అజ్ఞానం బన పుండరీక నయన ధ్యానప్రభా హీనమే
యజ్ఞానం బన సంత తేంద్రియ విలోలైకాత్మ సంరంభమే
యజ్ఞానం బన భూత సంచయ దయా వ్యాపార రాహిత్యమే
విజ్ఞానం బన నంతరాత్మ విలసద్విశ్వాత్మ సుజ్ఞానమే 11
ఖరశస్త్రోద్ధత నిత్యరాజ్య ఘన రక్షా తత్పరుల్ సైనికుల్
శర దిందుస్ఫుట నిర్మ లాత్మ జన రక్షా తత్పరుల్ పాలకుల్
పరమన్యాయ సమేత వర్తకులు సద్వాణిజ్య దీక్షా పరుల్
భర తాఖ్యావని ధర్మ వర్తన రతుల్ పౌరుల్ సదాచారులున్ 10
హృద్రోగక్షయ మంత్రము:
విట్ఠల విట్ఠల విట్ఠల
విట్ఠల విట్ఠల విశుద్ధ విట్ఠల నామా!
విట్ఠల విట్ఠల విట్ఠల
విట్ఠల విట్ఠల రుజాఘ్న విట్ఠల కృష్ణా! 9
భగవద్జ్ఞాన వికాస సంభరిత సుస్వాం తారవిందప్రభా!
విగ తాంతర్గత వైరి షడ్గణ! మహా వేదాంత విద్యా ప్రవీ
ణ గరిష్ఠా! విమ లాంతరంగ! నుత కృష్ణస్తోత్ర పారాయణా!
సుగుణభ్రాజిత పోచిరాజ కుల సుశ్లోకైక రత్నాంకురా! 8
తారక మంత్ర తుల్యములు ధారగ ధాత్రిని రాజశేఖ రా
పార సమైక్య దంపతులపైఁ బ్రసరించుచు నుండ స్వీయ భా
ర్యా రమణీ సమేత రఘురామ కృపారస వీక్షణమ్ములే
వారక పుత్ర పౌత్ర గణ వర్ధన మయ్యెడుఁ గాక నిత్యమున్ 7
శ్రీష్ట మనోరథ తతులం
బుష్టిగను వధూవరులకు మూరిన కరుణం
దుష్టిని నిత్తురు గావుత!
సృష్టిస్థితిలయ నిమిత్త
కృతనిశ్చయులే 6
ఛందోభాషణము:
కుశలంబే యవధాని వర్యునకు సంక్షోభమ్మునుం గాంతురే
విశదంబే కద మీకు సర్వము నహో వీక్షింపరే మా వెతల్
యశ మే మాత్రముగా గడించితిరి మీ రార్యా! యెఱింగింపరే
కృశియింపం దను వివ్విధమ్ము గనరే కీర్తిన్ మదాప్తమ్మునున్ 5
అరుదుల నా నిషిద్ధ మరు దక్షర ఘోర గదా సమస్యలం
ద్వరఁ జలియింప దత్త పద తాడన దూషణ వర్ణనమ్ములం
బరుషపు న్యస్త శస్త్రములు వారఁ బరస్పర భాషణమ్ములం
దర తమ మెంచఁ జాగు నవధాన రణం బిల వాక్ఛరమ్ములన్ 4
గగనాన వెలసిన కమలాప్తు భంగినిఁ జిత్తూరు సీమను జెన్ను మీఱి
యాకాశ మార్గాన నలరు తారల భంగి కమ్మని తెనుఁగులోఁ గవిత లల్లి
ఫణిరాజు భోగమ్ము పై నున్న మణి వోలె వెలకట్ట లేనట్టి బిరుదు లూని
దక్షిణ దేశానఁ దనరారు భాషల నైపుణ్య వారాశి నేపు మీఱి
మాడభూషి వంశ జనిత మణివి మాన్య!
తెనుఁగు లిపికి విశ్వమ్ములో ఘనపు ఖ్యాతిఁ
దనరఁ జేసి తీవు తెలుఁగు జనులలో ఘ
నుఁడవు సంపత్కుమార వినుత వరాఖ్య! 3
తనరం గ్రోధి వరాఖ్యయే గరిమ వీతక్రోధినీ! సంతతం
బనివార్యద్యుతి మానవాలి కిలలో నైశ్వర్య మింపారఁగా
నొనరం జేసి దయార్ద్ర చిత్త వయి నిత్యోద్యోగ సంసక్తతన్
మన నిమ్మా విగతక్షు ధార్తులుగ సంభావించి వర్షోత్తమా! 2
భూగోళమ్మున మూడు వంతులు మహాంభోధుల్
గొనన్ శేష మా
భాగం బందు నరణ్యముల్ నదు
లఖర్వక్ష్మాధరమ్ముల్ తరుల్
భాగమ్ముం గొని నిత్య ముండఁగ నరుల్
భద్రమ్ముగా నిల్తు రీ
యాగారమ్ముల జంతు సంచయ విహంగౌఘమ్ము
వర్ధిల్లఁగన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి