27, ఫిబ్రవరి 2023, సోమవారం

సత్యమార్గ నిజభాషా సేవ.

సత్యమార్గ నిజభాషా సేవ.

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)

 

 

 

నిజమైన మార్గములోఁ దన యొక్క భాషకుఁ జేయ సంకల్పించు సేవా  కార్య క్రమములలోఁ బ్రధాన కార్యము వివరించుటయే యీ ఖండిక ముఖ్యోద్దేశము. 

 

 

 

 

చం.

తొలఁగిన నేఁడు దాస్య గుణ  దుస్థితి పాలన మందు నక్కటా

కలిగెను మాతృ భాషల కఖర్వ నిరాదరణమ్ము నిత్యముం

గలుషిత శబ్ద మిశ్రములు కానఁగ వచ్చె విచిత్ర రీతులన్

వెలవెలఁ బోవఁ బండితులు పెర్గెను బేదఱికమ్ము భాషలన్

1.      

 

 

 

మత్తకోకిల.

పొట్ట కూటికి గౌర వార్థము భూరి విత్త వదాన్యముల్

వట్టు వీడక సంతతమ్మును ప్రాభ వాధిక విద్యలన్

బెట్టిదమ్ముగ నేర్చు చుండఁగఁ బేర్మిఁ గానక భాషలే

పట్టణమ్ములఁ బల్లె లందును వట్టి వయ్యెను గాంచుమా   

2.     

 

 

 

శా.

సేవాదృక్పథ మెంచి భాష కిల సుశ్రేయమ్ము సిద్దింపఁగాఁ

బ్రావీణ్యమ్మున నిత్య కృత్యములఁ దద్భాషా నిధానమ్ములన్

వైవిధ్యమ్మున శబ్ద సృష్టి నొనరింపం బూని కవ్యోఘముల్

వే వారింపఁగ సంకరమ్ములను నిర్భీతిం బ్రసాదం బగున్

3.     

 

 

 

చం.

జన విభు సంఘ మొక్కటినిఁ జక్కఁగఁ గూర్చియు సమ్య కాధిప

త్య నిచయ యుక్త సాధన వితాన మొసంగి స పండి తావలిన్

వినఁబడు నన్య దేశ్య పద వృష్టికి దేశ్య పదమ్ము లింపుగాఁ

బనిచిన సృష్టిఁ జేయఁ బద భాండము నింపఁగ మేటి మే లగున్    

4.     

 

 

 

తే.గీ.

పలు దెసల నవి చక్కఁగ వ్రాసి వ్రాసి

బాల బాలిక లెల్లరు వల్కఁబల్క

వృద్ధ తరుణ సందోహము వినఁగ వినఁగ

నోళ్ల జనుల కెల్లను నాను నూఱ నూఱ              

5.     

 

 

 

ఉ.

మచ్చున కిత్తు నిచ్చట సమంచిత నూతన శబ్ద సూనముల్

మెచ్చ సుధీ జనవ్రజ సమేతము నెల్లరు స్వీయ సృష్టముల్ 

ముచ్చటఁ గాంచఁగా మొగపుఁ బొత్తము నిత్తెపు లెక్క యంకెయున్    

నచ్చిన యంక యంత్రము లనన్ వలలోఁగలి నీదుగొట్టముల్   

 

[మొగపుఁ బొత్తము = Face Book ; నిత్తెపు లెక్క యంకె (నిలెయం) = PAN ; అంక యంత్రము = Computer; వలలోఁగలి =Internet ; నీదుగొట్టము = You Tube]  

6.     

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి