భ స జ గ

ప్రాస: కలదు; యతి: 9

నృపా! జనావళి ధరణిన్ భృశమ్ముగా 

విపత్తు లందు మునుఁగ వేద నాత్ముఁడౌ

సు పర్వ రాశి మురిసి చూచుఁ దండ్రి నాఁ

గృపా మనస్కుఁ డయి సుఖింపఁ బౌరులే 

15.   

 

 

 

163. వసంత తిలకము.

ఛందము: శక్వరి

గణములు: త భ జ జ గగ

ప్రాస: కలదు; యతి: 8

తా నోర్మి ముందు నిరతమ్మును బల్కరించుం

దా నెన్నఁ డేని మదిఁ దల్పఁడు సంగరమ్ముం

దా నిచ్చు శ్రేయములు ధాత్రి జనాలి కెల్లం

దా నుండు శ్రేష్ఠునిగఁ దర్కములో ధరిత్రిన్    

16.   

 

 

 

119. మణిభూషణము.

ఛందము: అతిశక్వరి

గణములు: ర న భ భ ర

ప్రాస: కలదు; యతి: 10

పాటవం బధిక మున్నది పౌరుల నేలఁగా

మేటి రాగముల కుర్విని మీఱఁడు ధర్మమున్

సాటి లే రితని కెందును శక్తిని నెన్నఁగా

మేటి యేలఁ ద్రిజగమ్ములు మేదిని వింతయే 

17.   

 

 

 

147. మేదిని.

ఛందము: అష్టి

గణములు: న జ భ జ ర గ

ప్రాస: కలదు; యతి: 11

కృపయును గ్రోధ మేని పరికింపఁ గావు రిత్తల్

నృపవర! చంపఁగాఁ దగిన నిర్గుణున్ వధించుం

గపట విహీనుఁ డైన నరుఁ గారఁ బెట్టఁ డెప్డున్ 

విపులముగా ధనం బొసఁగుఁ బ్రీతుఁడై చెలంగన్        

18.   

 

 

 

156. వంశపత్రపతితము.

ఛందము: అత్యష్టి

భ ర న భ న లగ

ప్రాస: కలదు; యతి: 11

రాముని బాగు నాయువును వీర్యము నుపచితినిం

బ్రేమగఁ గోరు కొంద్రు మది భూరి సుర నిచయముల్

సామర లోక గాయనులు నిత్యమును బురులఁ బౌ

రామల చిత్త జానపదు లే యవని నయిననున్    

19.   

 

 

 

64. తరలి.

ఛందము: ధృతి

భ స న జ న ర.

ప్రాస: కలదు; యతి: 11

దేవ నిభుఁడు నీ తనయుఁడు దేవ! జన హితుం డిలన్ 

దేవతలకు మ్రొక్కుదు రిల స్త్రీలు తవ సుతార్థమై 

యౌవనుని నరేంద్రునిగ మహాత్ముని నొనరింపుమా

భూవరుఁడ! యుదారుఁ గృపను ముచ్చట నిఁక రామునిన్          

20.   

 

 

 

2. భారతాంశము.

 

 

పూరు వంశ వర్ణనము.

 

 

 

 

194. సురభూజరాజము.

ఛందము: ప్రకృతి

న భ ర న న న ర.

ప్రాస: కలదు; యతి: 12

అదితి కశ్యపు సూనుఁడా రవి యగు మను వతని కాత్మజుం

డు దిన నాథున కిద్ధరన్ వినుఁడు సుత యతనికి నా యిలా  

సుదతి భర్త బుధుండు వారికి సుతుఁడు ఘనుఁడు పురూరవుం

డె దయితా మణి యూర్వసీసతి యెలమి సుతుఁ డగు నాయువే 

1.  

 

 

 

103. (భద్రిణి) భద్రకము-3.

ఛందము: ఆకృతి

భ ర న ర న ర న గ.

ప్రాస: కలదు; యతి: 12

ఆయువు స్వర్గభానవినిఁ బెండ్లియాడి కనెఁ బుత్రు నా నహుషు న

య్యాయత బాహు దర్పునకు నయ్యయాతి సుతుఁ డయ్యె నాతనికిఁ దా

నీయఁగ దేవయాని సుత శుక్రుఁడే యదువు తుర్వసుల్ తనయులై

తోయజ లోచనుల్ సెలఁగి రంతఁ ద్రుహ్యుఁ డను వింకఁ బూరు లనఁగా   

[స్వర్గభానవి = స్వర్భానవి]

2.     

 

 

 

138. మహాప్రస్థము.

ఛందము: వికృతి

స త త న స ర ర గగ.

ప్రాస: కలదు; యతి: 9,16

తనరన్ శర్మిష్ఠ నా కాంత తనదు సతి కాఁ దద్ద ప్రీతిం గనెన్ రాన్నం

దనులం గౌసల్య నా కాంతను గొని సతిగా ధర్ముఁడా  బూరుఁ డింపారన్ 

జనమే శబ్దమ్ము తోడన్ జయుఁ డనఁగ సుతుం జక్కఁ గాంచెన్ మహా వీర్యుం  

దనకుం బ్రాచీశుఁ డయ్యెం దనయుఁ డిల ననంతా సతీ రత్నముం బొందన్ 

[జనమేజయుఁడు, ప్రాచీశుఁడు లేక ప్రాచిన్వంతుఁడు]

3.     

 

 

 

183. సరసిజము.

ఛందము: సంకృతి

మ త య న న న న స.

ప్రాస కలదు; యతి 10,18

ప్రాచిన్వంతుం డశ్మకి నా దారను బడయఁ బ్రియ తర రమణి వ్రతముల్

నోచంగా సంయాతి జనించెన్ నుత యశుఁడు ధర ఘనుఁడు గుణములలో

నా చిద్రూపుం డంత వరాంగ్యాఖ్యను సతిగఁ బడసి యనుఁగు సుతుఁ గనెం

బ్రాచుర్యాహంయాతిని  సత్పుత్ర వరు సకల గుణ రమణు సుర నిభున్  

[అహంయాతి]

4.     

 

 

 

49. చంద్రకళ.

ఛందము: అతిధృతి

ర స స త జ జ గ.

ప్రాస కలదు; యతి 11

భామ భానుమతీ సతితో భూపాలుఁడు నందను సార్వభౌ

మామ లాఖ్యునిఁ గాంచె జయత్సే నాభిద పుత్రుడు వానికిం

జామయైన సునందకుఁ గల్గెం జక్కఁగ సుశ్రవసా సతీ

నామ కాంతకు వాని కవాచీనప్రవరుం డుదయింపఁగా  

[అవాచీనుఁడు]

5.     

 

 

 

107భుజంగవిజృంభితము.

ఛందము: ఉత్కృతి

మ మ త న న న ర స వ.

ప్రాస కలదు; యతి 9,19

నోరారన్ మర్యా దావాచీనులకు నరిహుఁడ యనఁ దనూజుఁ డింపుగఁ బుట్టె నా

వీరుం డాంగీ నామంబే యుర్విఁ జెలఁగు సతినిఁ బడసి వీర సూను ఘనున్ మహా

పూరంబై రమ్యంబౌ  యా భౌముఁ డను పదము వెలిఁగెడు పుత్రుఁ గాంచెను బేర్మినిన్ 

నారీ రత్నంబౌ యా ప్రాసేనజితి తనరఁగ సతి యనన్ సుపుష్టయె వానికిన్   

[మహాభౌముఁడు]     

6.     

 

 

 

105. భాస్కరవిలసితము.

ఛందము: అభికృతి

భ న జ య భ న న స గ.

ప్రాస కలదు; యతి 13

కోమలికిఁ బుడమి నయ్యయుతానీకుండు తనయ వరుఁడు జనన మందెం

దామరస నయన కామకు నక్రోధప్రవరుఁ డతని సతికి జనించెన్   

భీమబలుఁ డగు సురాతిథి భాస్వద్వీరుఁ డతనికిఁ దనయుఁడు కరంభా

నామ సతి జనని కాఁగఁ దదుర్వీ నాథునకుఁ గలిగెను దనయుఁ డంతన్  

[అక్రోధప్రవరుఁడు = అక్రోధనుఁడు; సురాతిథి = దేవాతిథి]     

7.     

 

 

 

38. కోవిదారము.

ఛందము: కృతి

భ త ర త స జ లగ.

ప్రాస కలదు; యతి 10

ధీరవరుం డైన యట్టి యా దేవాతిథి కిలన్ ఋచీకుఁ డనం 

గూరిమి మర్యాద కింపుగాఁ గొడ్కయ్యెను ఋచీక పార్థునకున్ 

దార సుదే వాఖ్యకున్ మహా ధర్ముం డయిన ఋక్షుఁ డయ్యె సుతుం

డా రణ సింహుండు జ్వాల నా నర్థాంగి మతినారుఁ గాంచి రిలన్     

8.     

 

 

 

133. మధ్యాక్కర.

అక్కర:

2 ఇం 1 సూ 2 ఇం 1 సూ.

ప్రాస కలదు; యతి 4 మొదటి

మతినారునకు సరస్వతికి మఱి త్రసుం డుదయించెఁ ద్రసున 

కతివ కాళిందికి నిలినుఁ డను పుత్ర రత్నము వుట్టె

సతి రథంతరి యం దతండు సద్గుణు దుష్యంతుఁ బడసె

రతి శకుంతల యం దతండు రారాజు భరతునిఁ గనెను

9.     

 

 

 

132. మధురాక్కర.

అక్కర:

1 సూ 3 ఇం 1 చం.

ప్రాస కలదు; యతి 4 మొదటి

భరతునకు సునందా సతి భార్య కాఁగ భుమన్యుఁడు

వర సుతుఁడు వుట్టె నతనికి భార్య విజయకుఁ గల్గె

ధర సుహోత్రుఁ డాతనికి సుదతి సువర్ణకును హస్తి

ధరకు ధవుఁడు హస్తికి యశోధరకు  వికుంఠనుఁడు

10.   

 

 

 

2. అంతరాక్కర.

అక్కర:

1 సూ 2 ఇం 1 చం 

ప్రాస కలదు; యతి 3 చివరి

ఆ వికుంఠనునకు భార్య   వసుదేవకు

నా వ రాజమీఢుఁ డను నాత్మజుఁడు వుట్టె

ధీ వరుఁడు సంవరణుఁడు దిట్ట శతాధికు

లై వఱలు నజామీఢు నాత్మజుల లోన     

11.    

 

 

 

              16. ఉత్సాహము.

జాతి:

7 సూ 1 గ

ప్రాస కలదు; యతి 5 మొదటి

సంవరణునకుఁ దపతికిని సంభవించెఁ గురుఁడె యా  

సంవరణజునకు శుభాంగి సతి విదూరథుఁ డనఁగన్ 

సంవిదుఁడు జనించె సుతుఁడు సంప్రియకు నితనికి నా

సంవనన ముఖుం డనశ్వ సంజ్ఞుఁడు సుతుఁడు కలిగెన్

[అనశ్వుఁడు]

12.   

 

 

 

6. అల్పాక్కర.

అక్కర:

 2 ఇం 1 చం

ప్రాస కలదు; యతి 3 మొదటి

అయ్యనశ్వునకు నర్ధాంగి యైన

యయ్యమృతకుఁ బ్రీతి నాత్మోద్భవుఁ

డయ్యెఁ బరీక్షితుఁ డతని సుతుం

డయ్యెను భీమసే నాహ్వయుఁడు

13.   

 

 

 

85. పద్మనాభము.

ఛందము: వికృతి

త త త త త త త గగ

ప్రాస కలదు; యతి   13

వీరుండు నా భీమ సేనాఖ్యు పుత్రుండు ప్రీతిం బ్రదీపుండు నవ్వాని పుత్రుం

డా రాజ నామప్రతీపుండు దేవాపి యా శంతనుం డింక నా బాహ్లికుండున్ 

వా రా ధరా నాథు పుత్రత్రయం బయ్యెఁ బార్థుండుగా శంతనుం డయ్యె ధాత్రిన్ 

వీరుండునై శంత నాత్మోద్భవుం డయ్యె భీష్ముండు గాంగేయ దేవవ్రతుండే    

14.   

 

 

 

139. మహాక్కర.

అక్కర:

1 సూ  5 ఇం 1 చం

ప్రాస కలదు; యతి 5 మొదటి 

శంతనునకు సత్యవతి యందు సుతులు జనియించి రిద్దఱు చిత్రాంగదుఁ

డంత ఘనుఁడు  విచిత్రవీర్యుఁ డనంగ హతుఁ డయ్యె జ్యేష్ఠుఁడు క్షయ రోగియై 

యింతు లిద్ద ఱంబికయు నంబాలిక లెలమి భార్యలయి రవరజునకు    

సంతు లేక దివంగతుఁ డయిన వ్యాస మహర్షి దేవర న్యాయమున     

15.   

 

 

 

62. తన్వి.

ఛందము: సంకృతి

భ త న  స భ భ న య.

ప్రాస కలదు; యతి 13

మాతయు నైనట్టి గుణవతియు నౌ మానిని సత్యవతి యిడఁగ నాజ్ఞన్

భ్రాత నిజక్షేత్ర మయిన సతి యబ్భామకు నంబిక కిడె ధృతరాష్ట్రున్

వీత రిపువ్రాతుఁడు తనయుని నా వీరునిఁ బాండు నృవరుని నొసంగెన్ 

నాతికి నంబాలికకు విదురునిన్ నారికి నంబిక వరవున కంతన్          

16.   

 

 

 

149. మోహప్రలాపము.

ఛందము: అతిజగతి

భ భ త ర గ.

ప్రాస కలదు; యతి 5

ధీరుఁడు నా ధృత రాష్ట్రాఖ్యుఁ డంత గాంధా

రీ రమకున్ నృప దుర్యోధ నాది పుత్రుల్ 

దారకు మోదమునన్ నూర్వురం గనిష్ఠం  

బేరిమిఁ బృథ్విఁ గనెన్ దుశ్శ లాఖ్య నంతన్   

17.   

 

 

 

79. నారాచ.

ఛందము: అనుష్టుప్పు

త ర లగ.

ప్రాస కలదు; యతి లేదు

దుర్యోధ నానుజుండు నై

వీర్యుండు నా యుయుత్సుఁడే

భార్యాంతరమ్ము వైశ్యకుం 

గార్యోన్ముఖుండు వుట్టఁగా 

18.   

 

 

 

108. భూతిలకము.

ఛందము: అతిధృతి

భ భ ర స జ జ గ.

ప్రాస కలదు; యతి 12

కుంతియు మాద్రియుఁ బాండు రాజునకున్ సతీ మణు లై రిలన్ 

సంతతి నందెను బాండు వా యమ శార శక్ర వరాశ్వినుల్

కాంతల కీయ వరమ్ము లింపుగఁ గ్రన్ననన్ ఘను లైన ధీ

మంతు యుధిష్ఠురు భీము నర్జును మాద్రి నందనులన్ ధరన్

19.   

 

 

 

198. హరిణి.

ఛందము: అత్యష్టి

న స మ ర స లగ.

ప్రాస కలదు; యతి 12

నకుల సహదేవుల్ మాద్రీ వీర నందను లై రిలం

బ్రకటితమ యేవుర్ భర్తల్ వెల్గ ద్రౌపది పత్ని వా

రికి శివుఁడు శాసింపం గాంతన్ లలిన్ సుతు లేవు రై

రి కరుణ సుభద్రా దేవీ తత్కిరీటి కుమారుఁ డ

ప్డు కులమున కుద్ధారుం డయ్యెన్ విభుం డభిమన్యుఁడే   

20.   

 

 

 

3. భాగవ తాంశము.

వాసుదేవ ప్రవర వర్ణనము. 

 

 

 

1. అంబురుహము.

ఛందము: కృతి

భ భ భ భ ర స లగ.

ప్రాస కలదు; యతి 13

భూవరుఁ డైన యయాతికి జ్యేష్ఠ సుపుత్రుఁడే యదు విద్ధరన్

ధీ వరుఁ డైన సహస్రజితుండును దిట్ట క్రోష్టువు పిమ్మటం 

బావనుఁ డౌ నలుడున్ రిపు నాముఁడు  పార్థ వేంద్రు కుమారులై 

యీ వసుధం దనరంగ భృశమ్ముగ నింకఁ గ్రోష్టున కింపుగా 

1.  

 

 

 

63. తరళము.

ఛందము: అతిధృతి

న భ ర స జ జ గ.

ప్రాస కలదు; యతి 12

వృజినవంతుడు బుత్రుఁ డయ్యెను వీరుఁ డాతని పుత్రుఁ డ

య్యె జన వంద్యుఁడు శ్వాహితుండు నహీన విక్రమ వంతుఁడే 

సుజన పూజిత భేరుశేకుఁడు శూరుఁ డాతని సూనుఁ డ

య్యె జగతిన్ సుతుఁడయ్యె నీతని కింకఁ జిత్రరథుం డహో

2.     

 

 

 

8. అశ్వలలితము .

ఛందము: వికృతి

న జ భ జ భ జ భ లగ.

ప్రాస కలదు; యతి 13

నృవరుఁడు గాంచెఁ జిత్రరథుఁ డంత నెమ్మి శశిబిందునిం దనయునిన్

భువిఁ బదివేల భార్యల నతండు వొందెఁ బది వేల లక్షలు సుతుల్ 

నృవరుఁడు వారి యందు ఘనుఁడౌ గణింపఁగ భృశమ్ము ధర్ముఁడ యతం

డు వడసె నంత నా యుశనునిం బటుత్వమున దిట్ట నందను నిలన్     

3.     

 

 

 

126. మత్తహంసిని.

ఛందము: అతిజగతి

జ త స జ గ.

ప్రాస కలదు; యతి 7

రురూన్న తాక్షుండు రుచకుండు వానికిం 

బురిన్ సుతుం డయ్యెఁ బురుజిత్తు రుక్ముఁడున్

నృ రాజ రుక్మేషు పృథు లింక  జ్యాముఖుం

డరిఘ్నులై పుట్టి రట వీని కేవురున్    

4.     

 

 

 

130. మద్రకము.

ఛందము: ఆకృతి

భ ర న ర స స న గ.

ప్రాస కలదు; యతి 11

జ్యాముఖ నందనుండు ధర సజ్జనుండు  విదర్భుఁడు వానికి సుతుం

డా మహి మాన్వితుండు ఘన వీర్యవంత కృథుం డగుఁ గుంతి తనయుం

డౌ మహి వాని కీతనికి భవ్య పుత్రుఁడు ధృష్టియె నిర్వృతి యహో    

భీమ కుమారుఁ డాతనికిఁ బృథ్వియందు దశార్హుఁడు వీని సుతుఁడే  

5.     

 

 

 

140.మహా స్రగ్ధర.

ఛందము: ఆకృతి

స త త న స ర ర గ.

ప్రాస కలదు; యతి 9,16

ఘనుఁడౌ వ్యోమాఖ్యుఁ డౌ యంగజ వరు ధరణిం గాంచెఁ దా నద్దశార్హుం

డనఘున్ జీమూతునిన్ వీర్య తనయుఁ గనె విఖ్యాతుఁ డా వ్యోముఁడే నె

మ్మిని జీమూతుం డిలం బేర్మి వికృతినిఁ గనెన్ మేదినీ నాథుఁనిం దాఁ

గనె భీమస్యంద నాఖ్యున్ ఘన తనయుని సౌఖ్యంబ యేపార ధాత్రిన్    

[భీమస్యందనుఁడు = భీమరథుఁడు]

6.     

 

 

 

154. లక్ష్మీవృత్తము.

ఛందము: ఆకృతి

న య స భ న న స గ.

ప్రాస కలదు; యతి 13

నవరథుఁ డబ్భీమరథ ప్రాజ్ఞ తనయుఁడు దశరథుడు పుత్రుం

డు వసుధ నవ్వానికిఁ గా నందనుఁడు శకుని యితనికి నయ్యెన్

భువి నరయం గుంతి సుతుం డయ్యెను మురియ శకునికి ఘనుండై

ఛవి సురరాతుం డితఁ డౌ కుంతికి సదమల తనయుఁడు బ్రీతిన్    

[సురరాతుఁడు = దేవరాతుఁడు]

7.     

 

 

 

53. చంద్రశ్రీ.

ఛందము: అష్టి

య మ న స ర గ.

ప్రాస కలదు; యతి 12

కుమారున్ దేవక్షత్రు గుణ ధనికున్ దేవరాతుం

డు మర్త్యాధీశుం డంతఁ గనె మధుఁడుం బుట్టె సూనుం

డమేయుండై  రాబిడ్డకుఁ గురువ శాఖ్యుండు పుత్రుం

డమిత్రఘ్నుండై వానికిఁ గలిగె నంతన్ ధరిత్రిన్   

8.     

 

 

 

199. హరిహయము .

ఛందము: అష్టి

న స న భ న గ.

ప్రాస కలదు; యతి 10

కురువశున కా యనువు కొడ్కగు ననున  కా

యురు బలసుతుండు పురుహోత్రుఁ డతనికి నం

శు రుచిర త రాఖ్యుఁ డగు సూనుఁ డతనికి నా

వర సుతుఁడు సాత్త్వతుఁడు వంద్యుఁ డిలఁ గలిగెన్   

[అంశు రుచిరత రాఖ్యుఁడు = అంశువు]

9.     

 

 

 

43. ఖచరప్లుతము.

ఛందము: కృతి

న భ భ మ స స లగ.

ప్రాస కలదు; యతి 12

తనయు లేడ్వురు వాని కహో నంతన్  భజమాన భుజుల్ ధ రా 

వనులు దివ్యుఁడు వృష్టి యనన్  దేవాపృథు లింక  బలాడ్యు లా 

యనఘుఁ డంధకుఁ డింక మహాభోజాఖ్యుఁ డనన్ మఱి వారిలో   

ననల సన్నిభుఁ  డంధకు సుప్రీ తాత్మజుఁడున్ భజమానుఁడే  

10.   

 

                                                                    

 

56. చంపకేశరి.

ఛందము: అత్యష్టి

స జ స స స లగ.

ప్రాస కలదు; యతి 9

భజమానుఁ డారసెను బట్టి విడూరథునిన్ ఘనున్ 

నిజ సూనుఁ డయ్యె శిని నెమ్మిని వానికి భోజుఁ డ

య్యె జనాధిపుండు సుతుఁ డింపుగ వీనికిఁ బుత్రుఁ డ

య్యె జగమ్ము నందు ఘనుఁడీ హృదికుం డన వీనికిన్     

11.    

 

 

 

120. మణిమాల-2.

ఛందము: ప్రకృతి

స జ స జ స జ స.

ప్రాస కలదు; యతి 11

హృదికుండు మువ్వురను గాంచె నింపుగఁ గుమారులన్  సుగుణులన్ 

సదయుండు శూరుఁడు ఘనుండు సద్యశుఁడు కా శతాస్త్రుఁ డనఁగా 

నుదయించె నంతఁ గనెఁ బ్రీతి నుర్విఁ గృతవర్మ నాఁ దనయునిన్  

సదసద్విదుల్ యదు కులాబ్ధి చంద్రులు ధరిత్రి మువ్వురు సుతుల్  

[శతాస్త్రుఁడు = శతధనువు]                    

12.   

 

 

 

40. క్రౌంచపదము.

ఛందము: సంకృతి

భ మ స భ న న న య.

ప్రాస కలదు; యతి 11, 19

శూరున కింపారన్ వసుదేవస్తుతమతి సుగుణుఁడు సుతుఁడు జనించెన్

ధీరుఁడు జ్యేష్ఠుండై యనుజుల్ ప్రీతి నతని కిల సుగతినిఁ దగఁ దొమ్మం

డ్రైరి బృథా కన్యా మణియే యాయమ యనుజలఁ దొలి యతివగ  నేవుర్

కూరిమి పెంపొందన్ వసుదేవాఖ్యున కనుజ లయిరి గుణవతు లెల్లన్   

13.   

 

 

 

32. కవిరాజవిరాజితము.

ఛందము: వికృతి

న జ జ జ జ జ జ లగ.

ప్రాస కలదు;యతి 8,14,20

ఘనుఁ డగు దేవకు కన్యల నేడ్వురఁ గాంతలు గాఁ గొని క్రన్ననఁ నా

జన నుతుఁ డంత వెసన్ వసుదేవుఁడు చక్కఁగ దేవకి సత్సతికిన్ 

ఘన సుతు నష్టమ గర్భమునం దిలఁ గాంచెను గృష్ణునిఁ గంస రిపుం

దనయ సుభద్రను దామర సాక్షినిఁ దద్దయుఁ బ్రీతినిఁ దాఁ గనియెన్   

14.   

 

 

 

45. గజవిలసితము.

ఛందము: అష్టి

భ ర న న న గ.

ప్రాస కలదు; యతి 8

ఆ వసు దేవుఁ డంత నతి బలుఁ డగు బలునిన్

దేవికి రోహిణీ సతికిఁ గనెను గదునితోఁ

బావను లేడ్వురం బ్రవరుల సుతుల మఱియుం

దా వర దార లందుఁ దనయులను బలువురన్  

[ప్రవరుల = ముఖ్యులను]           

15.   

 

 

 

30. కవికంఠభూషణము.

ఛందము: అతిధృతి

స జ స స స జ గ.

ప్రాస కలదు; యతి 9

బల రామకృష్ణులకు బాల్యము నందుని గొల్లపల్లిలో

విలసిల్లె నింపుగను బ్రేమ యశోద కురింప మాతయై 

వెలయించి రిద్దఱును వింతలు పెక్కు లమానుషమ్ములన్                                                                                    

ఖలు మామఁ గంసుని సుఖస్థితిఁ జంపెను గృష్ణుఁ డిద్ధరన్              

16.   

 

 

 

195. సురభూరుహము.

ఛందము: ఉత్కృతి

న న త న భ స స న లగ.

ప్రాస కలదు; యతి 8,14,21

నుత యశుఁ డగు కృష్ణుండు సుగుణ సన్నుత యగు రుక్మిణి నూత్నశశి  ముఖిన్

సతి తరుణియు నా జాంబవతిని లక్షణ యను కాంతను సత్య యను సతి

న్రత సుదతిని నా నాగ్నజితిని భద్రను రవి కన్య ఘనప్రతి సతినే     

యతి గుణవతి విందానుజఁ దన భార్యలుగ మహా మహితాత్ముఁడు గొనియెన్ 

[రవి కన్య = కాళింది; విందానుజ = మిత్రవింద]

17.   

 

 

 

159. వనమయూరము.

ఛందము: శక్వరి

భ జ స న గగ.

ప్రాస కలదు; యతి 9

మీఱిన బలున్ నరకు మించి నఱకంగం

వేఱె పదియాఱు మఱి వేలు సతు లెల్లం          

గాఱియలు తీర నిజ కాంత లయి రంతం  

జూఱఁ గొన నాత్మ మధుసూదనున కెల్లర్      

18.   

 

 

 

116. మందాక్రాంతము.

ఛందము: అత్యష్టి

మ భ న త త గగ.

ప్రాస కలదు; యతి 11

దైవంబౌ కృష్ణుఁ డల దశ పుత్ర క్రమం బౌచుఁ గాంచెన్ 

దేవీ వ్రాతమ్మునకు సుతులన్  ధీరుఁ డొక్కొక్క రందున్  

దేవీ వైదర్భి తనయుఁ గనెన్ దిట్టఁ బ్రద్యుమ్ను నా వీ

రావేశుం డంతఁ గనె ననిరుద్ధాఖ్యు నింపారఁ బుత్రున్

19.   

 

 

 

176. శివశంకర.

ఛందము: ధృతి

స న జ న భ స.

ప్రాస కలదు; యతి 11

వసుదేవ తనయు నందభవన దీపకు  ఘన వ

ర్ణ సుగాత్రు వనరుహాక్షుఁ బరమ భక్తజన విధే

యు సరోజ వదను నిత్యజయు సుగీత వరదు కృ

ష్ణు సనాతను విభునిన్ సుగుణు జగద్గురుఁ గొలుతున్  

20.   

 

 

 

4. సామాజికాంశము 1.

కీటకోపాఖ్యానము.

 

 

 

172. శార్దూలవిక్రీడితము.

ఛందము: అతిధృతి

మ స జ స త త గ.

ప్రాస కలదు; యతి 13

భూగోళం బిది మానవైక కుల సంభోగ్యంబుగాఁ జేసెనే

యాగీర్వాణుఁడు కీటక క్రిమి స తిర్యగ్యోని పక్ష్యాది జీ

వాగారం బగు నాఁ దలంచి మది నల్పాయుష్యుఁ డణ్వాయుధ

శ్రీ గర్వాంధుల నెల్ల నొక్క త్రుటిఁ  దాఁ జేసెన్ భయభ్రాంతులన్

1.  

 

 

 

15. ఉత్పలమాల.

ఛందము: కృతి

భ ర న భ భ ర లగ.

ప్రాస కలదు; యతి 10

కారణమౌఁ గరోన కృమి కాలుని శాసనమైన ధారుణిన్

మారణ సంస్తరమ్మునకు మానవ లోక వినాశకారి వి

డ్డూరము కాదె కీటకము డుల్చుట యివ్విధి శస్త్ర శాస్త్ర మే

ధోరమణీయ పారగులఁ దూర్ణము మాయ నెఱుంగ శక్యమే

[కర +ఊన కృమి = కరోన కృమి: చేతులు తక్కువైన కృమి]

2.  

 

 

 

128. మత్తేభవిక్రీడితము.

ఛందము: కృతి

స భ ర న మ య లగ.

ప్రాస కలదు; యతి 14

శశిపైఁ గాలిడి కృత్రిమంపు గ్రహముల్ సంధించి యాకాశ వీ

ధి శతానేక సహస్ర హస్తి నిభ శక్తిన్ మీఱు నస్త్రమ్ములన్

వశ మందుంచి యదృశ్య జాలక జగద్వ్యాపారముల్ వెంచినన్

దశ మారెం ద్వర నయ్యె మానవ గుణధ్వంసమ్ము కీటార్థమై

3.  

 

 

 

23.కందము.

ఛందము: జాతి

గాభజసనల గణాలలో 1,3 పాదాల్లో 3 గణాలు, 2,4 పాదాల్లో 5 గణాలు ఉండాలి. (2,4 పాదాల్లో) 6 వగణం జ/నల వాడాలి, చివర గురువు ఉండాలి. బేసిలో జగణం రాదు.

(యతి :2,4 పాదాల్లో) 7 గణాద్యక్షరం.

ప్రాస: కలదు. 

మానవ జాతి పయిఁ జలం

బూని సమర శంఖ మడరఁ బూరింప మహా

సేనా సంఘాతంబు క

రోనాది విభిన్న సంజ్ఞలు వెలార్చె నిలన్

4.  

 

 

 

11.ఆటవెలది.

ఛందము: ఉపజాతి

3సూ +2 ఇంద్ర 1,3 పాదాల్లో, 5సూ. 2,4 పాదాల్లో.

ప్రాస లేదు; యతి 4 గణాద్యక్షరం లేదా ప్రాసయతి

ఒకరి నుండి యొక్కరి కనుదినంబు వ్యా

పింపఁ గనులకుఁ గనిపింప కుండ

దిన దినంబు జనులు వనరి వనరి  లేక

పనులు నిల్చి రెల్లఁ గునుకు లేక   

5.  

 

 

 

55.చంపక మాల.

ఛందము: ప్రకృతి

న జ భ జ జ జ ర.

ప్రాస కలదు; యతి 11

అరయము కౌఁగిలింత లిఁక నా పులకింతలు వింత లెంతకున్

సరి యిఁకఁ బ్రీతి సంతుఁ గనఁ జాలము చెక్కిలి నొక్క దక్కునే

చిరముగ దూరమంచును వచింతురు వంత చెలంగ నెల్లరున్

విరిసెను గీటకం బకట వేల్చెను నిర్దయ మానవత్వమున్

6.  

 

 

 

7. అశ్వగతి.

ఛందము: అష్టి

భ భ భ భ భ గ.

ప్రాస కలదు; యతి 10

రూప మొకా నొక దేశములోఁ బ్రభవింప నిలం

దాప మొసంగఁ దొడంగెఁ బదమ్మును మోపి త్రుటిం

జూపక యెట్టి విభేదము సుంతయు దేశములం

బాపెను సర్వ జగమ్ములఁ బ్రాణము లింక రుషన్  

7.  

 

 

 

27. కరిబృంహితము.

ఛందము: ప్రకృతి

భ న భ న భ ర.

ప్రాస కలదు; యతి 13

ప్రాకిన దనతి కాలమున ఘన భైరవ కృమి పిశాచమే

వీఁకను సకల దేశముల నిజ విక్రమ పరుష వీర్యముల్

ప్రాకట మయి కనంబడ నఖిల బౌర నిచయ శరీరముల్ 

తాఁకి యసువులు గ్రోలెను దమినిఁ దద్దయుఁ జెలఁగి నిర్దయన్  

8.  

 

 

 

9. అష్టమూర్తి.

ఛందము: సంకృతి

మ న త స ర భ జ య.

ప్రాస కలదు; యతి 9,17

కష్టం బీ క్రిమినిఁ  గాంచంగఁ గనులన్ దుష్టమై రోగము నొసంగును మాయన్

నష్టంబే తనరె మిన్నంత లయముల్ కార్యముల్ వింతఁ జన కున్నను సంస్థల్ 

మృష్టాన్నమ్ము లిఁక నిబ్భూమిఁ గఱవే కాంచఁగా లేమి సెలఁగెం గడు ధాత్రిన్

దృష్టం బయ్యె మృతి విభ్రాంతిని విజృంభింప నగ్రాది ఘన దేశ సమూహిన్ 

9.  

 

 

 

69.తేటగీతి.

ఛందము: ఉపజాతి. 

1సూ +2ఇం+2 సూ.

ప్రాస లేదు; యతి 4 గణాద్యక్షరం లేదా ప్రాసయతి.

పుట్టి నప్పుడె వ్రాసెను మూరి బ్రహ్మ

గిట్టు టెప్పుడొ యది యెల్ల గుట్టు సుమ్ము

పోక కెల్లర కిద్ధర సాకె యగును

గాని కాదెన్నఁడు కరోన కారణమ్ము                             

10.   

 

 

                          

 

5. సామాజికాంశము 2. 

                                                    అరిషడ్వర్గములు.      

 

 

 

52. చంద్రశేఖర.

ఛందము: అతిశక్వరి

న జ ర జ ర.

ప్రాస కలదు; యతి 13

మద మిఁకఁ గ్రోధ కామ లోభ మోహ మత్స రా

ది దహన తుల్య షడ్గుణమ్ము లెల్ల దిట్టలై

యుదరెడు శత్రు వర్గమే నరాలి కుర్విలో 

వదలి మనంగ నుత్తమమ్ము తద్ద భద్రమౌ   

1.  

 

 

 

17. ఉపస్థిత.

ఛందము: త్రిష్టుప్పు

త జ జ గగ.

ప్రాస కలదు; యతి 8

సంకల్పము మీఱ భృశమ్ము కామం

బింకన్ జనియించు నహీనమై తా

నిం కంగ నిరూపణమే యొనర్పన్                 

శంకా రహితమ్ము వెసం దొలంగున్

[అంగ నిరూపణము = దేహ నిరూపణము]

2.  

 

 

 

78. నాగర.

ఛందము: అనుష్టుప్పు

భ ర లగ.

ప్రాస కలదు; యతి లేదు

పుట్టును గ్రోధ మాత్మలో

గట్టిగ తప్పు లింకఁ గ

న్పట్టఁగ నన్యు లందు వే

గిట్టును దాల్మిఁ బూనఁగన్

3.  

 

 

 

                187           . సింహరేఖ.

ఛందము: అనుష్టుప్పు

ర జ గగ.

ప్రాస కలదు; యతి లేదు

జీవు లస్థిరమ్ము లంచున్ 

భావ మెంచ కున్న లోభం

బే వడిన్ జనించు నెంచం

గా వడిం దొలంగు నాత్మన్  

4.  

 

 

 

74. నందిని.

ఛందము: పంక్తి

భ త జ గ.

ప్రాస కలదు; యతి 6

జ్ఞానము లేకున్నను లోభమే  

మానస మందుం బరఁగున్ వెసన్ 

మాను ఘ నాధర్మపుఁ బూతనున్

మానవుఁడే నెమ్మది వీడినన్  

5.  

 

 

 

58. జలదము.

ఛందము: అతిజగతి

భ ర న భ గ.

ప్రాస కలదు; యతి 10

విత్తము వంశ మింక నిజ విద్యలతోఁ

జిత్తమునన్ మదం బొదవు శీఘ్రముగా

నత్తఱి వాని నాశనము నారయఁగాఁ

జిత్తగు నా మదమ్ము నెదఁ జెల్వముగన్  

6.  

 

 

 

35. కుసుమవిచిత్రము.

ఛందము: జగతి

న య న య.

ప్రాస కలదు; యతి 7

అడరును మాత్సర్య మెడఁద సత్త్వా

త్ముఁ డగుచు నే మర్త్యుఁడు తనరం జా

లఁ డతని కెల్లన్ లయ మగు సేవల్

తొడరి యిడన్ సాధు గురులఁ గొల్వన్  

7.  

 

 

 

75. నర్కుటము.

ఛందము: అత్యష్టి

న జ భ జ జ లగ.

ప్రాస కలదు; యతి 11

నరులకుఁ గల్గు నాపద లనంతము లీ గుణముల్

బరగినఁ గల్గు నింపుగ శుభమ్ములు సద్గతు లే

నరు లిల వీని వీడి స్వమనమ్ముల నుందు రిలం

గరము ప్రశాంతి వారికి సుఖమ్ములఁ దేలఁ ధృతిన్   

8.  

 

 

 

29. కలితాంతము.

ఛందము: త్రిష్టుప్పు

త జ జ లగ.

ప్రాస కలదు; యతి 8

తోఁడేళుల భంగినిఁ దోరముగా

వీడన్ ధృతి నాత్మను వీరినిఁ జెం

డాడున్ గుణరాశి నరాలి ధృతిం 

దోడుంచ సతం బవి దూఱ వెదన్ 

9.  

 

 

 

129. మదనదర్పణము.

ఛందము: అష్టి

భ స జ ర జ గ.

ప్రాస కలదు; యతి 11

మానుగ మఱి ధర్మ బద్ధ కామ మొప్పు నింపుగా 

మానవ తతి కెల్ల వేళలన్ మహీతలంబులో  

నానగఁ దగుఁ గ్రోధ మాత్మ నార్య కోటి కాజిలోఁ 

గానఁగ నయ దూరు లైనఁ నుగ్ర శత్రు వీరులన్    

10.   

 

6. సామాజికాంశము 3. 

సృష్టి వైచిత్ర్యము.

 

 

 

5.హేతి.

ఛందము: 14 శక్వరి

న జ జ భ గల.

ప్రాస కలదు; యతి 8

అల నఖి లాండము లందు భూ వలయమ్ము                 

జల పర మాండము చక్కఁ దేలుచు భూమి                  

తల ముదకమ్మునఁ దా నణుప్రతి యెంచ   

నలయక తిర్గుచు నాకసమ్మున వెల్గు 

1.     

 

 

 

1. కళావతి.

ఛందము: 13 అతిజగతి

న య స జ గ.

ప్రాస కలదు; యతి 7

తిరుగుచు సప్తాబ్ధి నికాయ మందు న

ప్చరములు భాసింపఁగ వింతయౌ మ హా

చర తతులే మించ సజీవ హీన జీ

వ రమణముల్ తోఁప వనాంతరమ్మునన్ 

2.    

 

 

 

2. రాజబాల.

ఛందము: 13 అతిజగతి

జ ర స ర గ.

ప్రాస కలదు; యతి 7

జ లోర గాదిగా ఝషముల్ నక్రముల్ మీ

లు లీల నుండ వీలుగ మున్నీటిగుఱ్ఱ

మ్ములుం దిమింగిలమ్ములు నష్టాంఘ్రులున్ నీ

టిలోనఁ దిర్గు చుండి చెలంగున్ మహాబ్ధిన్        

3.    

 

 

 

3. కాకిణిక.

ఛందము: 14 శక్వరి

జ జ భ జ లగ.

ప్రాస కలదు; యతి 8

సముద్ర సుగర్భ వృక్షములు స్థాణువులై      

సమంచిత రీతి వ్యస్తము లనేక సువ

ర్ణ మాన్య తృణమ్ము లన్యములు లోతునఁ బ్రా

ణముల్ దనరంగ రత్ననిధిలో నిలుచున్    

4.    

 

 

 

4. నాసాభరణము.

ఛందము: 14 శక్వరి

త య భ త లగ.

ప్రాస కలదు; యతి 8

మేలౌ పగడమ్ముల్ పమ్మి లభింపంగను ర

త్నాలింపుగ నభ్ధిన్ లబ్ధములే ముత్యములున్ 

ఱా లుండు మనమ్ముల్ చూఱకొనన్ మిన్నగ శం

ఖా లుండు ననేకమ్ముల్ కమనీయమ్ము లటన్

5.    

 

 

 

6. నిశ్చల.

ఛందము: 15 అతిశక్వరి

భ త న మ త.

ప్రాస కలదు; యతి 6

భంగములే విభ్రమముగ నిత్యం బాకాశంపు

సంగమ సత్కాంక్ష దనర యత్నించున్ నిశ్శంకఁ

బొంగుచు వార్వంపు టనలమే తోయాంతార్భాగ  

తుంగ తలం బందు సతము భాసిల్లున్ లోలోన 

6.    

 

 

 

7. ధామ.

ఛందము: 15 అతిశక్వరి

మ త జ త జ.

ప్రాస కలదు; యతి 6

ఆటుల్ పోటుల్ నిత్యము వెల్గ నెన్నండు మహాబ్ధి

దాటంగా వేలాంతము నేర దంబోధి తలంపు 

నీటిన్ సూర్యుండే నిరతమ్ము దాఁ ద్రాగి కడింది

నోటన్ వీకం బన్నుగఁ దిర్గి వర్షంబు నొసంగు  

7.    

 

 

 

8. శంఖావలి.

ఛందము: 15 అతిశక్వరి

త భ ర న స.

ప్రాస కలదు; యతి 7

ఉత్సాహ మొప్పఁగ నుర్విలో నదులు నదముల్

సత్సంగ మింపుగ సాగరమ్మున నొనరుచున్

సోత్సేక మార్యుని నూర్మిమాలిఁ దలఁచి రతిం

బ్రోత్సాహ మీయఁగ భూత సంచయముల కిలన్  

8.    

 

 

 

9. కాలసారోద్ధత.

ఛందము: 17 అత్యష్టి

జ త జ స య లగ.

ప్రాస కలదు; యతి 9

స మేదినీ తోయ విలాస వర మండలం బింపుగా 

సమంచి తాకాశ విశేష విమ లేద్ధ గోళస్థమై                   

క్రమంపు వాయ్వండము చక్కఁగఁ బ్రకాశవంతమ్ముగా 

నమేయ జీవాలికి నిత్య నిలయంబునై భాసిలున్     

9.    

 

 

 

11. పరిణాహి.

ఛందము: 14 శక్వరి

మ భ స భ గగ.

ప్రాస కలదు; యతి 8

ఈ గాలిం దిర్గుచు నహి భక్షద్విజ రాశుల్

సాగుం బేరాసను వెస మాంసమ్మును దించున్ 

దాఁగంగాఁ బండ్లు సతతముం గొన్ని ఖగమ్ముల్ 

వే గొంచున్ భక్షణము వెసం జేసి చరించున్     

10.  

 

 

 

12. మారాభిసరణము.

ఛందము: 19 అతిధృతి

త న మ భ స య గ.

ప్రాస కలదు; యతి 11

ఎన్నంగఁ బరమ సూక్ష్మమ్ముల్ వేయి విధము లైన జీవమ్ముల్

సన్నమ్ము లయిన కీటమ్ముల్ సంచరము లగోచరప్రాణుల్

వెన్నంటి సకల భూతాలిన్ వేఁపి యసువు లెల్ల క్షీణింపన్ 

ఛిన్నమ్ముల నవి సేయుం దర్జించి యనిల గర్భ వాసమ్ముల్ 

11.   

 

 

 

13. అవంధ్యోపచారము.

ఛందము: 20 కృతి

యయ యయ యయ లగ.

ప్రాస కలదు; యతి 13

అనేకమ్ములౌ గాలులన్ వాయు గోళం బనూహ్యమ్ముగా నిత్యముం

దనంతన్ వహింపంగఁ దానే  తరువ్రాత జీవాలి జీవింపఁగా

సునాయాస నిశ్వాస సోచ్ఛ్వాసముల్ భాసురంబై సుజీవంబు సా

గ నిత్యమ్ము నాహార మేపారుఁ జక్కంగ విశ్వంబునం దింపుగా

12.  

 

 

 

14.వంశలోన్నత.

ఛందము: 21 ప్రకృతి

ర జ ర మ జ ర మ.

ప్రాస కలదు; యతి 16

మారు తాగ్ర్య గోళ మందు నంభో గోళంబు పైన మట్టి పెంపారంగన్

మూరి యొక్క వంతు నందు నుగ్రారణ్యమ్ము లుండు భూరి శైలశ్రేణుల్

చారు కందరాలి నిర్ఝరమ్ముల్ పల్లమ్ము లింక సాను సంఘాతమ్ముల్

సార భూతలంబు లుండుఁ గాసారమ్ముల్ సెలంగు సస్రవంతీ కోటుల్   

13.  

 

 

 

15.ద్రుతముఖము.

ఛందము: 22 ఆకృతి

నన నన మర యగ.

ప్రాస కలదు; యతి 13

పుడమి యడుగునఁ బయినను నమోఘమ్ముల్ జంతు జాలముల్  వేవే

లడరును వివిధ రకములు మహా సత్త్వమ్ముల్ మహాల్ప జీవమ్ముల్

తొడరఁ దొడరక నడుగులు చతుష్పాదద్వంద్వ పాద యుక్తమ్ముల్ 

వడసివిరివి యడుగు లడరు ప్రాణిశ్రేణుల్ వసించుఁ జిత్రమ్ముల్  

14.  

 

 

 

16.వాగీశ్వరి.

ఛందము: 23 వికృతి  

యయ యయ యయ య లగ.

ప్రాస కలదు; యతి 9, 17

సజీవ వ్రజమ్ముల్ మహీజమ్ములే రమ్య భీమోగ్ర శాఖా యుత స్థాణువుల్

సజీవ వ్రజమ్ముల్ లతా సంచయమ్ముల్ పరాధీన సత్త్వాలి ప్రాఁకుం దగన్

సజీవ వ్రజమ్ముల్ చతుష్పాద నీడోద్భవమ్ముల్ సుసంచార వేదమ్ములౌ

సజీవ ద్విపాద వ్రజ జ్ఞాన వన్మానవుల్  శ్రేష్ఠ సంచార భాషజ్ఞులే 

15.  

 

 

 

17.ఆభార.

ఛందము: 24 సంకృతి  

తత తత తత తత.

ప్రాస కలదు; యతి 13

నీరమ్ము సంప్రీతి నంభోధి దానమ్ము నిత్యమ్ము నిస్వార్థ మేపారఁ దాఁ జేయుఁ  

దోరమ్ము వృక్షాళులే యిచ్చు నిద్ధాత్రిఁ దూర్ణమ్ముగాఁ బండ్లఁ బత్రాలిఁ గాష్ఠాలి

క్షీరమ్ముఁ బ్రీతిన్ గవౌఘమ్ము మర్త్యాలికిన్ సంతతం బిచ్చు నాశింప కెద్దేనిఁ 

దోరంపు జ్ఞానమ్ము వర్ధిల్ల మర్త్యుండు తుష్టుండు దానేమి యీ నేర్చు నిద్ధాత్రి     

16.  

 

 

 

18. అభ్రభ్రమణము.

ఛందము: 25 అభికృతి  

తన మస నన నన గ.

ప్రాస కలదు; యతి 13

భూభృద్వర సుమహా పంక్తుల్ సెలఁగుం బుడమి ననల జనన తలములై

యాభీలముగ ద్రవాకా రాశ్మములై యడవులఁ బరఁగు ననల మధికం

బై భీతి నొసఁగ సర్వప్రాణుల కత్యధికము నదులఁ జెలఁగు వఱదల్

భూ భాగ మఖిలమున్ మున్గంగ వడిం బుర వరముల జనపదములలో

17.  

 

 

 

19. దర.

ఛందము: 30

నన నన నన నన భ స.

ప్రాస కలదు యతి9,17,25

కలుఁగుల మెలఁగును గతిపయ చరములు కఱచుచుఁ గ్రిములను గాఢముగ నిలన్

గులుకుచు నెదఁ బులుఁగులు తృణ దళ తతిఁ గొని శిశుల నునుచు గూఁడుల నెలమిన్

కొలఁకుల జలమును గొనుచు గుహల మఱుఁగుపడు తిని పలముఁ గ్రూర మృగ తతుల్ 

నిలయముల నిల గణితముల నిలుతురు నిరతిని మనుజులు నెమ్మి నిరతమున్

18.  

 

 

 

10.అంగన.

ఛందము: ధృతి.

భ భ భ భ భ మ.

ప్రాస కలదు; యతి 7,13

మానస వృత్తిని మానిత వాక్కుల మానక కర్మాలిన్ 

మానవుఁ డుండఁగ మంచిగఁ బొందఁగ మన్నన లెన్నండుం

బూనక కల్మషమున్ దయ ప్రాణుల మూరఁగ నిత్యమ్ముం 

దా నగు దేవుఁడు ధాత్రిని నెల్లరు దండము లీయంగన్

19.  

 

 

 

20.త్రిభంగి.

ఛందము: 34

నన నన నన సస భ మ స గ.

ప్రాస కలదు; ప్రాస యతి 9,17

25,29,34 అంత్య ప్రాస

తెలివిఁ గుశలతను బలుకుల స్మృతులను గలిగిన యట్టి జనమ్ముల్ విభవమ్ముల్ మూర బలమ్ముల్ 

చలమునఁ గరము రగులుచు నెడఁదలఁ బగలను వహించి భృశమ్మున్ సతతమ్మున్ దేశ గణమ్మున్ 

విలయ మొనరుచు గతులఁ దమ మనములఁ దలఁపక శాంతిని నుండన్ దయ నిండన్ లోకుల కండన్ 

నిలువుఁడు భవముల నిల నిడినఁ బరముఁ గొలువుఁడు నిత్యము రక్తిన్ ఘన యుక్తిన్ మించఁగ ముక్తిన్    

20.  

 

10/3/2022 సంపూర్ణము.

 

  

 

పూరు వంశ క్రమము:

భార. ఆది. 3. 89-                        పుట: 108

కశ్యపుఁడు అదితి

వివస్వంతుఁడు

వైవస్వత మనువు

ఇల- సోమ పుత్రుఁడైన బుధుఁడు – పురూరవుఁడు 

పురూరవుఁడు ఊర్వశి

ఆయువు; ధీమంతుఁడు; అమావసువు; దృఢాయువు; వనాయువు; శతాయువు 6 సుతులు.

ఆయువు- స్వర్భానవి లకు నహుషుఁడు; వృద్ధుఁడు; శర్మ; రజి; గయానేనసుఁడు -5 సుతులు

నహుషుఁడు చక్రవర్తి 100 క్రతువులు

నహుషుఁడు ప్రియవాస లకు యతి; యయాతి; సంయాతి; ఆయాతి; అయతి; ధృవుఁడు 6 సుతులు

యయాతి చక్రవర్తి యయాతి దేవయానులకు యదువు; తుర్వసువు 2 సుతులు

యయాతి శర్మిష్ఠలకు ద్రుహ్యుఁడు; అనువు; పూరుఁడు 3 సుతులు

పూరుఁడు- కౌసల్యలకు జనమేజయుఁడు

జనమేజయుఁడు- అనంతలకు ప్రాచిన్వంతుఁడు (ప్రాచీశుఁడు)

ప్రాచిన్వంతుఁడు అశ్మకి సంయాతి

సంయాతి - వరాంగి అహంయాతి

అహంయాతి భానుమతి సార్వభౌముఁడు

సార్వభౌముఁడు సునంద జయత్సేనుఁడు

జయత్సేనుఁడు సుశ్రవస అవాచీనుఁడు

అవాచీనుఁడు వైదర్భి యైన మర్యాద అరిహుఁడు

అరిహుఁడు ఆంగి మహాభౌముఁడు

మహాభౌముఁడు ప్రసేనజిత్పుత్రి యైన సుపుష్ట అయుతానీకుఁడు                            

అయుతానీకుఁడు కామ అక్రోధనుఁడు

అక్రోధనుఁడు కరంభ దేవాతిథి

దేవాతిథి వైదేహి యయిన మర్యాద ఋచీకుఁడు

ఋచీకుఁడు సుదేవ ఋక్షుఁడు

ఋక్షుఁడు జ్వాల మతినారుఁడు

మతినారుఁడు సరస్వతీ నది త్రసుఁడు

త్రసుఁడు కాళింది నిలినుఁడు

నిలినుఁడు రథంతరి దుష్యంతుఁడు

దుష్యంతుఁడు శకుంతల భరతుఁడు

భరతుఁడు కైకేయి యయిన సునంద భుమన్యుఁడు

భుమన్యుఁడు విజయ సుహోత్రుఁడు

సుహోత్రుఁడు సువర్ణ హస్తి

హస్తి యశోధర వికుంఠనుఁడు

వికుంఠనుఁడు వసుదేవ అజమీఢుఁడు

అజమీఢుఁడు కైకేయి, గాంధారి, ఋక్ష 124 సుతులు వారిలో ముఖ్యుఁడు సంవరణుఁడు

సంవరణుఁడు తపతి కురుఁడు

కురుఁడు శుభాంగి విదూరథుఁడు

విదూరథుఁడు సంప్రియ అనశ్వుఁడు

అనశ్వుఁడు అమృత పరీక్షితుఁడు 

పరీక్షితుఁడు -  సుయశ భీమసేనుఁడు

భీమసేనుఁడు కుమారి ప్రదీపుఁడు

ప్రదీపుఁడు ప్రతీపుఁడు     

ప్రతీపుఁడు శిబి పుత్రి సునంద -  దేవాపి; శంతనుఁడు; బాహ్లికుఁడు -3 సుతులు

శంతనుఁడు గంగా దేవి   దేవవ్రతుఁడు (భీష్ముఁడు)

 శంతనుఁడు సత్యవతి చిత్రాంగదుఁడు, విచిత్ర వీర్యుఁడు 2 సుతులు

విచిత్ర వీర్యుఁడు అంబిక, అంబాలిక 2 భార్యలు

దేవర న్యాయమున కృష్ణద్వైపాయనుఁడు అంబిక యందు ధృతరాష్ట్రుఁడు; అంబాలిక యందు పాండురాజు; అంబికా పరిచారిక యందు విదురుఁడు

ధృతరాష్త్రుఁడు గాంధారి దుర్యోధ నాదులు 100 మంది దుర్యోధను పిదప వైశ్యాపుత్రుఁడు యుయుత్సుఁడు  అందఱి కనుజ చిన్న దుశ్శల మొత్తము 101 పుత్రులు 1 కూతురు పుట్టిరి. 

పాండురాజు కుంతీ మాద్రులకు ధర్మ శక్రానిలాశ్వినుల ప్రసాదమున ధర్మరాజు, భీముఁడు, అర్జునుఁడు నకులుఁడు, సహదేవుఁడు

ధర్మరాజు ద్రౌపది ప్రతివింధ్యుఁడు; దేవిక - ఔథేయుఁడు

భీముఁడు ద్రౌపదిశ్రుతసోముఁడు; జరంధర సర్వగుఁడు; హిడిమ్బి ఘటోత్కచుఁడు 

అర్జునుఁడు -  ద్రౌపది శ్రుతకీర్తి; సుభద్ర - అభిమన్యుఁడు

నకులుఁడు ద్రౌపది శతానీకుఁడు; కరేణుమతి - నిరమిత్రుఁడు

సహదేవుఁడు ద్రౌపది శ్రుతసేనుఁడు; విజయ సుహోత్రుఁడు

అభిమన్యుఁడు ఉత్తర పరీక్షితుఁడు

పరీక్షితుఁడు జనమేజయుఁడు

జనమేజయుఁడు వపుష్టమ శతానీకుఁడు, శంకుకర్ణుఁడు -2 సుతులు

శతానీకుఁడు వైదేహి అశ్వమేధ దత్తుఁడు

వీరు - ఐలులు, పౌరవులు, కౌరవులు, పాండవులు

 

 

వాసుదేవ వంశ క్రమము:

యదువు

సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రిపుడు

క్రోష్టువు

వృజినవంతుడు

శ్వాహితుడు

భేరుశేకుడు

చిత్రరథుడు

శశిబిందుడు, పది వేల భార్యలు

పదివేల లక్షల కొడుకులు,  ముఖ్య 6 గురి లో  పృథుశ్రవుడు

ధర్ముడు

ఉశనుడు

రుచకుడు

పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జ్యాముఖుడు

జ్యాముఖుడు

విదర్భుడు

కుశుడు  కృధుడు  రోమపాదుడు

 

కృధుడు

కుంతి

ధృష్టి

నిర్వృతి

దశార్హుడు

వ్యోముడు

జీమూతుడు

వికృతి

భీమరథుడు

నవరథుడు

దశరథుడు

శకుని

కుంతి

దేవరాతుడు

దేవక్షత్రుడు

మధువు

కురువశుడు

అనువు

పురుహోత్రుడు

అంశువు

సాత్త్వతుడు

భజమానుఁడు, భుజి, దివ్యుడు, వృష్టి, దేవాపృథుడు,       అంధకుడు, మహాభోజుడు

 

అంధకుడు

భజమానుడు

విడూరథుడు

శిని

భోజుడు

హృదికుడు

దేవమీఢుడు / శూరుడు- భార్య మారిష, శతధనువు,  కృతవర్మ 

 

శూరుడు

1.      వసుదేవుడు, 2. దేవభాగుడు, 3. దేవశ్రవుడు, 4. ఆనకుడు, 5. సృంజయుడు, 6. శ్యామకుడు, 7. కంకుడు, 8. అనీకుడు, 9. వత్సకుడు, 10. వృకుడు

పుత్రికలు

1.      పృథ, 2. శ్రుతదేవ, 3. శ్రుతకీర్తి, 4. శ్రుతశ్రవస, 5. రాజాధిదేవి

 

వసుదేవుడు / ఆనకదుందుభి            

 

కృష్ణుని భార్యలు, పుత్రులు:

రుక్మిణి- ప్రద్యుమ్నుఁడు

జాంబవతి- సాంబుఁడు

సత్యభామ

కాళింది

మిత్రవింద

నాగ్నజితి

భద్ర

లక్షణ

రోహిణి మొదలగు 16 000 మంది భార్యలు (నరకాసురుని చెఱ నున్నవారు)

 

భార్య లందఱికి నొక్కొక్కరికి పదుగురు పుత్రులు .

ప్రద్యుమ్నుఁడు శుభాంగి

అనిరుద్ధుఁడు –

వ్రజుఁడు

సుబాహుఁడు

ఉగ్రసేనుఁడు

శ్రుతసేనుఁడు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

5. సామాజికాంశము:

                                                                   అరిషడ్వర్గములు. 

కామక్రోధలోభ మోహ మద మాత్సర్యము లరిషడ్వర్గములు.

భార. శాంతి. 3. 421.

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి